అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై తిలకం దిద్దిన సూర్య భగవానుడు

- April 17, 2024 , by Maagulf
అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై తిలకం దిద్దిన సూర్య భగవానుడు

అయోధ్య: శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై సూర్య భగవానుడు తిలకం దిద్దాడు. ఈ అపూర్వ ఘట్టాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బుధవారం అయోధ్య రాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరించాయి. ఆలయ మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోకి అద్దాలు, కటకాలతో కూడిన సాంకేతిక యంత్రాంగం సాయంతో ఈ సూర్యతిలకం ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. బాలరాముడి నుదిటిపై కన్పించిన సూర్య తిలకంతో భక్తజనం పరవశించిపోయింది. అధునాతన సాంకేతికత సాయంతో సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి విగ్రహం నుదుటిపై తిలకం వలే 58 మిల్లీమీటర్ల పరిమాణంలో కొన్ని నిమిషాల పాటు ప్రసరించాయి.

సూర్యతిలకం కోసం ఏర్పాట్లు ఇలా

మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించేలా అయోధ్య ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరిమిత సంఖ్యలో పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు శాస్త్రవేత్తలు. ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఒక పరికరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపులోపలికి కాంతి ప్రసరించి తిలకంగా కన్పించింది. బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌(ఐఐఏ) శాస్త్రవేత్తలు, పరిశోధకుల సాయంతో కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ(సీబీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు ఈ విధంగా ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించారు.గేర్‌ టీత్‌ మెకానిజంతో ప్రతి సంవత్సరం
ప్రతి శ్రీరామ నవమి రోజున శ్రీరాముడి విగ్రహంపై ఈ తిలకం దిద్దేలా ఏర్పాట్లు చేశారు. అయితే, ఏటా సూర్యకిరణాలు అక్కడే ఎలా పడతాయి? వాతావరణంలో మార్పులు ఉంటాయి? గ్రహాల పరిభ్రమణం, సమయం ఒకేలా ఉంటుందా? అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఈ సమస్యను అధిగమించేందుకు గడియారంలో ముల్లులు తిరిగేందుకు ఉపయోగించే పరిజ్ఞానం తరహాలో 'గేర్‌ టీత్‌ మెకానిజం' ఉపయోగించారు. సూర్యకాంతిని గ్రహించే పరికరం వద్దే మరో పరికరం ఏర్పాటు చేశారు. అది కాంతిని గ్రహించే అద్దాన్ని 365 రోజులు స్వల్పంగా కదుపుతూ ఉంటుంది. మళ్లీ నవమి రోజు వారు అనుకున్న చోటుకు తీసుకొస్తుంది. అంతకుముందే ఏటా శ్రీరామనవమి వచ్చే కాలాన్ని సెకన్లతో సహా లెక్కలు వేశారు శాస్త్రవేత్తలు. ఈ లెక్కల సాయంతో సూర్యకిరణాలు ప్రసరింపజేసే పరికరాలు, వ్యవస్థను రూపొందించారు. ఈ వ్యవస్థ 19 సంవత్సరాలు నిరాటంకంగా పనిచేస్తుంది. ఆ తర్వాత మరోసారి సమయాన్ని సరిచేయాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com