మనదే ఆసియా కప్
- August 13, 2023
చెన్నై: ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్ అదిరిపోయే ఆటతీరుతో విజేతగా నిలిచింది. చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో టీమ్‌ఇండియా 4-3తో మలేషియాను మట్టికరిపించి నాలుగోసారి ట్రోఫీ చేజిక్కించుకుంది. ఫైనల్ వరకు ఎదురులేకుండా అజేయంగా నిలిచిన భారత జట్టుకు తుది పోరులో మలేసియాపై గెలుపు నల్లేరుపై నడకే అనుకున్నారంతా. కానీ మలేషియా అంత తేలిగ్గా వదలలేదు. చివరి నిమిషం వరకూ గట్టిగా పోరాడింది. దీంతో మ్యాచ్ అసాంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఓటమి అంచుల నుంచి అద్భుతంగా పోరాడిన భారత్.. నాలుగోసారి ఆసియా కప్‌ను ఒడిసిపట్టింది.
భారత్ అదరగొట్టింది. ఓటమి అంచున నిలిచినా గొప్పగా పోరాడి ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీని ముద్దాడింది. 9వ నిమిషంలో జుగ్‌రాజ్ పెనాల్టీకార్నర్‌ను సద్వినియోగం చేసి భారత్‌కు తొలి గోల్ అందించాడు. కానీ చూస్తుండగానే మలేషియా 3-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 14వ నిమిషంలో అబుకమల్, 18వ నిమిషంలో రహీమ్, 28వ నిమిషంలో అమీనుద్దీన్ స్వల్ప వ్యవధిలో మూడో గోల్స్ చేసి భారత్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఈ గోల్స్‌తో మలేసియాను తిరుగులేని స్థితిలో నిలిచింది. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన భారత్ అవకాశాలను వృథా చేసుకుంది. మూడో క్వార్టర్ ఆఖరికి వచ్చినా గోల్స్ పడకపోవడంతో ఆతిథ్య జట్టుకు ఓటమి తప్పదేమో అనిపించింది. కానీ ఆ క్వార్టర్ చివర్లో అద్భుతమే జరిగింది. చివరి క్వార్టర్‌లో టీమిండియా అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. 45వ నిమిషంలో పెనాల్టీస్ట్రోక్‌ను హర్మన్‌ప్రీత్ గోల్ కొట్టి స్కోరు లోటును 2-3కు తగ్గించగా.. అదే నిమిషంలో గుర్జాంత్ ఓ మెరుపు గోల్ సాధించి 3-3తో స్కోరు సమం చేయడంతో స్టేడియం దద్దరిల్లిపోయింది. వరుసగా రెండు గోల్స్ సమర్పించుకుని డీలాపడిన మలేసియాకు మరో షాక్ ఇస్తూ 56వ నిమిషంలో ఆకాశ్‌దీప్ గోల్ చేసి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఆఖరిదాకా ఆధిక్యాన్ని కాపాడుకున్న భారత్ మరచిపోలేని విజయాన్ని అందుకుంది.
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న హాకీ జట్టుకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆసియా ఛాంపియన్‌షిప్‌లో అద్భుతమైన విజయం సాధించిన టీమిండియాకు అభినందనలని మోదీ ట్వీట్ చేశారు. ఆసియా కప్‌ను నాలుగోసారి కైవసం చేసుకోవడం జట్టు అంకిత భావానికి నిదర్శనమని ఆయన కొనియాడారు. భారత ఆటగాళ్ల దృఢ సంకల్పం, అసాధారణ ఆటతీరుతో దేశం గర్విస్తోందని మోదీ అన్నారు.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్‌లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్‌ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









