శబరిమలలో కిటకిటలాడుతున్న అయ్యప్ప భక్తులు

- December 13, 2023 , by Maagulf
శబరిమలలో కిటకిటలాడుతున్న అయ్యప్ప భక్తులు

శబరిమల: మాల ధారణతో వచ్చే భక్తులతో శబరిగిరులు కిటకిటలాడుతున్నాయి. అయ్యప్ప మాల ధరించిన భక్తులు స్వామివారి దర్శనం కోసం పోటెత్తారు. స్వామియే శరణం అయ్యప్పా అంటూ శబరిగిరులు మారు మోగుతున్నాయి.  రోజుకు లక్షమందికిపైగా భక్తులు తరలివస్తుండటంతో  విపరీతమైన రద్దీ ఏర్పడింది.దీంతో స్వామి దర్శనం కష్టంగా మారింది. 20గంటలు వేచి చూసినా దర్శనం కలగకపోవటంతో చాలామంది స్వాములు దర్శనం కాకుండానే వెనుతిరుగుతున్న పరిస్థితి నెలకొంది.

ఎన్నో రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో అయ్యప్ప దర్శనానికి వస్తుంటారు. ఈ ఏడాది ఒక్కసారిగా భక్తులు పోటెత్తటంతో శబరిమల జనసంద్రాన్ని తలపిస్తోంది. స్వామివారి దర్శనానికి 20గంటలకు పైగా పడుతోంది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో పాటు ఇతర రాష్ట్రాలకుచెందినవారు కూడా స్వామి దర్శనం చేసుకోకుండానే వెనుతిరుగుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతీ ఏటా వేలాదిమంది భక్తులు శబరిమలకు వెళుతుంటారు.  కానీ.. ఈ ఏడాది భక్తులు ఒకేసారి తరలిరావటంతో దానికి తగిన ఏర్పాట్లు లేకపోవటంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. గంటకు 4వేలమంది భక్తులకు మాత్రమే దర్శనం కల్పించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో మిగిలిన భక్తులకు దర్శనం అతి కష్టంగా మారింది. ఆలయం వద్ద భక్తులకు తగిన ఏర్పాట్లు చేయలేదనే విమర్శలు వస్తున్నాయి.

శబరిగిరులపైనా..స్వామివారి దేవాలయం వద్ద పరిస్థితి ఇలా ఉంటే ఇక కొండకు వెళ్లే దారిలో ట్రాఫిక్ భారీగా జామ్ అయిన పరిస్థితి. గత ఐదు రోజులుగా  వాహనాలతో నిండిపోయాయి. బారులు తీరినవాహనాలతో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. శబరిమల చేరేందుకు..చేరిన తరువాత కూడా దర్శనానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మంగళవారం (డిసెంబర్ 12,2023) ఒక్కరోజునే 85వేలమంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి ఆలయం 18 మెట్లపై ప్రతీ గంటకు 4వేలమంది భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. అష్టకష్టాలు పడి మాలధారణతో స్వామివారిని దర్శించుకోవటానికి ఎంతో ఆశతో వెళ్లిన చాలామంది భక్తులకు దర్శన భాగ్యం కలగటంలేదు. దీంతో స్వామివారిని దర్శించుకోకుండానే నిరాశగా వెనుతిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com