రాష్ట్రపతి అవార్డు గ్రహిత వయలిన్ వాసుతో అంతర్జాలం లో NATS ఇష్టాగోష్టి

- December 28, 2023 , by Maagulf
రాష్ట్రపతి అవార్డు గ్రహిత వయలిన్ వాసుతో అంతర్జాలం లో NATS ఇష్టాగోష్టి

అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తాజాగా నాట్స్ తెలుగు లలిత కళా వేదిక ద్వారా ప్రతి నెల అంతర్జాలంలో వెబినార్స్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్రపతి అవార్డు గ్రహిత వయలిన్ వాసుతో నాట్స్ ఇష్టాగోష్టి నిర్వహించింది. భారతదేశంతో పాటు అనేక దేశాల్లో సంగీత, సాంస్కృతిక సదస్సుల్లో పాల్గొని ఎన్నో పురస్కాలు అందుకున్న వయలిన్ వాసు తన అనుభవాలను ఈ సదస్సులో వివరించారు. సంప్రదాయ కళల పరిరక్షణ కోసం వయలిన్ వాసు చేసిన కృషి అమోఘమని ఈ ఇష్టాగోష్టి వ్యాఖ్యతగా వ్యవహరించిన శాయి ప్రభాకర్ యర్రాప్రగడ కొనియాడారు. మనస్సును కదిలించే శక్తి సంగీతానికి ఉందని.. ముఖ్యంగా వయలిన్‌ ద్వారా మనస్సులో భావాలను సంగీత రూపంలో చెప్పవచ్చని వాసు తెలిపారు. అసలు తాను సంగీత ప్రపంచంలోకి ఎలా  అడుగుపెట్టింది..? తర్వాత ఈ రంగంలో చేసిన కృషిని వివరించారు. తాను నేర్చుకున్న సంగీత పరిజ్ఞానాన్ని వీలైనంత మందికి పంచడమే తన లక్ష్యమని తెలిపారు.. కొత్తగా సంగీతం నేర్చుకోవాలనుకునే వారు ఎలా ఉండాలి..? వారు ఎలా కృషి చేయాలనేది వాసు వివరించారు. వయలిన్ కూడా వాయించి నాట్స్ సభ్యులను అలరించారు. నాట్స్ లలిత కళా వేదిక ద్వారా తెలుగు కళలను ప్రోత్సాహిస్తున్నామని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు)నూతి అన్నారు. అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు నాట్స్ తన వంతు కృషి చేస్తుందని తెలిపారు. నాట్స్ హెల్ప్ లైన్ ద్వారా తెలుగు వారికి ఎలా అండగా నిలబడుతున్నది బాపు నూతి వివరించారు. ఇక ఈ కార్యక్రమానికి అనుసంధానకర్తగా శాయి ప్రభాకర్ యఱ్ఱాప్రగడ వ్యవహరించారు.  ఈ ఇష్టాగోష్టికి ఆహ్వానించగానే వచ్చిన వయలిన్ వాసు కు నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com