తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

- October 09, 2023 , by Maagulf
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న మార్పు, రాష్ట్ర అభివృద్ది బీజేపీతోనే సాధ్యం అని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలపై కిషన్ రెడ్డి స్పందించారు. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ను స్వాగతించారాయన. ఈ ఎన్నికల్లో అందరూ కలిసి పని చేస్తామని, అధికారంలోకి రావడం కోసం పోరాటం చేస్తామని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

”ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇది నరేంద్రమోదీ సభల ద్వారా స్పష్టమైంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ జెండా ఎగరేస్తాం. రెండు, మూడు స్థానాల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పడాలి. ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలించాయి. కానీ ఎవరూ ప్రజల ఆకాంక్షను గౌరవించ లేదు. ఎన్నికలకు ఇంకా 50 రోజుల సమయం ఉంది.

ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా ఎన్నికలు జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలకు ఏం చేశాము అనే దాని మీద బీఆర్ఎస్ ఎన్నికల వెళ్లడం లేదు. మద్యం, డబ్బును నమ్ముకుని ఎన్నికలకు వెళ్తోంది. అవినీతి, కుటుంబ పాలన నుండి ప్రజల పాలన అందించేందుకు బీజేపీని ఆశీర్వదించాలని కోరుతున్నా. సకలజనుల పాలన రావాలి. అది బీజేపీతోనే సాధ్యం.

ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాం. అభ్యర్థులు ఎంపిక కసరత్తు జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత మొదటిసారి తెలంగాణ వస్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆదిలాబాద్ బహిరంగ సభకు హాజరు అవుతారు. సికింద్రాబాద్ లో మేధావులు సదస్సులో పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోదీ ములుగులో గిరిజన యూనివర్సిటీ ప్రకటించి, సమ్మక్క సారక్క పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 11న మేడారం వెళ్లి వనదేవతల దర్శనం చేసుకుంటాం” అని కిషన్ రెడ్డి తెలిపారు.

తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించి డిసెంబర్ 3న ఫలితాలు ప్రకటించనున్నారు. తెలంగాణతో పాటు మిజోరం, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. తెలంగాణలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com