వరల్డ్ హెరిటేజ్ డే

- April 18, 2024 , by Maagulf
వరల్డ్ హెరిటేజ్ డే

“వారసత్వం అనేది ప్రాచీన కాలం నుంచి కొనసాగుతూ మనకు వచ్చిన సంప్రదాయం.. ఈ రోజు మనం జీవిస్తున్నాము.. భవిష్యత్తు తరాలకు మనం ఏమి అందిస్తాము.” మనుషులకు వారసత్వాలుగా ఇళ్లూ, స్థలాలూ దొరుకుతాయి. ఇంకా కావాలంటే ఇంటిపేర్లూ, వంశ చరిత్రలూ లభిస్తాయి. కానీ అంతకంటే ఘనమైనది సమాజానికి దొరికే వారసత్వం. అది మన సంస్కృతిలో ఉంటుంది. ఆ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాలలో ఉంటుంది. ప్రాచీన కట్టడాలు, స్మారక చిహ్నాలు, పలు ప్రదేశాల గుర్తింపుగా  వరల్డ్ హెరిటేజ్ డే (World Heritage Day) జరుపుకుంటారు.

ప్రతి సంవత్సరం ఏప్రిల్ 18న వరల్డ్ హెరిటేజ్ డే జరుపుకుంటారు.ప్రతి చారిత్రక ప్రదేశం నాగరికత మరియు మానవ ఎదుగుదల పురోగతికి అవసరమైన చారిత్రక రికార్డుగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా అవి గతాన్ని గుర్తుకు తెస్తాయి. వారసత్వం అనేది శక్తివంతమైన సంస్కృతులు, సంప్రదాయాలు, కళాఖండాలు, భవనాలు మరియు ఆచారాలను సూచిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారసత్వ ప్రదేశాల మీద ప్రజల్లో అవగాహన కలిగించేందుకు 1983, ఏప్రిల్ 18వ తేదీ నుంచి యునెస్కో ‘వరల్డ్ హెరిటేజ్ డే’ నిర్వహిస్తోంది. ఐక్యరాజ్యసమితిలోని సభ్యదేశాలు వారసత్వ సంపద పరిరక్షణ కోసం ఒకరికొకరు వివిధ అంశాలలో పరస్పరం సహకరించుకోవాలన్న ప్రధాన లక్ష్యంతో ఈ ప్రపంచ వారసత్వ దినోత్సవం ఏర్పాటు చేయబడింది.

1984, జనవరి 27న అప్పటి భారతదేశ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చైర్మన్‌గా భారత జాతీయ సంస్కృతి వారసత్వ సంస్థ (ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ -ఇంటాక్) అనే సంస్థ ఏర్పాటు చేయబడింది. ఈ ఇంటాక్ సంస్థకు దేశవ్యాప్తంగా 190 చాప్టర్లు ఉన్నాయి. దీనికి తోడుగా, భారతదేశ వారసత్వ సంపద విలువ, వాటి పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 'భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ', 'రాష్ట్ర పురావస్తు శాఖ'లు దేశంలో ప్రతి సంవత్సరం వారసత్వ వారంను కూడా నిర్వహిస్తున్నాయి.    
                                    
                                                --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com