ఖతర్‌లో భారతీయులకు జైలుశిక్ష.. అప్పీలుకు 60 రోజుల గడువు..
- January 05, 2024
న్యూ ఢిల్లీ: ఖతర్‌లో గూఢచర్యం ఆరోపణలపై అరెస్టైన 8 మంది భారత నేవీ మాజీ ఉద్యోగులకు మరింత ఊరట లభించింది. వీరికి విధించిన మరణ శిక్షను ఇప్పటికే న్యాయస్థానం జైలు శిక్షగా మార్చింది.
తాజాగా దీనిపై కూడా అప్పీలు చేసుకోవడానికి 60 రోజుల వ్యవధిని ఇచ్చినట్లు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ వెల్లడించారు. ''ఎనిమిది మంది భారతీయుల పిటిషన్‌పై డిసెంబర్ 28న అక్కడి కోర్ట్ ఆఫ్ అప్పీల్ తీర్పునిచ్చింది. వారి మరణశిక్ష రద్దు చేసి జైలు శిక్షగా మార్చింది. మా న్యాయ బృందానికి తీర్పు కాపీ అందింది. మరణశిక్షను రద్దు చేసిన విషయాన్ని మాత్రం నేను కచ్చితంగా చెప్పగలను. మిగిలిన అంశాలు రహస్యం. ఈ సందర్భంగా కోర్టు భారత న్యాయ సహాయ బృందాలకు 60 రోజుల గడువు ఇచ్చింది. ఈ లోగా జైలు శిక్షపై కూడా అప్పీలు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ అప్పీలు ఖతర్ అత్యున్నత న్యాయస్థానం ఎదుట విచారణకు వస్తుంది'' అని వివరించారు. ఇక మరణ శిక్ష రద్దు చేసిన నాటి నుంచి ఈ 60 రోజుల గడువు మొదలైందని పేర్కొన్నారు.
8 మంది భారత నౌకాదళ మాజీ సిబ్బందిని 2022లో ఖతర్ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. వారిలో కెప్టెన్లు సౌరభ్ వశిష్ఠ్, నవతేజ్ గిల్, కమాండర్లు బీరేంద్ర కుమార్ వర్మ, పూర్ణేందు తివారీ, సుగుణాకర్ పాకాల, సంజీవ్ గుప్తా, అమిత్ నాగ్‌పాల్, సెయిలర్ రాగేశ్ ఉన్నారు. వీరిలో సుగుణాకర్ విశాఖ వాసి. వీరి పై గూఢచర్యం ఆరోపణలున్నాయని అక్కడి పత్రికలు పేర్కొన్నాయి. దాదాపు రెండు నెలల తర్వాత అతికష్టం మీద భారత దౌత్య సిబ్బందితో కలిసే అవకాశం వీరికి కల్పించారు. 2023 మార్చి దాకా వారిపై నేరాభియోగాలనూ వెల్లడించలేదు. అక్కడి ప్రాథమిక కోర్టు రెండు మూడుసార్లు మాత్రమే విచారణ జరిపింది. వారిపై ఉన్న అభియోగాలతో ఏకీభవిస్తూ మరణ శిక్షను ఖరారు చేసింది. ఈ కేసు వివరాలపై ఇటు మన విదేశాంగ శాఖ, అటు ఖతర్ ప్రభుత్వం మౌనం వహించాయి. మరోవైపు భారత్ దౌత్య, న్యాయ మార్గాల్లో తీవ్రంగా ప్రయత్నించి కొంత సఫలీకృతమైంది.
ఖతర్‌లో లక్షల సంఖ్యలో భారతీయులు వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్నారు. భారత్ పెద్ద ఎత్తున ఎల్‌ఎన్‌జీని అక్కడి నుంచే దిగుమతి చేసుకుంటోంది. దోహాకు గణనీయంగా ఎగుమతులు చేసే దేశాల్లో భారత్ ఒకటి. ఉగ్రవాదానికి ఊతమిస్తోందనే ఆరోపణలపై.. గతంలో సౌదీ, యూఏఈ, బహ్రెయిన్, ఈజిప్ట్ దేశాలు ఖతర్‌కు దారితీసే జల, వాయు, భూమార్గాలను దిగ్బంధించాయి. ఆ కష్ట సమయంలో కూడా మనదేశం నిర్మాణ సామగ్రి, ఆహార సరఫరాలో దోహాకు లోటు చేయలేదు. ఇరుదేశాల మధ్య రక్షణ సహకార రంగ ఒప్పందాలున్నాయి.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్‌తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







