ప్రపంచ హాస్య నట చక్రవర్తి

- April 16, 2024 , by Maagulf
ప్రపంచ హాస్య నట చక్రవర్తి

అతను విభిన్నమైన కళాకారుడు. అనేక కళల్లో నిష్ణాతుడైన ఒక ప్రసిద్ధ బహురూపి. ప్రపంచమంతా అభిమానుల్ని ఆర్జించాడు. అందరినీ కవ్వించి నవ్వించిన  ఆ హాస్యరస చక్రవర్తి అతడు. అతడి నడక హాస్యం.నటన హాస్యం. పలుకు హాస్యం. ఉలుకు హాస్యం.అతడేం చేసినా నవ్వుల జల్లే. చిలిపి చేష్టలు,విచిత్ర ఆహార్యమే అతడి ఆస్తి. అద్భుత ప్రతిభలో తనకెవరూ సాటిలేరనిపించాడు. అతను ప్రపంచాద్భుతాల్లో ఒకడు, ఆయనే హాస్య నట చక్రవర్తి ఛార్లీ చాప్లిన్ .హాస్యానికి సిలబస్ గా ప్రపంచ చలనచిత్ర యవనికపై చెరగని గురుతుగా నిలిచిన చార్లీ చాప్లిన్ జయంతి నేడు.

చార్లీ చాప్లిన్ 1889 ఏప్రిల్ 16 వ తేదీన ఇంగ్లండ్‍లో జన్మించాడు. చార్లీ తలిదండ్రులు వృత్తిరీత్యా రంగస్థల నటులు వారి ప్రదర్శనలు 'వాడెవిల్' అనే తరహాకి చెందినవి. అంటే ఆట, పాట, హాస్యంతో కూడిన చౌచౌ ప్రదర్శనలన్నమాట. ఇంగ్లండ్‍లో మ్యూజిక్ హాల్స్‍గా ప్రసిద్ధికెక్కిన నాటక మందిరాలలో ఈ వాడెవిల్ ప్రదర్శనలు జరిగేవి.

కుటుంబ పరిస్థితుల కారణంగా చాప్లిన్‌ 13 వ ఏట వినోద ప్రపంచంలోకి ప్రవేశించాడు. నృత్యంతో పాటు స్టేజ్ నాటకాలలో కూడా పాల్గొనడం ప్రారంభించాడు.వృత్తిపరమైన జీవితంలో కూడా ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. సొంతంగా వినోదాత్మకంగా కామెడీ స్కిట్ లు రాసి ప్రదర్శించేవాడు. ఆ సమయంలో ఆఫీస్ బాయ్ గా వేసిన రోల్ మంచి పేరు తెచ్చిపెట్టింది. 1910-1913 మధ్యలో అమెరికా అంతటా ప్రదర్శనలిచ్చాడు.

ఈయన నటనకు మెచ్చి అమెరికన్ ఫిల్మ్ స్టూడియోకి ఎంపికచేశారు. ఇక అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా మూకీ చిత్రాలకు రారాజుగా అవతరించాడు. ఈయన నటించిన పూర్తి నిడివి చిత్రం ‘ది కిడ్’ 1921లో విడుదలైంది. ఈయన నటించిన సినిమాల్లో ముఖ్యంగా ఎ ఉమెన్ ఆఫ్ పారిస్, ది గోల్డ్ రష్, ది సర్కస్, సిటీ లైట్స్, మోడరన్ టైమ్స్ ఎంతో పాపులర్‌ అయ్యాయి. టాకీల యుగంలో నాటి నియంత హిట్లరును ఆటపట్టిస్తూ తీసిన 'ది గ్రేట్ డిక్టేటర్' వంటి సందేశాత్మక చిత్రాలను చాప్లిన్ నిర్మించి, దర్శకత్వం వహించాడు.

తన నటనతో ప్రపంచాన్ని అలరించిన చాప్లిన్ మూడు ఆస్కార్ అవార్డులను అందుకున్నారు.ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ వర్శిటీ 1962లో గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది.  1975లో బ్రిటీష్ ప్రభుత్వం నైట్ బిరుదుతో సత్కరించింది. నాటి నుంచి సర్ చార్లీ చాప్లిన్ అయ్యాడు.

మానవజాతికి కల్మషం లేని నవ్వు అందించిన చాప్లిన్ 1977 డిసెంబరు 25న తేదీన చాప్లిన్ కళ్లు శాశ్వతంగా మూతపడ్డాయి. ఎన్నో ఒడిదొడుకులను తట్టుకుని స్వశక్తితో చలనచిత్ర రంగంలో పైకొచ్చి ప్రపంచ సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని చార్లీ చాప్లిన్ లిఖించుకున్నాడు. 

                                          --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com