తెలుగుదేశం మహానాడుకు ఏర్పాట్లు పూర్తి..

- May 26, 2023 , by Maagulf
తెలుగుదేశం మహానాడుకు ఏర్పాట్లు పూర్తి..

అమరావతి: తెలుగుదేశం మహానాడు రేపటి (శనివారం) నుంచి ప్రారంభం కానుంది. మహానాడు 2రోజులపాటు జరుగనుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో టీడీపీ మహానాడు నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఈ మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ సన్నద్ధం అవుతుంది. సన్నాహక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అధినేత చంద్రబాబు, నారా లోకేష్ రాజమండ్రికి రానున్నారు.

సాయంత్రం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరుగనుంది. మహానాడు అజెండాతో పాటు రానున్న రోజుల్లో పార్టీ పరంగా అనుసరించే రాజకీయ విధానాలను పొలిట్ బ్యూరో ఖరారు చేయనుంది. మహానాడులో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పార్టీ అధినాయకత్వ పర్యవేక్షణలో భారీగా ఏర్పాట్లు చేశారు.

దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో ఈసారి మహానాడు వేడుక జరుగనుంది. మే27న సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ప్రతినిధుల సభ ఉంటుంది. మే28న సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో మహనాడు బహిరంగ సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. పార్కింగ్, భోజన స్టాళ్లకు సుమారు 140 ఎకరాల మేర కేటాయించారు. మే27న నిర్వహించే ప్లీనరీ ప్రాంతంలో సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధాన వేదికను నిర్మించారు.

ఎన్టీఆర్, చంద్రబాబు పరిపాలనలో పేదలకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి, చంద్రబాబు హయాంలో రాష్ట్రాభివృద్ధికి విదేశాలు వెళ్లి పెట్టుబడులు తెచ్చేందుకు చేసిన కృషి తదితర అంశాలను నేటి తరానికి తెలియజేసేలా డిజిటల్ ఫొటో ఎగ్జిబిషన్ లు ఏర్పాటు చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com