సినిమా రివ్యూ: జవాన్.!

- September 07, 2023 , by Maagulf
సినిమా రివ్యూ: జవాన్.!

సౌత్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారూఖ్ ఖాన్ నటించిన చిత్రం ‘జవాన్’. హీరోయిన్ నయనతారతో సహా విజయ్ సేతుపతి, యోగిబాబు తదితర తమిళ నటీనటులు ఈ సినిమాలో నటించడం విశేషం. ‘పటాన్’ తర్వాత షారూఖ్ నటించిన చిత్రం కావడంతో అంచనాలు బాగున్నాయ్ ఈ సినిమా మీద. మరి, ఆ అంచనాల్ని ‘జవాన్’ అందుకుందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.!

కథ:
ఆజాద్ (షారూఖ్ ఖాన్) జైలర్‌గా పని చేస్తుంటాడు. మహిళా ఖైదీల మీద జరుగుతున్న అన్యాయాలనూ అక్రమాలనూ ఎదిరిస్తూ.. మహిళా ఖైదీలకు అండగా నిలుస్తుంటాడు. ఈ నేపథ్యంలో సంఘ విద్రోహ శక్తుల్ని ఎదిరించేందుకు ఓ ప్రత్యేకమైన టీమ్‌తో వర్క్ చేస్తుంటాడు ఆజాద్. ఈ టీమ్‌ని పట్టుకునేందుకు నర్మదా (నయన తార) టీమ్ ప్రయత్నిస్తుంటుంది. అసలు నర్మదా టీమ్‌కీ, ఆజాద్ టీమ్‌కీ మధ్య వైరం ఏంటీ.? ఓ వ్యక్తి కోసం ఇదంతా చేస్తుంటాడు ఆజాద్. ఆ వ్యక్తి ఎవరు.? అలాగే, విక్రమ్ రాధోడ్ (షారూఖ్ ఖాన్) గతం ఏంటీ.? రాథోడ్‌కీ, ఆజాద‌కీ సంబంధం ఏంటీ.? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ‘జవాన్’ ధియేటర్లలో చూడాల్సిందే.!

నటీ నటుల పనితీరు:
రెండు రకాల పాత్రల్లో షారూఖ్ ఖాన్ వేరియేషన్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటోంది. ఆజాద్ పాత్రలోనూ, విక్రమ్ రాథోడ్ పాత్రలోనూ చక్కగా ఒదిగిపోయి తన అనుభవాన్నంతా రంగరించాడు షారూఖ్ ఖాన్. అలాగే, హై ఓల్టేజ్ యాక్షన్ సీన్లలో అదరగొట్టేశాడు. ఎమోషన్‌‌తో పాటూ, యాక్షన్ సీన్లలోని షారూఖ్ ఖాన్ తనదైన శైలి కామెడీ టైమింగ్ ఫ్యాన్స్‌కి కిక్ ఇస్తుంది. నర్మద పాత్రలో నయన తార బాగుంది. ఇంపార్టెన్స్ రోల్ దక్కింది. చిన్న పాత్రే అయినా దీపికా పదుకొనె కరెక్ట్‌గా సెట్ అయ్యింది. విజయ్ సేతుపతి పవర్ ఫుల్ విలన్ రోల్‌లో తనదైన నటన చూపించాడు. యోగిబాబు తదితరులు తమ పాత్రల పరిధి మేర నవ్వించి నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పని తీరు:
హిట్ డైరెక్టర్‌గా పేరున్న అట్లీ ‘జవాన్’ సినిమా కోసం కాస్త సౌత్ ఫ్లేవర్ ఎక్కువగా చొప్పించాడన్న అభిప్రాయాలున్నాయ్. కానీ, షారూఖ్ ఖాన్ లాంటి సీనియర్ బాలీవుడ్ నటుడ్ని బాగా హ్యాండిల్ చేశాడు. రెండు పాత్రల్లోనూ షారూఖ్ పాత్రను ఎలివేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. అనుకున్న కథని అంతకు మించిన కథనంతో నడిపించి మంచి మార్కులే వేయించుకున్నాడు. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ యాక్షన్ ఎపిసోడ్స్‌లో బీభత్సంగా ఎలివేట్ అయ్యింది. అలాగే పాటలు కూడా బాగున్నాయ్. గౌరీ ఖాన్ నిర్మాణ విలువలు బాగున్నాయ్. కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ ఓకే. 

ప్లస్ పాయింట్స్:
అట్లీ ఎంచుకున్న కథ, కథనం నడిపించిన విధానం, షారూఖ్ ఖాన్ పర్‌పామెన్స్..

మైనస్ పాయింట్స్:
మెయిన్ రోల్స్‌ని పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దడంలో అట్లీ ఇంకాస్త ఎక్కువ ఫోకస్ పెట్టి వుంటే బాగుండన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. అక్కడక్కడా లాజిక్ లేకుండా డ్రమటిక్‌గా సాగిన సన్నివేశాలు కథలోని సహజత్వాన్ని కాస్త దెబ్బ తీశాయనిపిస్తుంది. 

చివరిగా:
హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి ‘జవాన్’ ఓ మంచి ట్రీట్ బీస్ట్.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com