సినిమా రివ్యూ: ‘భగవంత్ కేసరి’..బాలయ్యతో అనిల్ రావిపూడి ఓ కొత్త ప్రయత్నం.!

- October 19, 2023 , by Maagulf
సినిమా రివ్యూ: ‘భగవంత్ కేసరి’..బాలయ్యతో అనిల్ రావిపూడి ఓ కొత్త ప్రయత్నం.!

కామెడీ సినిమాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమా ‘భగవంత్ కేసరి’. మాస్ కా బాప్ అయిన బాలయ్యను ‘భగవంత్ కేసరి’లో డిఫరెంట్‌గా చూపించబోతున్నాడు అనిల్ రావిపూడి అని ప్రమోషన్స్ ద్వారా కన్‌వే చేశాడు. మరి, అది నిజమైందా.? బాలయ్య ఈ సినిమాలో కొత్తగా కనిపించాడా.? క్రేజీ బ్యూటీ శ్రీలీల సంగతేంటీ.? హీరోయిన్ కాజల్ అగర్వాల్ పాత్ర ఎంతమేరకు శాటిస్‌పై చేయగలిగింది.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.!

కథ:
నేలకొండ భగవంత్ కేసరి (నందమూరి బాలకృష్ణ) తన కూతురు కాని కూతురు విజ్జిని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళగా తీర్చి దిద్దాలన్న సంకల్పంతో వుంటాడు. అందుకోసం విజ్జి అలియాస్ విజయ లక్ష్మి (శ్రీలీల)ని ఆర్మీలో చేర్చుతాడు. కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో వీరి జీవితంలోకి విలన్ రాహుల్ సాంగ్వి (అర్జున్ రాంపాల్) ఎంటర్ అవుతాడు. ప్రపంచంలోనే నెంబర్ వన్ డ్రగ్ మాఫియా లీడర్ కావాలనుకుంటున్న రాహుల్ సాంగ్వికి విజ్జిని చంపాల్సిన అవసరమేంటీ.? అర్జున్ నుంచి విజ్జిని కాపాడుకునేందుకు భగవంత్ కేసరి ఏం చేశాడు.? అసలు భగవంత్ కేసరికీ, రాహుల్ సాంగ్వికి ప్లాష్ బ్యాక్‌లో ఏమైనా వైరం వుందా.? తెలుసుకోవాలంటే ‘భగవంత్ కేసరి’ సినిమా ధియేటర్లో చూడాల్సిందే.

నటీనటుల పని తీరు:
మాస్ రోల్‌లో బాలయ్యను చాలా సినిమాల్లో చూశాం. కానీ, ఈ సినిమాలో కాస్త కొత్తగా ఆయన పాత్రను తీర్చి దిద్దారు. తనను తాను మేకోవర్ చేసుకున్న విధానం ఫ్యాన్స్‌నే కాదు, ప్రేక్షకులందర్నీ ఆకట్టుకుంటుంది. బాలయ్య తర్వాత మెయిన్ లీడ్ అంటే శ్రీలీల గురించి చెప్పుకోవాలి. శ్రీలీల అంటే కేవలం గ్లామరే కాదు, టాప్ రేంజ్ పర్‌పామెన్స్ ఇవ్వగలదని ఈ సినిమాతో ప్రూవ్ అయ్యింది. ప్రీ క్లైమాక్స్‌లో యాక్షన్ ఎపిసోడ్ కూడా ఇరగదీసింది. హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ రోల్‌ జస్ట్ ఓకే. విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఆకట్టుకుంటాడు. మిగిలిన పాత్రధారులంతా తమ పాత్రల పరిధిమేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు:
అనిల్ రావిపూడి నుంచి పవర్ ‌ఫుల్ మాస్ తరహా ఎంటర్‌టైనర్లు కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చని ఈ సినిమా చూస్తే అర్ధమవుతుంది. ఇంతవరకూ తాను చేసిన సినిమాల జోనర్లకు పూర్తి భిన్నంగా ఈ సినిమాని తెరకెక్కించాడు. అయితే, అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు చూసినట్లే అనిపిస్తాయ్. కానీ, మాస్ పల్స్‌ని బాగా పట్టాడు అనిల్ రావిపూడి. ఇక, థమన్ మ్యూజిక్ ఈ సినిమాకి మరో మెయిన్ అస్సెట్. యాక్షన్ సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దద్దరిల్లిపోయింది. రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయ్. అయితే, ఎడిటింగ్ విషయంలో చాలానే కత్తెర పడాల్సి వుంది. లాంగ్ రన్ కాస్త బోర్ కొట్టిస్తుంది. కొన్ని అనవసరమైన సన్నివేశాలు సాగతీతలా అనిపిస్తాయ్.

ప్లస్ పాయింట్స్:
బాలయ్య, శ్రీలీల పర్‌ఫామెన్స్, వీరి మధ్య సాగే ఎమోషనల్ సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్..

మైనస్ పాయింట్స్‌:
సాగతీతలా అనిపించిన సన్నివేశాలు, రొటీన్ డైలాగులు, కామెడీ సరిగ్గా పండకపోవడం, తదుపరి ఏం జరుగుతుంది.. అని ముందే తెలిసిపోవడం.. రొటీన్ మాఫియా బ్యాక్ డ్రాప్..

ఫైనల్‌గా:
 ‘భగవంత్ కేసరి’.. బాలయ్యతో అనిల్ రావిపూడి ఓ కొత్త ప్రయత్నం.! 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com