కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్‌గా కీలక బాధ్యతలు

- April 17, 2024 , by Maagulf
కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్‌గా కీలక బాధ్యతలు

హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్ గా సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఇప్పటికే ప్రచారానికి రావాలని ఏడు రాష్ట్రాల నుండి రేవంత్ రెడ్డికి ఆహ్వానాలు అందాయి. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల పీసీసీల నుంచి ఆహ్వానాలు వచ్చాయి. తాజాగా తమిళనాడు, బీహార్, గుజరాత్ రాష్ట్రాల నుండి కూడా పిలుపు వచ్చింది.

ఇవాళ, రేపు కేరళ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్ పార్లమెంటులోనూ రేవంత్ ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పోటీ చేస్తున్న అలప్పుజ పార్లమెంట్ సెగ్మెంట్ లోనూ రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ చేయనున్నారు.

ఈ నెల 19 నుండి మే 11 వరకు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 50 సభలు, 15 రోడ్ షో లకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. మెదక్, వరంగల్, భువనగిరి, మహబూబ్ నగర్, మహబూబాబాద్ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు సందర్భంగా నిర్వహించే ర్యాలీలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. ఒక్కో లోక్ సభ నియోజకవర్గంలో కనీసం మూడు చోట్ల సీఎం సభలు నిర్వహించేలా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది.

లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా నేషనల్ స్టార్ క్యాంపెయినర్ గా సీఎం రేవంత్ పై కీలకమైన బాధ్యతలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. కర్నాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సీఎం రేవంత్ వాగ్దాటిగా మాట్లాడతారు. తూటాల్లాంటి మాటలతో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడతారు. పదునైన విమర్శలతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేయడంలో రేవంత్ రెడ్డి దిట్ట. దాంతో రేవంత్ కు నేషనల్ స్టార్ క్యాంపెయినర్ గా కీలకమైన బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com