హైదరాబాద్-విజయవాడ హైవేపై వెళ్లేవారికి హెచ్చరిక

- July 28, 2023 , by Maagulf
హైదరాబాద్-విజయవాడ హైవేపై వెళ్లేవారికి హెచ్చరిక

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతుండడం తో వాగులు , వంకలు , చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో చాల చోట్ల రోడ్లు తెగిపోయి, రవాణా వ్యవస్థ స్తంభించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్-విజయవాడ హైవేని కూడా వరద తాకింది. కంచికచర్ల మండలం కీసర సమీపంలో ఎన్టీఆర్‌ జిల్లాలోకి మునేరు ప్రవేశిస్తుంది. దీంతో జాతీయ రహదారిపైకి వరద చేరడంతో కీసర టోల్‌గేట్‌ సమీపంలోని ఐతవరం వద్ద నిన్న సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేశారు. దీంతో సుమారు 2 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. హైవే పై వాహనాలను పలు మార్గాల ద్వారా మళ్లిస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

ఎదులనాగులపల్లి వద్ద గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడకు వెళ్లే ఎగ్జిట్‌ నెం. 2, శామీర్‌పేట సమీపంలోని ఎగ్జిట్‌ నెం. 7 రెండూ మూసివేశారు. గత పది రోజులుగా పడుతున్న వానలకు రోడ్లు పాడైపోవడం, గుంతలు ఏర్పడటం, భారీగా నీళ్లు నిలిపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మూసివేస్తున్నట్లు అధికారులు చెపుతున్నారు..

హైదరాబాద్–విజయవాడ, విజయవాడ–హైదరాబాద్ ల మధ్య ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రయాణికుల క్షేమం కోరి వాహనములను అనుమతించడం లేదని ప్రకటించారు. హైదరాబాద్ నుండి విశాఖపట్నంకు విజయవాడ మీదుగా వెళ్లే వాహనాలు నార్కట్‌పల్లి మీదుగా వెళ్లాలని సూచించారు. హైదరాబాద్–నార్కెట్ పల్లి–మిర్యాలగూడ–దాచేపల్లి–పిడుగురాళ్ల- సత్తెనపల్లి – గుంటూరు–విజయవాడ–ఏలూరు–రాజమండ్రి–విశాఖపట్నంకు వెళ్లాలని సూచించారు.

విశాఖపట్నం నుంచి వచ్చే వాహనాలు రాజమండ్రి-ఏలూరు–విజయవాడ–గుంటూరు– సత్తెనపల్లి–పిడుగురాళ్ళ–దాచేపల్లి–మిర్యాలగూడ–నార్కెట్ పల్లి–హైదరాబాద్ కు వెళ్ళాలని ప్రకటించారు. జాతీయ రహదారులపై ప్రయాణించే వారు ఎప్పటికప్పుడు మార్పు గమనించాలని సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com