హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు

- December 13, 2023 , by Maagulf
హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు

హైదరాబాద్‌: పోలీస్‌ శాఖలో ఉన్నతాధికారుల బదిలీలపై కొత్త ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. తొలి విడతలో హైదరాబాద్ ప్రాంత అధికారుల్లో మార్పులు చేర్పులు చేసింది. శాంతిభద్రతల పరిరక్షణలో కీలకమైన హైదరాబాద్‌ కొత్త కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిని నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ఆయన.. అనంతరం తన ఛాంబర్​లో బాధ్యతలు స్వీకరించారు.

శ్రీనివాస్ రెడ్డి 2007 తర్వాత తొలిసారి యూనిట్‌ అధికారిగా పనిచేయబోతున్నారు. 2005లో మహబూబ్‌నగర్‌ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. రెండేళ్లపాటు అక్కడే విధులు నిర్వహించారు. అనంతరం అవినీతి నిరోధక శాఖకు బదిలీ అయ్యారు. ఆ సమయంలోనే మద్యం సిండికేట్‌ కుంభకోణంలో పలువురు పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారులతోపాటు ప్రజాప్రతినిధుల్ని సైతం అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌ కొత్త సీపీగా బాధ్యతలు చేపట్టారు.

బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడిన సీపీ శ్రీనివాస్ రెడ్డి.. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గంజాయి నిర్మూలనకు కృషి చేస్తా.. డ్రగ్స్‌ ముఠాలను సహించేది లేదని తెలిపారు. డ్రగ్స్ ముఠాలకు ఈ రాష్ట్రంలో చోటులేదని హెచ్చరిస్తున్నామని.. పబ్స్‌, రెస్టారెంట్లు, ఫామ్‌హౌస్‌ యజమానులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. డ్రగ్స్‌ను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు ఉంటాయని.. డ్రగ్స్‌ మహమ్మారిని కూకటివేళ్లతో పెకిలించాలని సీఎం చెప్పారని వెల్లడించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com