ఉగాది విశిష్టత

- April 08, 2024 , by Maagulf
ఉగాది విశిష్టత

హిందువులు అత్యంత ఇష్టంగా జరుపుకునే తొలి పండుగ ఉగాది.ఉగాది వస్తోందంటే చాలు వేప పచ్చడీ, పంచాంగ శ్రవణమే గుర్తుకుస్తాయి. మరి ఉగాది అంటే ఇంతేనా! ఆ రోజు పూజించేందుకు ప్రత్యేకమైన దైవం కానీ, ఆచరించాల్సిన విధులు కానీ లేవా అంటే లేకేం... ఉగాది అంటే అందరికి గుర్తుకు వచ్చేది తెలుగు వారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది తెలుగు వారి పండుగ గుర్తింపు తెచ్చుకుంది. యుగాది అనే సంస్కృత పదానికి తెలుగు రూపం ఉగాది.

చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్విదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచంగ శ్రవణాన్ని చేస్తారు. మరికొన్ని గంటల్లో  శోభకృత్  నామ సంవత్సరానికి ముగింపు పలికి క్రోధి నామ సంవత్సరానికి స్వాగతం పలకనుంది.

కాలమానాన్ని గణించడానికి ఉగాది తొలిరోజు. శిశిర రుతువు ఆకురాలు కాలం. ప్రకృతి చలితో గడ్డకట్టుకొనిపోతుంది. మోడువారిపోతుంది. సంకోచం పొంది ఉంటుంది. శిశిరం తరువాత వసంతం వస్తుంది. వసంతాగమనంతో ప్రకృతి ఒక్కసారి పులకిస్తుంది. క్రొత్తదనాన్ని సంతరించుకుంటుంది. చెట్లు చిగుర్చి నూతన సృష్టి అంకురిస్తుంది. సర్వత్రా ఒక చైతన్యం అంతరంగములను కదలిస్తుంది. కోకిలలు ఈ నూతన సంవత్సరానికి చక్కని గీతాలతో స్వాగతం పలుకుతాయి.

ప్రతి పండుగలానే ఇవాళ కూడా సూర్యోదయానికి ముందరే నిద్రలేచి తైలాభ్యంగన స్నానం చేయమని చెబుతారు. నువ్వులనూనెని ఒంటికి పట్టించి చేసే స్నానమే ఈ తైలాభ్యంగనం. ఏ రోజు కుదిరినా కుదరకపోయినా సంవత్సరానికి తొలిరోజైన ఉగాదినాడు తైలాభ్యంగనం చేసి తీరాలన్నది పెద్దల శాసనం. సంవత్సరపు ఆరంభాన్ని ఇలా శుచిగా, ఆరోగ్యంగా ప్రారంభించాలన్నది వారి అభిమతం.

పూర్వపు కష్టాలను, భవిష్యత్తును గురించిన స్వప్నాలను ఒకటిగా కలిపి కదిలించి ప్రజలను సంఘటితంగా నడిపించే శుభదినం. దీనికి సూచనగానేమో కరృత్వపు అలుపు పులుపును, కొంత సత్ఫలితాల మాధుర్యాన్ని చూపే తీపి, వేపపువ్వు, పులుపు కలిపిన పచ్చడి సేవించే ఆచారం ఉంది.

ఉగాది ప్రత్యేకించి ఏ దైవానిదీ కాదు కాబట్టి, ఇంతకు ముందు ఎన్నడూ దర్శించని పుణ్యక్షేత్రానికి వెళ్లమని చెబుతారు. ఉగాది నూతన సంవత్సరానికి సూచన కాబట్టి కొత్త పనులను చేపట్టమని ప్రోత్సహిస్తారు.రైతులు కొత్త పంటలను వేసి, కొత్త జీవితానికి నాందిగా ఉగాది వేడుకను జరుపుకుంటారు. తెలుగువారి లోగిళ్ళలో పంచాంగ శ్రవణం ఘనంగా నిర్వహిస్తారు. కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు తమ రాశి ఫలాల సమాచారాన్ని తెలుసుకొని ముందుకు సాగుతారు.
                          
                                                 --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com