21 శాంతం ఫిట్మెంట్ తో ఆర్టీసీ ఉద్యోగుల బాధ్యత మరింత పెరిగింది: వీసీ సజ్జనార్
- March 10, 2024
హైదరాబాద్: తమ ఉద్యోగులకు 21 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గత మూడు నెలలుగా ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ కోసం ఉన్నతాధికారులు కసరత్తు చేశారని, ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోన్న పీఆర్సీ కల సాకరమైన ఈ సందర్భం చారిత్రత్మాకమని ఆయన అభివర్ణించారు. 2017 వేతన సవరణలో భాగంగా 21 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్ బస్ భవన్ నుంచి క్షేత్రస్థాయి సిబ్బందితో టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు వర్చువల్‌గా ముఖాముఖి నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ సిబ్బంది సంక్షేమానికి యాజమాన్యం పెద్ద పీటవేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో పెండింగ్ లో ఉన్న ప్రతి అంశాన్ని సంస్థ పరిష్కరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
"వేతన సవరణతో ఆర్టీసీ ఉద్యోగుల బాధ్యత మరింతగా పెరిగింది. ప్రజా రవాణా వ్యవస్థను ప్రజల్లోకి తీసుకెళ్లి.. వారికి మెరుగైన, నాణ్యమైన సేవలందించేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలి. భవిష్యత్ లోనూ రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి.. జాతీయ స్థాయిలో సంస్థకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి. ప్రభుత్వం సంస్థపై పెట్టుకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిబద్దత, అంకితభావం, క్రమ శిక్షణతో విధులు నిర్వర్తించాలి." అని టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఎండీ వీసీ సజ్జనర్ దిశానిర్ధేశం చేశారు.
టీఎస్‌ఆర్టీసీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ.. సిబ్బంది సంక్షేమ విషయంలో యాజమాన్యం ఏమాత్రం రాజీ పడటం లేదని, రెండున్నర ఏళ్లుగా అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని గుర్తు చేశారు. "గతంలో కోవిడ్ ప్రభావం, డిజిల్ భారం సంస్థపై పడింది. ఉద్యోగులకు సమయానికి వేతనాలు చెల్లించపోవడంతో.. వారిలో తీవ్రమైన నిరాశ, నిస్పృహ, అభద్రతాభావం ఉండేది. రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకు వచ్చేవి కావు. ఉద్యోగుల్లో ఉన్న నిస్పృహ పొగొట్టి వారికి మనోనిబ్బరం కలిగిస్తే దాదాపు 50 శాతం కష్టాలను అధిగమించవచ్చని య నమ్మి.. బ్యాంకుల సహకారంతో అక్టోబర్ 2022 నుంచి ఒక్కటో తేదిన జీతాలు అందేలా సంస్థ చర్యలు చేపట్టింది." అని అన్నారు.
సిబ్బందికి ఇప్పటివరకు 9 డీఏలను సంస్థ చెల్లించిందని, అన్ని కేటగిరీలలో పదోన్నతులు కూడా కల్పించిందని తెలిపారు. ఉద్యోగులకు మెరుగైన ఆరోగ్య వైద్య సేవల్ని అందించేందుకు తార్నాకలోని టీఎస్ఆర్టీసీ ఆసుపత్రిని కార్పొరేట్ తరహాలో ఆధునీకరించామన్నారు.
50 వేల మంది ఉద్యోగులకు గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ పేరుతో వైద్యపరీక్షలు నిర్వహించామని, దీని వల్ల గుండెసంబంధిత వ్యాధులతో బాధపడుతున్న 300 మందిని ప్రాణాప్రాయం నుంచి కాపాడామని వివరించారు.
ఆర్థిక ప్రయోజనాన్ని చేకూర్చే పెండింగ్ లో ఉన్న రూ.280 కోట్ల బాండ్ల మొత్తాన్ని ప్రభుత్వ సహకారంతో చెల్లిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదాల్లో మరణించిన సిబ్బంది కుటుంబాలకు అండగా నిలిచేందుకు యు.బి.ఐ సహకారంతో కోటి రూపాయలకు పైగా ఉచిత ప్రమాద బీమాను వర్తింపజేశామని గుర్తుచేశారు.
మహాలక్ష్మి పథకాన్ని 48 గంటల్లోనే అమలులోకి తీసుకువచ్చి.. మహిళలకు ఉచిత ప్రయాణం సజావుగా సాగుతుండటంలో సిబ్బంది కృషి ఎనలేనిదన్నారు. 90 రోజులుగా 25 కోట్ల మంది మహిళలను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చారని తెలిపారు. మేడారం లాంటి జాతరలను విజయవంతం చేశారని గుర్తుచేశారు. సిబ్బంది సమిష్టి కృషితో పనిచేయడం వల్లే జాతీయ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఐదు నేషనల్ పబ్లిక్ బస్ ట్రాన్స్ పోర్టు ఎక్స్‌లెన్స్ అవార్డులను సంస్థ సాధించగలిగిందన్నారు.
"బకాయిల నుంచి బయటపడాలంటే ఇంకా రెట్టించిన సామర్థ్యంతో పనిచేయాలి. ఆక్యూపెన్సీ రేషియో తగ్గకుండా బస్సులను నడపాలి. ఏ ఒక్క ప్రయాణికుడు అసౌకర్యానికి గురికాకుండా చూడాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉంది. మీ అందరికీ యాజమాన్యం తరపున పూర్తి మద్దతు, సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. మీ కష్టనష్టాలు, సాధకబాధకాలు ఎంప్లాయ్ వెల్ఫేర్ బోర్డు సభ్యుల దృష్టికి తీసుకురావచ్చు. వాటిని ఎప్పటికప్పడు యాజమాన్యం పరిష్కరిస్తుంది." అని సజ్జనర్ అన్నారు. సంస్థ మీద నమ్మకం, విశ్వాసంతో తీసుకువచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని, ఇప్పుడు అదే నమ్మకాన్ని కొనసాగిస్తూ ఆదర్శమైన పబ్లిక్ రంగ సంస్థగా టీఎస్‌ఆర్టీసీని తీర్చిదిద్దేందుకు సిబ్బంది అంతా తోడ్పాడుతారనే గట్టి విశ్వాసం తనకుందని ఆయన అన్నారు.
ఈ వర్చువల్ సమావేశంలో సీవోవో డాక్టర్ రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, ఫైనాన్స్ అడ్వజర్ విజయపుష్ఫ, సీపీఎం ఉషాదేవి, సీటీఎం(ఆపరేషన్స్) జీవన ప్రసాద్, సీటీఎం(కమర్షియల్) శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష