ఔట్‌సోర్సింగ్ కంపెనీలతో ఒప్పందాలను రద్దు చేయాలి.. బహ్రెయిన్ ఎంపీలు

- March 14, 2024 , by Maagulf
ఔట్‌సోర్సింగ్ కంపెనీలతో ఒప్పందాలను రద్దు చేయాలి.. బహ్రెయిన్ ఎంపీలు

బహ్రెయిన్: కాంట్రాక్టుల ఆధారంగా కార్మికులను అందించడంలో నిమగ్నమైన కంపెనీల ప్రవర్తన కారణంగా బహ్రెయిన్ పౌరులు తమ ఉద్యోగాల్లో స్థిరత్వాన్ని కోల్పోతున్నారని బహ్రెయిన్ ఎంపీలు ఆరోపించారు. ప్రతినిధుల కౌన్సిల్ యొక్క సెషన్‌లో ఈ అంశంపై కీలకంగా చర్చించారు. నార్తర్న్ గవర్నరేట్‌లోని రెండవ నియోజకవర్గం ఎంపీ జలాల్ కధెం హసన్, కాంట్రాక్టు కంపెనీల ద్వారా కార్మికుల సరఫరాను రద్దు చేయాలని కోరారు. గృహ కార్మికులను సరఫరా చేయడానికి మాత్రమే ఇటువంటి వ్యవస్థ ప్రారంభంలో అనుమతించబడిందని ఎంపీలు గుర్తుచేశారు. అలాంటి కంపెనీలు ఇప్పుడు నిబంధనలను కాదని ఇంజనీర్లు, డాక్టర్లను కూడా నియమించుకుంటున్నాయని ఎంపీలు వివరించారు. నిబంధనలను ఉల్లంఘించే ఔట్‌సోర్సింగ్ కంపెనీలతో ఒప్పందాలను రద్దు చేయాలని, ఉద్యోగ స్థిరత్వం లేకపోవడం సమస్యను తొలగించడానికి పౌరులను నేరుగా నియమించుకోవాలని ఎంపీలు సూచించారు. అదేసమయంలో ఉద్యోగాలు కోల్పోయిన పౌరులకు ఉద్యోగాలు కల్పించాలనే తక్షణ ప్రతిపాదనను ఐదుగురు ఎంపీలు ప్రవేశపెట్టారు. మెజారిటీ ఎంపీలు ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. రమదాన్ సందర్భంగా ఉపాధి కోల్పోయిన కొన్ని కుటుంబాల దుస్థితిని ఎంపీ మునీర్‌ ఇబ్రహీం ఎత్తిచూపారు. ఉద్యోగాలు కోల్పోయిన వారి జీవితాలు, వారి కుటుంబాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం త్వరితగతిన స్పందించి వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఆయన కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com