ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు.. రయ్ రయ్!
- September 20, 2023
హైదరాబాద్: హైదరాబాద్ లో కాలుష్యనివారణకు పర్యావరణహితమైన “ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ” ఏసీ బస్సులను ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం 50 గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ సర్వీసుల్లో మొదటి విడతలో 25 బస్సులను సంస్థ వీసీ అండ్ ఎండీ వి.సి.సజ్జనర్ తో కలిసి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. అంతకు ముందు ఈ బస్సుల ప్రత్యేకతలను వారు పరిశీలించారు. ఈ నెల 23 నుంచి ఈ బస్సులు నగర ప్రయాణికులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండనున్నాయి.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో బుధవారం "ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ” ఏసీ బస్సుల ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. టీఎస్‌ఆర్టీసీ కష్టాల్లో ఉన్నా ప్రజలకు రవాణా కష్టాలు రాకుండా మెరుగైన, నాణ్యమైన సేవలను అందిస్తూనే ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను మరింతగా పెంచేలా టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. ప్రైవేట్ కు ధీటుగా టీఎస్‌ఆర్టీసీ పనిచేస్తోందన్నారు. టీఎస్ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ గారు బాధ్యతలు స్వీకరించాక గత రెండేళ్ల కాలంలోనే ఎన్నో మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు.
నగరం నలుదిక్కుల విస్తరించి ఉండటంతో మెట్రోకు అనుసంధానంగా రవాణా సేవలు మెరుగుపడుతున్నాయని, త్వరలోనే ఒక్క కార్డుతో అన్ని రకాల ప్రయాణాలు చేయొచ్చని చెప్పారు.
ప్రపంచమంతా ఎలక్ట్రిక్ యుగం నడుస్తుందని, ఇతర దేశాలతో పోల్చితే మన దేశం లో ఇంకా తక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఉందన్నారు. వచ్చే తరాలకు వాయు కాలుష్యం లేని వాతావరణాన్ని అందించాలంటే ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాల్సిన అవసరముందన్నారు. టీఎస్‌ఆర్టీసీ పరిరక్షించుకోవడానికి సంస్థ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం మంచి పరిణామని, ఇది తన హయాంలో జరుగడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ కి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులకు మంచి డిమాండ్ ఉందని, ఎయిర్ పోర్ట్ మార్గంలో తిరిగే బస్సుల్లో 80 శాతం ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) ఉందని అన్నారు. ప్రతి రోజు దాదాపు 6 వేల మంది ఏసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని చెప్పారు. ఈ స్పూర్తితోనే మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుందని తెలిపారు.
హైదరాబాద్ కు తలమానికమైన ఐటీ కారిడార్ లో ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా ప్రజలకు చేరువ చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో 500 బస్సులను నడుపుతుండగా.. రాబోయే నాలుగు నెలల్లో 475 ఎలక్ట్రిక్ బస్సులను ఐటీకారిడార్ లో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు.
మొత్తంగా ఈ ఆర్థిక ఏడాదిలో కొత్తగా 1860 ఎలక్ట్రిక్ బస్సులను వాడకం తేవాలని సంస్థ ప్లాన్ చేసిందని వివరించారు. పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణించి.. సంస్థను ఆదరించి, ప్రోత్సహించాలని కోరారు. ఈ కొత్త బస్సులను అత్యాధునిక హంగులతో రూపొందించామని చెప్పారు.
ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలకు మరింతగా చేరువ చేసేందుకు టీఎస్‌ఆర్టీసీతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని ఒలెక్ట్రా సీఎండీ ప్రదీప్ రావు అన్నారు. ఈ బస్సులను త్వరగా ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు సంస్థ అధికారులు ఎంతోగానో కృషి చేశారని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్,ఈడీలు పురుషోత్తం, వెంకటేశ్వర్లు, కృష్ణకాంత్, సీఎంఈ రఘునాథరావు, ఎస్సీఎస్సీ జనరల్ సెక్రటరీ రమేశ్ ఖాజా, ఇన్పోసిస్ నుంచి వెంకటేశ్, వర్చుసా సెంటర్ హెడ్ కృష్ణ ఎదుల, ఒలెక్ట్రా మార్కెటింగ్ హెడ్ వేణుగోపాల్ రావు, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









