సినిమా రివ్యూ: ‘బ్రో’

- July 28, 2023 , by Maagulf
సినిమా రివ్యూ: ‘బ్రో’

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘బ్రో’. తమిళ బ్లాక్ బస్టర్ ‘వినోదియ సితం’ చిత్రానికి రీమేక్‌గా కొన్ని మార్పులు చేర్పులు చేసి, ఒరిజినల్ డైరెక్టర్ సముద్ర ఖని ఈ సినిమాని తెలుగులో తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

మామా అల్లుళ్ల కాంబో కావడం, ప్రచార చిత్రాలను హై ఓల్టేజ్ ఫన్ టోన్‌లో డిజైన్ చేసి వదలడంతో ఈ సినిమాపై అంచనాలు బాగా వున్నాయ్. మరి, ఆ అంచనాల్ని ‘బ్రో’ అందుకుందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
పేరున్న టెక్స్‌టైల్ కంపెనీలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా పని చేస్తుంటాడు మార్కండేయులు అలియాస్ మార్క్ (సాయి ధరమ్ తేజ్). సగటు మధ్య తరగతి ఉద్యోగిగా అస్సలు టైమ్ లేదంటూ, ఉరుకుల పరుగుల జీవితంలో బతుకుతుంటాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి (రోహిణి), పెళ్లీడుకొచ్చిన చెల్లి (ప్రియా ప్రకాష్ వారియర్), చదువుకుంటున్న ఇంకో చెల్లి (యువ లక్ష్మి), అమెరికాలో కొత్తగా వుద్యోగంలో చేరిన తమ్ముడు.. వీళ్లని లైఫ్‌లో సెటిల్ చేయాలని తన పనిలో కష్టపడుతూ వుంటాడు మార్క్. ఇన్ని బాధ్యతలతో సతమతమవుతున్న మార్క్ అనుకోకుండా ఒకరోజు రోడ్డు ప్రమాదంలో మరణిస్తాడు. అప్పుడే టైమ్ రూపంలో ఓ వ్యక్తి (పవన్ కళ్యాణ్) మార్కండేయులికి ఎదురొస్తాడు. నిండా ముప్పై ఏళ్లు కూడా లేని మార్కండేయులు తాను ఇలా అర్ధాంతరంగా చనిపోవడం కరెక్ట్ కాదనీ అంటాడు. అప్పుడు టైమ్ గాడ్ 90 రోజులు అతనికి జీవించేందుకు టైమ్ ఇస్తాడు. మరి, ఈ తొంభై రోజుల్లో సాయి ధరమ్ తేజ్ తాను నెరవేర్చాల్సిన బాధ్యతల్ని నెరవేర్చగలుగుతాడా.? అలాగే, ఈ క్రమంలో ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి (కేతిక శర్మ) ఏమవుతుంది.? అసలు 90 రోజుల తర్వాత మార్క్ బతికే వుంటాడా.? తెలియాలంటే ‘బ్రో’ ధియేటర్లలో చూడాల్సిందే.

నటీనటుల పని తీరు:
30 ఏళ్లకే బండెడు బాధ్యతలు భుజాన వేసుకుని కష్టపడే కుర్రాడి పాత్రలో తేజ్ పూర్తి న్యాయం చేశాడు. పవన్ కళ్యాణ్ టైమ్ గాడ్‌గా అక్కడక్కడా క్లాసులు పీకుతూనే హై ఓల్టేజ్ ఎనర్జీ ఇచ్చాడు. తేజ్, పవన్ కాంబో సీన్లు ఫ్యాన్స్‌కి ఫుల్ ఎనర్జీ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ స్టార్‌డమ్ హండ్రెడ్ పర్సంట్ వర్కవుట్ అయ్యిందనడం అతిశయోక్తి అనిపించదేమో. తాను అనుకున్న సబ్జెక్ట్‌ని చెప్పాల్సిన వ్యక్తితో చెప్పించడంలో సముద్ర ఖని సక్సెస్ అయ్యాడు. హీరోయిన్ కేతిక శర్మ పాటలకు తప్ప, పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. ప్రియా ప్రకాష్ వారియర్, యువలక్ష్మి, రోహిణి పాత్రలకు ఉన్నంతలో కాస్త స్పేస్ దక్కింది. ఒకే ఒక్క సీన్‌లో సముద్ర ఖని మెరుపుతీగలా కనిపించి తన పాత్రకు న్యాయం చేశారు. మిగిలిన పాత్ర ధారులు తమ పాత్రల పరిధి మేర బాగా నటించి మెప్పించారు. 

సాంకేతిక వర్గం పని తీరు:
‘బ్రో’ ఆల్రెడీ తెలిసిన కథే. ఆ సోల్ మిస్ కాకుండా ఎక్కడా అతి చేయకుండా కథను తెలుగు ప్రేక్షకుల పల్స్‌కి తగ్గట్లుగా తెరకెక్కించడంలో సముద్ర ఖని సక్సెస్ అయ్యాడు. త్రివిక్రమ్ మార్క్ డైలాగులు, స్ర్కీన్‌ప్లే సినిమాని మ్యాజిక్ చేశాయ్. సుజిత్ వాసుదేవన్ సినిమాటోగ్రఫీ బాగుంది. తమన్ మ్యూజిక్‌తో మెస్మరైజ్ చేశాడు. నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లాడు. పాటలు వినడానికే కాక, విజువల్‌గానూ బాగున్నాయ్. ఎడిటింగ్ కూడా కరెక్ట్‌గా వుంది. నిడివి లిమిటెడ్‌గా వుండడంతో తెలిసిన కథే అయినా ఎక్కడా బోర్ కొట్టదు. నిర్మాణ విలువలు బాగున్నాయ్. 

ప్లస్ పాయింట్స్:
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబో
త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే, మ్యూజిక్..

మైనస్ పాయింట్స్:
పెద్దగా లేవనెత్తే మైనస్ పాయింట్స్ ఏమీ లేవు కానీ, అక్కడక్కడా గ్రాఫిక్స్ వర్క్‌లో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని వుంటే బాగుండేది. 

చివరిగా:
‘బ్రో’ పవన్ ఫ్యాన్స్‌కి కంప్లీట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీస్ట్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com