ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2024

- April 08, 2024 , by Maagulf
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2024

ఎన్నిక‌ల కోల‌హ‌లం ఆంధ్రప్రదేశ్ లో మొద‌లైంది. దేశ వ్యాప్తంగా లోక్‌స‌భ ఎన్నిక‌ల‌తో పాటు.. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌లూ జ‌ర‌గనున్నాయి. ఇచ్ఛాపురం నుంచి కుప్పం వ‌ర‌కు రాష్ట్ర ప్రజ‌లంతా త‌మ పాల‌కుడిని ఎన్నుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ ఎన్నిక‌ల యుద్ధంలో గెలుపు కోసం అన్ని పార్టీలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత జ‌ర‌గ‌బోతున్న మూడో ఎన్నిక‌ల్లో అధికారం ఎవ‌రిని వ‌రిస్తుంద‌నే ఉత్కంఠ నెల‌కొంది.

2014లో పవన్‌ కళ్యాణ్ పార్టీ జనసేన, భారతీయ జనతాపార్టీతో కలిసి తెలుగుదేశం కూటమిగా ఏర్పడి పోటీ చేయగా. ఆ ఎన్నికల్లో  ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 88 ఉండగా మిత్రపక్షాలతో కలిపి టీడీపీ 175 సీట్లకు గాను 106 స్థానాల్లో విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీ 67 స్థానాలతో ప్రతిపక్షానికి పరిమితం అయ్యింది.

2019 ఏప్రిల్ 11న జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వాన్ని జగన్ నాయకత్వంలోని వైసీపీ  ఓడించింది. ఈ అసెంబ్లీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలతో పాటు జరిగాయి.ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ), యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్సార్ సీపీ), జనసేన పార్టీలు ప్రధాన పార్టీలుగా పోటీకి దిగాయి. 175 స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 151 స్థానాలు గెలుచుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. 23 స్థానాలతో టీడీపీ ప్రతిపక్షానికి పరిమితం అయ్యింది.

గ‌త 2 ఎన్నిక‌ల‌తో పోలిస్తే ఈ ఎన్నిక‌లు కాక‌ రేపుతున్నాయి. వైసీపీ ఒంట‌రిగా బ‌రిలోకి దిగుతుంటే అవినీతి పాల‌న‌కు అంతం పల‌కాల‌నే నినాదంతో టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి క‌ట్టాయి. కూట‌మిలో ప్రధాన భాగ‌స్వామి తెలుగుదేశం పార్టీ ఉంది. రెండోసారి అధికారం కోసం వైసీపీ ప్రయ‌త్నిస్తుంటే.. ఈ సారి వైసీపీని ఓడిస్తామ‌ని కూట‌మి శ‌ప‌థం చేస్తోంది.

కాంగ్రెస్ సైతం వామ‌ప‌క్షాల‌తో క‌లిసి పోటీ చేస్తున్నప్పటికీ ప్రధాన పోటీ టీడీపీ కూట‌మికి, వైసీపీకి మ‌ధ్యనే ఉండ‌నుంది. ఈసారి పార్టీలకు  2014, 2019లో లాగా ఎన్నికల్లో ఏకపక్ష విజయాలు  సాధ్యం కాకపోవచ్చు అని రాజ‌కీయ విశ్లేష‌కులు విశ్లేషిస్తున్నారు. 

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం చూస్తుంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన అది స్వల్ప సీట్లతో మతమే గద్దెనెక్కే అవ‌కాశం ఉంద‌నే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమ‌వుతోంది. మే 13, 2024న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరుగుతాయి, జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. ఆంధ్రప్రదేశ్  ఎన్నిక‌ల యుద్ధంలో గెలిచేదెవ‌రు.. ఓడేదెవ‌రో తెలియాలంటే జూన్‌4న ఆగాల్సిందే.

                              --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com