భారత రాజ్యాంగ రూపశిల్పి

- April 14, 2024 , by Maagulf
భారత రాజ్యాంగ రూపశిల్పి

"ప్రజలంతా మొదట విద్యావంతులు కావాలి.. అప్పుడే ఒక ఉన్నతమైన సమాజం ఏర్పడుతుంది" అని నినదించిన రాజనీతిజ్ఞుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్.భరతమాత గడ్డ పై డాక్టర్ అంబేద్కర్ జన్మించడం ఎంతో అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే ఆయనలో ఉన్నవి గొప్పశక్తులు, అంతకంటే చెప్పాలంటే ఆయనే ఒక శక్తి. అవమానాలను తన విజయ సోపానాలుగా మలుచుకుంటూ రాజ్యాంగ నిర్మాతగా మారారు.  అసమానతలు, దురహంకారంపై అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు బాబా సాహెబ్ అంబేద్కర్. నేడు అంబేద్కర్ జయంతి.  

‘బాబాసాహెబ్’గా ప్రసిద్ధి గాంచిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 1891 ఏప్రిల్‌ 14న మధ్యప్రదేశ్‌లోని అంబవాడేలో మహారాష్ట్రకు చెందిన మెహర్‌ కులంలో రామ్‌జీ మాలోజీ సక్పాల్‌, భీమాబాయ్‌ రామ్‌జీ సక్పాల్‌ దంపతులకు ఆఖరి సంతానంగా జన్మించారు. ఆయన తండ్రి రామ్‌జీ మాలోజీ సక్పాల్‌ బ్రిటిష్‌ ఇండియన్‌ ఆర్మీలో సుబేదార్‌గా పనిచేసేవారు. అంబేద్కర్‌కు రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఆయన ఆర్మీ నుంచి పదవీ విమరణ పొందారు. ఆయనకు ఆరేళ్ల వయస్సప్పుడు తల్లి భీమాబాయ్‌ మరణించారు. సతారాలో ఆయన పాఠశాల విద్య ప్రారంభమైంది. చిన్న వయసులోనే తల్లి మరణించడంతో పినతల్లి ఆయన బాగోగులు చూసింది.

అంబేద్కర్ ప్రఖ్యాత  కొలంబియా వర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి పొలిటికల్ సైన్స్ మరియు ఎకనమిక్స్ లలో పరిశోధనలు పూర్తి చేసి డాక్టరేట్లు అందుకున్నారు.స్వదేశానికి తిరిగి వచ్చాక బరోడా మహారాజా శాయాజీరావ్ సంస్థానంలో మిలిటరీ కార్యదర్శిగా పనిచేశారు.

దళిత సమస్యల పరిష్కారానికి ఆలిండియా డిప్రెస్స్‌డ్ క్లాస్ కాంగ్రెస్, ఆలిండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ వంటి అనేక రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా దళితులను సమీకరించే ప్రయత్నం చేశారు.స్వాతంత్రం సిద్ధించిన తర్వాత దళితుల రాజకీయ హక్కులు, సామాజిక స్వేచ్ఛ కోసం పనిచేశారు. రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడిగా సేవలందించి ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం తయారీలో కీలక పాత్ర పోషించారు. అలాగే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపనలో అంబేద్కర్ పాత్ర కీలకం.

కుల, మత రహిత ఆధునిక భారతావనికి కోసం అంబేద్కర్‌ తన జీవితకాలం పోరాటం చేశారు. దళితుల నాటి సమాజంలో ఉన్న వివక్షను పారద్రోలడానికి అంబేద్కర్‌ చేసిన పోరాటం మరువలేనిది. అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.జీవితాంతం విశ్రాంతి లేకుండా దేశం కోసం, దేశ ప్రజల కోసం సేవచేసిన అంబేద్కర్‌ 1956 డిసెంబర్‌ 6న నిద్రలోనే కన్నుమూశారు. 

  --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com