పారామిలటరీతో చర్చలను నిలిపివేసిన సూడాన్‌ ఆర్మీ

- June 01, 2023 , by Maagulf
పారామిలటరీతో చర్చలను నిలిపివేసిన సూడాన్‌ ఆర్మీ

కార్టూమ్‌: పారామిలటరీ ర్యాపిడ్‌ సపోర్ట్‌ పోర్సెస్‌ (RSF)తో కాల్పుల విరమణ చర్చలను నిలిపివేసినట్లు సూడాన్‌ ఆర్మీ బుధవారం ప్రకటించింది. జెద్ధాహ్ లోని  ఓడరేవు నగరంలో ఆర్‌ఎస్‌ఎఫ్‌తో కొనసాగుతున్న చర్చల్లో సూడాన్‌ ఆర్మీ ప్రతినిధి బృందం పాల్గొనదని  సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆస్పత్రులు, పరిసరప్రాంతాలతో సహా పౌర ప్రాంతాల నుండి వైదొలగాలన్న నిబంధనను ఆర్‌ఎస్‌ఎఫ్‌ ఉల్లంఘించిందని ఆ వర్గాలు వెల్లడించాయి. సూడాన్‌ ఆర్మీ, ఆర్‌ఎస్‌ఎఫ్‌ల మధ్య వారం రోజుల కాల్పుల విరమణ ఒప్పందం సోమవారంతో ముగియడంతో.. మరో ఐదురోజుల పాటు పొడిగించేందుకు ఇరు బృందాలు అంగీకరించిన సంగతి తెలిసిందే.

అయితే సూడాన్‌ రాజధాని కార్టూమ్‌కు పశ్చిమాన ఒమ్‌దుర్మాన్‌లోని అల్‌ మొహందిసీన్‌ జిల్లాలో బుధవారం ఉదయం ఘర్షణలు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. దీంతో కార్టూమ్‌ మరియు ఓమ్‌దుర్మాన్‌లను కలిపే అల్‌ -ఫాతిహాబ్‌ వంతెనను ఆర్మీ మూసివేసింది. అయినప్పటికీ ఆ ప్రాంతంపై యుద్ధ విమానాలు తిరుగుతున్నాయని ఆర్మీ పేర్కొంది. కార్టూమ్‌లోని తమ స్థావరాలపై ఆర్మీ బాంబు దాడి చేసిందని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆర్మీ ఉల్లంఘించిందని ఆర్‌ఎస్‌ఎఫ్‌ ఆరోపించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 15 నుండి సూడాన్‌లో ఆర్మీ, ఆర్‌ఎస్‌ఎఫ్‌ల మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ పోరులో ఇప్పటి వరకు 800 మందికి పైగా మరణించారు. సుమారు 14 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com