ఘనంగా TSRTC గ్రాండ్‌ ఫెస్టివల్‌ ఛాలెంజ్ అవార్డుల ప్రదానోత్సవం

- March 07, 2024 , by Maagulf
ఘనంగా TSRTC గ్రాండ్‌ ఫెస్టివల్‌ ఛాలెంజ్ అవార్డుల ప్రదానోత్సవం

హైదరాబాద్: టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.సీసీఎస్‌, పీఎఫ్‌, ఇతర పెండింగ్‌ విషయాలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి.. త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు.హైదరాబాద్ లోని టీఎస్ఆర్టీసీ కళాభవన్ లో గురువారం గ్రాండ్‌ ఫెస్టివల్‌ ఛాలెంజ్‌తో పాటు మేడారం జాతరలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఉద్యోగులకు, దసరా లక్కీ డ్రా విజేతలకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్‌..టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ తో కలిసి 157 మంది ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు అందజేసి వారిని సన్మానించారు. 

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ..కండక్టర్లు, డ్రైవర్లు టీఎస్ఆర్టీసీకి పునాదిలాంటి వారని, నిబద్దత, అంకితభావంతో పనిచేస్తోన్న సిబ్బందిని గుర్తించి అవార్డులను అందజేసి సన్మానించుకోవడం అభినందనీయమన్నారు. మహాలక్ష్మి పథకం అమలుతో టీఎస్‌ఆర్టీసీకి సత్ఫలితాలు వస్తున్నాయని, గతంలో నష్టాల్లో ఉన్న సంస్థ ఈ స్కీం వల్ల లాభాల్లోకి వస్తోందని తెలిపారు. మహాలక్ష్మి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని 24 కోట్ల మహిళలు ఇప్పటివరకు వినియోగించుకున్నారని పేర్కొన్నారు. 

మహాలక్ష్మి పథకం పేరుతో అత్యుత్తమ విధులు నిర్వహిస్తోన్న మహిళా ఉద్యోగులను అవార్డులు అందజేయాలని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ కి సూచించారు. సంస్థలో మహిళా డ్రైవర్లనూ నియమించుకునే అంశాన్ని పరిశీలించాలన్నారు. 

మహాలక్ష్మి స్కీం అమలుతో పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను సంస్థ కొనుగోలు చేస్తోందని, అందుకు ప్రభుత్వ సహకారం కూడా అందిస్తున్నట్లు తెలిపారు. కొత్త బస్సులకు అనుగుణంగా సంస్థలో నియామకాలు కూడా చేపడుతున్నట్లు వెల్లడించారు. టీఎస్‌ఆర్టీసీ బాగుకోసం ఉద్యోగుల నుంచి సలహాలు, సూచనలను సంస్థ స్వీకరిస్తోందని చెప్పారు. 

టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ మాట్లాడుతూ.. టీఎస్ఆర్టీసీ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని అన్నారు. మేడారం మహాజాతరలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది అద్బుతంగా పనిచేశారని, భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాలనే ఉద్దేశంతో కొందరు డ్రైవర్లు భోజనం కూడా చేయకుండా విధులు నిర్వర్తించారన్నారు.మహాలక్ష్మి స్కీం అమలు తర్వాత సిబ్బందిపై కొంత పని ఒత్తిడి పెరిగిందని,  ఒత్తిడిలోనూ ఓపికతో పనిచేస్తూ ప్రశాంత వాతావరణంలో పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోన్న సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 

సిబ్బంది నిజాయతీతో ఉత్తమ సేవలందించడం వల్లే జాతీయస్థాయిలో సంస్థకు గుర్తింపు లభిస్తోందన్నారు.ఇటీవల ఏఎస్‌ఆర్‌టీయూ ప్రతి ఏటా ప్రకటించే ప్రతిష్టాత్మక ఐదు నేషనల్‌ పబ్లిక్‌ బస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డులను టీఎస్‌ఆర్టీసీ గెలుచుకుందని గుర్తు చేశారు. ప్రయాణికుల ఆదరణ, ఉద్యోగుల సమిష్టి కృషి, అధికారుల ప్రణాళిక, రాష్ట్ర ప్రభుత్వ సహకారం వల్ల సంస్థకు సత్పలితాలు వస్తున్నాయని చెప్పారు.

ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలను ప్రభుత్వం దృష్టికి యాజమాన్యం తీసుకెళ్లిందని, రాష్ట్రప్రభుత్వం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సహకారంతో ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మహాలక్ష్మితో పెరిగిన రద్దీకి అనుగుణంగా మరో 2 వేల కొత్త బస్సుల కొనుగోలుకు సంస్థ ప్లాన్ చేస్తోందని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించామని తెలిపారు.  

మంత్రి పొన్నం ప్రభాకర్‌ సూచనల మేరకు మహాలక్ష్మి పథకం అమలులో అత్యుత్తమ విధులు నిర్వహిస్తోన్న మహిళా ఉద్యోగులకు అవార్డులు అందజేస్తామని, సంస్థలో మహిళా డ్రైవర్లనూ నియమించుకునే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. 

గ్రాండ్‌ ఫెస్టివల్ ఛాలెంజ్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన రీజియన్లు ఇవే!

మహాలక్ష్మి పథకం అమలుకు ముందు: పస్ట్ బెస్ట్ రీజియన్ కరీంనగర్‌, సెకండ్ బెస్ట్ రీజియన్ మహబుబ్‌నగర్‌, థర్డ్ బెస్ట్ రీజియన్ నిజామాబాద్‌.
మహాలక్ష్మి పథకం అమలు తర్వాత: పస్ట్ బెస్ట్ రీజియన్  హైదరాబాద్‌, సెకండ్ బెస్ట్ రీజియన్ సికింద్రాబాద్‌, థర్డ్ బెస్ట్ రీజియన్ వరంగల్‌.

ఈ ప్రదానోత్సవ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ సీవోవో డాక్టర్ వి.రవిందర్,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్,పురుషోత్తం, కృష్ణకాంత్, వెంకటేశ్వర్లు, పైనాన్స్‌ అడ్వైజర్‌ విజయ పుష్ఫ, సీఎంఈ రఘునాథరావు, తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com