కళాకారులను ప్రోత్సహించాలి: వెంకయ్య నాయుడు

- September 03, 2023 , by Maagulf
కళాకారులను ప్రోత్సహించాలి:  వెంకయ్య నాయుడు
విశాఖపట్నం: శాస్త్రీయ సంగీత, నృత్య సాధన లు కేవలం వినోదానికే  కాకుండా వ్యక్తిత్వ వికాసానికీ ఒక చక్కటి మార్గం అని భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.  శాస్త్రీయ సంగీతం, నృత్యాన్ని అభ్యసించడం ద్వారా విద్యార్థుల్లో గ్రహణ శక్తి పెరగడంతోపాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సహనం పెరుగుతాయని చెప్పారు. విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్-కళాభారతి వారు నిర్వహిస్తున్న సంగీత, నృత్య, నాటక వారోత్సవాలు, నేషనల్ ఎమినెన్స్ అవార్డుల ప్రదానం ప్రారంభోత్సవ కార్యక్రమంలో శనివారం శ్రీ వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సనాతన సంస్కృతీ రూపాలయిన సంగీత, నాట్య, నాటక కళారీతులను, సాహిత్యాన్ని, హరికథ వంటి కళారూపాలను ప్రోత్సహిస్తూ ముందుతరాలకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తోందని విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్-కళాభారతి సంస్థను అభినందించారు. కళాకారులను ప్రోత్సహించడం చాలా అవసరమని, కళాకారులు గొప్ప సామాజిక సేవకులు ఆయన తెలిపారు. తమ విద్యతో, విద్వత్తుతో సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపించే కళాకారులను ప్రోత్సహించడమూ సమాజసేవే అని చెప్పారు. ఈ పనిని విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్-కళాభారతి ఎంతో బాధ్యతాయుతంగా భుజస్కందాలపై ఎత్తుకుని ఏటా నేషనల్ ఎమినెన్స్ అవార్డులను అందజేస్తున్నందుకు సంతోషిస్తున్నానన్నారు. 2001 నుంచి నిర్విఘ్నంగా ఈ యజ్ఞం నిర్వహించడం గొప్ప విషయం అని చెప్పారు. 
 
పాశ్చాత్య సంస్కృతి ప్రభావం పెరిగిపోతున్న ఈ రోజుల్లో విశాఖలో వెయ్యిమంది వీక్షించేలా ఇంత చక్కటి సాంస్కృతిక వేదిక కళాభారతిని ఏర్పాటు చేసి ఏటా దాదాపు 300 వరకు కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయం అన్నారు. సంగీత, నృత్యాలను నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్నా రుసుములు ఎక్కువగా ఉండడంతో వాటికి చాలామంది దూరం ఉంటారని, అయితే కళాభారతిలో గాత్ర సంగీతం, నాట్యం, మృదంగం, వయోలిన్ లో నెలకు నామమాత్రంగా రూ.200తో శిక్షణ ఇవ్వడం తనను బాగా ఆకట్టుకుందని వెల్లడించారు. ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు అన్నవరపు రామస్వామి ని నేషనల్ ఎమినెన్స్ అవార్డుతో ఈ రోజు సత్కరించడం ఆనందదాయకమన్నారు. ఈ ఏడాది ఈ అవార్డులు అందుకుంటున్న ప్రముఖ కళాకారులందరికీ అభినందనలు తెలిపారు. 
 
"మన కళలు, సంస్కృతి-సంప్రదాయాలు, విలువల్లో నిగూఢంగా ఉన్న శక్తి సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఖ్యాతిని, కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింపజేసేందుకు కళాకారులు, కళా సంస్థలు కృషిచేయాలి. నృత్య, సంగీతాలు ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన విలువైన కానుకలు. విశృంఖల, వినాశకార పాశ్చాత్య సంస్కృతి విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ సాంస్కృతిక రూపాలను తిరిగి యావత్ ప్రపంచానికి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవశ్యకత ఎంతగానో ఉంది. మన సంగీత, నృత్య సంప్రదాయాన్ని కొనసాగించేందుకు కళాభారతి గొప్ప వేదికగా నిలుస్తోంది." అని ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు చెప్పారు. " భారతదేశ విధానాలైన అహింస, శాంతి సామరస్యాలను మన సంప్రదాయ నృత్యం, సంగీతాలు ప్రతిబింబిస్తాయి. వీటి ద్వారా భారతదేశ  వసుధైక కుటుంబం తత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తారం చేయడంలో కళాకారులు కీలకపాత్ర పోషించాలి. నృత్య, సంగీత కళాకారులు, పోషకులు, భారతదేశ సంస్కృతిని, ఆలోచనావిధానాన్ని, మన జీవన విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో చొరవ తీసుకోవాలి." అని సూచించారు.
 
