మణిపూర్ ప్రభుత్వం పై సుప్రీంకోర్టు సీరియస్, డీజీపీకి సమన్లు ​​జారీ

- August 01, 2023 , by Maagulf
మణిపూర్ ప్రభుత్వం పై సుప్రీంకోర్టు సీరియస్, డీజీపీకి సమన్లు ​​జారీ

ఇంఫాల్: మణిపూర్ లో రాజ్యాంగ యంత్రాంగం పూర్తిగా విచ్ఛిన్నమైందని సుప్రీంకోర్టు పేర్కొంది. మణిపూర్ అల్లర్ల పై మంగళవారం(ఆగస్టు1,2023) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా మణిపూర్ ప్రభుత్వం పై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. మే నుండి జూలై వరకు రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగానికి పూర్తిగా విఘాతం ఏర్పడిందన్నారు. రాష్ట్ర పోలీసులు కేసులను దర్యాప్తు చేయడంలో అసమర్థులుగా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించింది.

మణిపూర్ లో శాంతిభద్రతలు లేవని పేర్కొంది. శాంతి భద్రతల యంత్రాంగం ప్రజలను రక్షించలేకపోతే, వారు రక్షణ కోసం ఎక్కడికి వెళతారని ప్రశ్నించింది. మణిపూర్ డీజీపీకి సుప్రీంకోర్టు సమన్లు ​​జారీ చేసింది. హేయమైన కేసులలో విచారణ ఆలస్యంగా ఎందుకు జరుగుతుందో తెలపాలని, సోమవారం మణిపూర్ డీజీపీ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావలని సుప్రీంకోర్టు తెలిపింది.

నేరాల స్వభావం ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ వివరాలు సమర్పించాలని డీజీపీని ఆదేశించింది. భవిష్యత్ కార్యాచరణను సోమవారం నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. మణిపూర్ అల్లర్లపై దాఖలైన పిటిషన్లను జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది.

మణిపూర్‌లో జరిగిన కలహాల సందర్భంగా మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి 11 ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయని, మొత్తం 11 ఎఫ్‌ఐఆర్‌లను సీబీఐ విచారణకు అప్పగించవచ్చని సుప్రీంకోర్టుకు కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.

మణిపూర్‌లో మే 4న ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంలో జాప్యం చేయడంపై మణిపూర్‌ పోలీసులను సుప్రీంకోర్టు నిలదీసింది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హింస భయంకరమైందని తెలిపింది. మే4న జరిగిన ఘటనపై మణిపూర్ పోలీసులు విచారణ చేయకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com