టాలీవుడ్ గేమ్‌ఛేంజ‌ర్...!

- March 26, 2024 , by Maagulf
టాలీవుడ్ గేమ్‌ఛేంజ‌ర్...!

‘చిరుత’గా అడుగుపెట్టి.. ఆ తర్వాత నెక్ట్స్ మూవీ ‘మగధీర’తో టాలీవుడ్‌ రికార్డులన్నింటినీ తిరగరాసి మెగా ధీరుడు అనిపించుకున్నాడు. వైవిధ్య‌భ‌రిత క‌థ‌ల‌ను ఎంచుకుంటూ విల‌క్ష‌ణ న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్న న‌టుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌. ఈ రోజు రామ్ చరణ్ పుట్టినరోజు.

చ‌ర‌ణ్ 1985 మార్చి 27న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులకు చెన్నైలో జ‌న్మించాడు. హైద‌రాబాద్ పబ్లిక్ స్కూల్లో 10వ త‌ర‌గతి పూర్తి చేశాడు. ఇదే స్కూల్లో చదువుకున్న యుంగ్ హీరోలు రానా ద‌గ్గుబాటి, శ‌ర్వానంద్ చరణ్ కు మంచి స్నేహితుల‌య్యారు.

చ‌ర‌ణ్ మొద‌ట క్రికెట‌ర్ అవ్వాల‌ని అనుకున్నాడ‌ట‌. దానికోసం శిక్ష‌ణ కూడా తీసుకున్నాడు. ప‌రేడ్ గ్రౌండ్‌లో జూనియ‌ర్ రంజీలో సైతం ఆడాడు. అయితే జ‌ర్మ‌నీలో ఆటోమోబైల్ ఇంజనీరింగ్ చదవాలనే కోరిక వల్ల  క్రికెట్ కు దూరం అయ్యాడు. అయితే కొన్ని కారణాల వల్ల జర్మనీ కూడా వెళ్లలేదు.

ఇక చిరంజీవి స్టార్ హీరో అవ‌డంతో అప్ప‌ట్లో నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు త‌ర‌చూ వాళ్ళ ఇంటికి వ‌చ్చి చ‌ర‌ణ్‌ను కూడా క‌లిసేవారు. ఆ సమయంలో  ఎప్పుడు హీరోగా సినిమా చేస్తున్నావు. ఎలాంటి క‌థ‌తో సినిమా చేయాల‌నుకుంటున్నావు అంటూ చ‌ర‌ణ్‌కు సినిమాల‌పై ఇష్టాన్ని పెంచార‌ట‌. ఇక చ‌ర‌ణ్‌, చిరంజీవి ద‌గ్గ‌ర‌కు వెళ్ళి సినిమాల్లో న‌టిస్తాను అని చెప్పాడ‌ట‌. అప్పుడు చ‌ర‌ణ్ ముంబైలోని ప్రముఖ యాక్టింగ్ ట్రైనర్ కిషోర్ నమిత్ కపూర్ వద్ద యాక్టింగ్ శిక్షణ తీసుకున్నాడు.

డైనమిక్ స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ‘చిరుత’ సినిమా ద్వారా 2007లో హీరోగా టాలీవుడ్‌ అరంగేట్రం చేశాడు రామ్‌చ‌ర‌ణ్‌. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాలో చ‌ర‌ణ్ న‌ట‌న‌, లుక్స్‌పై చాలా విమ‌ర్శ‌లొచ్చాయి. చిరంజీవి గ్రేస్‌, యాక్టింగ్ టాలెంట్ చ‌ర‌ణ్‌కు రాలేదంటూ నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి.

ఆ విమ‌ర్శ‌ల్ని పాజిటివ్‌గా తీసుకుంటూ న‌టుడిగా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ మ‌గ‌ధ‌రీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ను అందుకున్నాడు. ఆ త‌ర్వాత రంగ‌స్థ‌లంతో ప‌రిపూర్ణ న‌టుడిగా పేరుతెచ్చుకున్నారు చ‌ర‌ణ్‌. చెవిటి యువ‌కుడి పాత్ర‌లో స‌హ‌జ న‌ట‌న‌తో విమ‌ర్శ‌కుల్ని మెప్పించాడు.

ఆర్ఆర్ఆర్ చ‌ర‌ణ్ కెరీర్‌లో ఆణిముత్యంలా నిలిచిపోయింది. తండ్రికి ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకోవ‌డానికి త‌పించే సీతారామరాజు  పాత్ర‌లో పరిపూర్ణమైన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచి వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌ల్ని అందుకున్నాడు.ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబ‌ల్‌ స్టార్‌గా మారిపోయాడు చ‌ర‌ణ్. జేమ్స్ కామెరూన్ నుంచి ఆనంద్ మ‌హీంద్రా వ‌ర‌కు ఎంతో మంది ప్ర‌ముఖులు అత‌డి అభిమానులుగా మారిపోయారు. ఇవ‌న్నీ చిరంజీవి వార‌సుడిగా రామ్‌చ‌ర‌ణ్ సాధించిన ఘ‌న‌త‌లు కాదు. త‌న స్వ‌యంకృషి, వ్య‌క్తిత్వం, అస‌మాన న‌ట‌న‌తో చరణ్ సాధించిన విజ‌యాలుగా చెప్ప‌వ‌చ్చు.

సినీ ప‌రిశ్ర‌మ‌లో చరణ్ అజాత‌శ‌త్రువు. సీనియ‌ర్ నుంచి యంగ్ హీరోల వ‌ర‌కు అంద‌రితో క‌లుపుగోలుగా ఉంటాడు. వివాదాల‌కు తోలి నుండి చ‌ర‌ణ్ దూరంగానే ఉంటూ వ‌స్తున్నాడు. ఎన్ని స‌క్సెస్‌లు వ‌చ్చినా చ‌ర‌ణ్ వ్య‌క్తిత్వంలో కొంచెం కూడా మార్పు రాలేద‌ని స‌న్నిహితులు చెబుతుంటారు.

ఒక‌ప్పుడు చిరంజీవి త‌న‌యుడిగానే  చ‌ర‌ణ్ అంద‌రికీ తెలుసు. కానీ ఇప్పుడు చ‌ర‌ణ్ ఓ గ్లోబ‌ల్ స్టార్‌. వ‌ర‌ల్డ్ వైడ్‌గా అత‌డి పేరు తెలియ‌ని సినీ అభిమాని లేడంటే అతిశ‌యోక్తి కాదు.ప్ర‌స్తుతం తమిళ దర్శకుడు శంక‌ర్‌తో గేమ్‌ఛేంజ‌ర్ , ఉప్పెన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబుతో ఓ సినిమా చేస్తున్నాడు. మెగా వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా త‌న న‌ట‌న‌, అభిన‌యంతో సినీరంగంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని ఏర్ప‌ర‌చుకున్నాడు.

-- డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com