"భారతీయ శాస్త్రీయ సంగీతపు మూలాలు సనాతన వేదాల కాలం నాటివి. సంగీత సాధన కేవలం వినోదానికే  కాకుండా వికాసానికీ కూడా ఒక చక్కటి మార్గం. శాస్త్రీయ సంగీతం, నృత్యాన్ని అభ్యసించడం ద్వారా విద్యార్థుల్లో గ్రహణ శక్తి పెరగడంతోపాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సహనం పెరుగుతాయి. భారత్ తిరిగి విశ్వగురు స్థానం సంపాదించుకోవడానికి ఇది ఎంతో అవసరం." అని పేర్కొన్నారు. మానసిక ఒత్తిడికి సంగీత, నృత్యాలు మంచి ఉపశమనం అంటూ మానసికంగా అలసిపోయినప్పుడు, తీవ్ర అలజడికి లోనయిప్పుడు శాస్ర్తీయ సంగీతం విని చూడాలన్నారు.'ఆ మంద్ర ధ్వనులతో, రాగాలాపనలతో కొద్దిసేపటిలోనే మనసు కుదుటపడుతుంది. భారత శాస్త్రీయ సంగీతం, నృత్యం ద్వారా మానసిక సంతులనం ఏర్పడుతుంది." అని వెల్లడించారు. "పాశ్చాత్య సంగీతం వింటే తాత్కాలికంగా ఊపునివ్వవచ్చు. ఉత్సాహం ఉరకలెత్తి డ్యాన్సు వేయాలనిపించవచ్చు. కానీ మనసు అలజడికి గురవుతుంది. అదే భారతీయ సంగీతాన్ని ఆస్వాదించడం అలవర్చుకుంటే మనస్సు ప్రశాంతమవుతుంది. నిశ్చలమవుతుంది. ఏకాగ్రత లభిస్తుంది. తద్వారా మేధో సామర్థ్యం పెరుగుతుంది. శాస్త్రీయ సంగీతంలో పూర్తిగా మమేకమై ఉన్న వారిని గమనిస్తే, వారు ఈ లోకంలో ఉన్నట్లు కనిపించరు. తన్మయత్వంలో ఉంటారు. ధ్యానంలో నిమగ్నమయినట్లు కనిపిస్తారు. అందుకే భారత సంప్రదాయంలో సంగీతం కేవలం వినోద రూపం మాత్రమే కాదు. ఆధ్యాత్మిక సాధనకు ఒక మంచి ఉపకరణం." అని చెప్పారు.
 
ప్రకృతితో మమేకం చేసే విధంగా మన సంగీత శాస్ర్తం ఉంటుందన్నారు.. భారత దేశంలో ప్రధానంగా రెండు రకాల శాస్ర్తీయ సంగీతాలున్నాయని, హిందూస్థానీ, కర్ణాటక సంగీత రూపాలు వేటికవే ప్రత్యేకమని చెప్పారు.
 
హిందూస్థానీ సంగీత రాగాలు వివిధ ఋతువులు, సమయాలకు అనుసంధానమయితే, కర్ణాటక సంగీత రాగాలు భావోద్వేగ ప్రాధాన్యాలని చెప్పారు. ముఖ్యంగా కర్ణాటక సంగీతం భక్తి ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిందంటూ అన్నమయ, త్యాగయ, క్షేత్రయ, భక్తరామదాసు వంటి వాగ్గేయకారుల భక్తిభావనలను నిండా ఇముడ్చుకుందని తెలిపారు. 
 
"భారతదేశ విద్యావిధానంలో కళలు అంతర్భాగంగా ఉండేవి. వాటిని తిరిగి విద్యావిధానంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా నూతన జాతీయ విద్యావిధానంలో కళలకు పెద్ద పీట వేయడం అభినందనీయం." అన్నారు.
 
భారతీయ సంగీత, నృత్యాలలలో శబ్దానికి అత్యంత ప్రాధాన్యం ఉందని, భారతీయ సంప్రదాయంలో శబ్దమంటే కేవలం ధ్వని మాత్రమే కాదు...అదొక శాస్ర్తం అని చెప్పారు. 
"శబ్దానికి ఆధ్యాత్మిక పరమార్థం ఉంది. యోగ సంప్రదాయంలో నాదబ్రహ్మం అంటారు. శబ్దం దైవంతో సమానమని దీని అర్థం. శబ్దమే సృష్టికి మూలమని యోగా సంప్రదాయం చెబుతుంది. మన శాస్ర్తీయ  నృత్యరీతులు, సంగీతం కవలల వంటివి. కొన్ని సందర్భాల్లో అవి పరస్పరాధారితాలు కూడా. మన భరత నాట్యం, కూచిపూడి, కథక్, కథాకళి, మణిపురి, ఒడిస్సీ తదితర  నృత్య రూపాలు వేటికవే ప్రత్యేకం. ఆధ్యాత్మిక ప్రత్యేకతతో పాటు వీటిని సాధన చేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు ఏకాగ్రత పెరుగుతుంది. హావభావాల ప్రకటన సామర్థ్యం పెరిగి ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది" అని స్పష్టం చేశారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com