సినిమా రివ్యూ: ‘డెవిల్’

- December 29, 2023 , by Maagulf
సినిమా రివ్యూ: ‘డెవిల్’

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘డెవిల్’. మాళవిక నాయర్ కీలక పాత్రలో నటించింది. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా ఈ సినిమాని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌కి పాజిటివ్ రెస్పాన్స్ రావడం.. సినిమాపై అంచనాలు పెంచింది. అయితే, ఆ అంచనాల్ని ‘డెవిల్’ అందుకుందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.!

కథ:
1940 వ ప్రాంతంలో జరిగిన పీరియాడిక్ డ్రామా ఇది. స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్‌ని పట్టుకునేందుకు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు.. పన్నిన పన్నాగాలను నేపథ్యంగా తీసుకుని సినిమాటిక్ లిబర్టీతో కల్పితంగా చెప్పిన కథే ‘డెవిల్’. రసపురంలోని జమీందార్ ఇంట్లో జరిగిన ఓ హత్యకు సంబంధించిన కేసును దర్యాప్తు చేసేందుకు వస్తాడు బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అయిన డెవిల్ (కళ్యాణ్ రామ్). అయితే, అతని అసలు మోటో సుభాష్ చంద్రబోస్‌ని పట్టుకుని తన గవర్నమెంట్‌కి అప్పగించడం. ఈ హత్య కేసు దర్యాప్తులో భాగంగానే కొందరు ఐఎన్ఏ (ఇండియన్ నేషనల్ ఆర్మీ) ఏజెంట్లను గుర్తిస్తాడు. ఇదే క్రమంలో సుభాష్ చంద్రబోస్‌కి రైట్ హ్యాండ్ అయిన త్రివర్ణ అండ్ కో సుభాష్ చంద్రబోస్‌కి ఓ కోడ్ సమాచారం అందించాలని ప్రయత్నిస్తుంటారు. మరి, ఆ కోడ్‌కీ, జమీందార్ ఇంట్లో జరిగిన హత్యకీ ఏంటీ సంబంధం.? అసలు సుభాష్ చంద్రబోస్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అయిన డెవిల్‌కి చిక్కాడా.? నైషథ(సంయుక్తా మీనన్), మణిమేకల(మాళవిక నాయర్) ఎవరు.? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ‘డెవిల్’ ధియేటర్లలో చూడాల్సిందే.

నటీ నటుల పని తీరు:
కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో సరిగానే సరిపోయాడు. కానీ, కొన్ని సన్నివేశాల్లో ఆయన పాత్ర చిత్రీకరణ కన్విన్సింగ్‌గా అనిపించదు. యాక్షన్ ఘట్టాల్లో బాగా నటించాడు. తెరపై ఆ ఎపిసోడ్స్ ఆవిష్కరించిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. సంయుక్తా మీనన్‌కి ప్రాధాన్యత వున్న పాత్రే దక్కింది. కానీ, హీరోతో కెమిస్ర్టీ పండించే అవకాశం కుదరలేదు. మరో కీలక పాత్రలో కనిపించిన మాళవిక నాయర్‌కి ఇదో కొత్త పాత్రని చెప్పొచ్చు. ఛాలెంజింగ్‌గా తీసుకుని తన వంతు న్యాయం చేసింది మణిమేకల పాత్రలో మాళవిక నాయర్. మిగిలిన పాత్రధారులు సత్య, వశిష్ట సింహా, షఫీ, రంగస్థలం మహేష్ తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.


సాంకేతిక వర్గం పని తీరు:
మొదట ఈ సినిమాకి నవీన్ మేడారం దర్శకుడు అన్నారు. ఆ తర్వాత అనూహ్యంగా ఆ స్థానంలోకి నిర్మాత అయిన అభిషేక్ నామా పేరొచ్చింది. అయితే, ఒరిజినల్ దర్శకుడే ఈ సినిమాని తెరకెక్కించి వుంటే, సినిమా కథా, కథనం సాగే తీరు మరోలా వుండేదేమో. కలగాపులగంలా తయారైందిప్పుడు. కథనంపై డైరెక్టర్ పట్టు పెద్దగా కనిపించదు. కథలో బోలెడన్ని ట్విస్ట్‌లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వుంటాయ్. కానీ, వాటిని ఆసక్తికరంగా తెరపై ఆవిష్కరించడంలో డైరెక్టర్ పట్టు ప్రదర్శించలేదనిపిస్తుంది. సుభాష్ చంద్రబోస్ కథనంపై చాలా రకాల కథలు ఇప్పటికే సినిమాల రూపంలో చూసేశాం. కానీ, అవన్నీ దాదాపు ఫెయిల్యూర్ కథలే. ‘డెవిల్’ ఎత్తుకున్న తీరు బాగున్నప్పటికీ, కథనం నడిపించడంలో డైరెక్టర్ ఫెయిలయ్యాడనిపిస్తుంది. శ్రీకాంత్ విస్సా డైలాగ్స్ అక్కడక్కడా ఆకట్టుకుంటాయ్. సౌందరరాజన్ సినిమాటోగ్రఫీ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌కి తగ్గట్టుగా బాగుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వరకూ ఆకట్టుకుంటుంది. పాటలు పెద్దగా గుర్తుండవ్. నిర్మాణ విలువలు బాగున్నాయ్. ఎడిటింగ్‌కి చాలా చోట్ల కత్తెరలు పడాల్సిన అవసరం వుంది. ఓవరాల్‌గా టెక్నికల్ టీమ్ వర్క్ బాగున్నప్పటికీ, దర్శకుడు కథనంపై చేసిన కసరత్తు అస్సలు సరిపోలేదు. ఇలాంటి పీరియాడిక్ కథల్ని ఎంచుకోవడంలో వున్న టఫ్‌నెస్ అలాంటిది.

ప్లస్ పాయింట్స్:
యాక్షన్ బ్లాక్స్, ప్రీ ఇంటర్వెల్ బ్లాక్, సెకండాఫ్..

మైనస్ పాయింట్స్:
అక్కడక్కడా సాగతీతగా అనిపించిన కొన్ని సన్నివేశాలు, రొటీన్‌గా సాగిన ఫస్టాఫ్..

చివరిగా:
 ‘డెవిల్’ ఆశించిన థ్రిల్, ఊహించని ట్విస్ట్‌లు ఇవ్వడంలో సక్సెస్ అయ్యిందా.? ఫెయిలైందా.? అనేది ప్రేక్షకుడి ఊహకే వదిలేయాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com