వరల్డ్ ఎర్త్ డే

- April 22, 2024 , by Maagulf
వరల్డ్ ఎర్త్ డే

వాతావరణ సంక్షోభంపై దృష్టి సారిస్తూ.. ప్రపంచంలోని దేశాలన్ని.. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన వరల్డ్ ఎర్త్ డే(World Earth Day)  జరుపుకుంటారు. కాబట్టి ఈ రోజున పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత, అవసరం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు.

రోజు రోజుకూ తీవ్రమవుతున్న ప్రపంచ వాతావరణ సంక్షోభంపై దృష్టి సారిస్తూ ఎర్త్డే చేస్తారు. అధిక జనాభా, జీవవైవిధ్యాన్ని కోల్పోవడం, ఓజోన్ పొర క్షీణించడం, పెరుగుతున్న కాలుష్యంతో సహా పెరుగుతున్న పర్యావరణ సమస్యలపై ఈ రోజు ప్రజలకు అవగాహన కల్పిస్తారు.

ఎర్త్ డేను మొదటిసారిగా ఏప్రిల్ 22, 1970న జరుపుకొన్నారు. 1969లో శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన UNSEO సమావేశంలో శాంతి కార్యకర్త జాన్ మెక్‌కానెల్ భూమి, శాంతి అనే భావనను ప్రతిపాదించాడు. ప్రపంచ ఎర్త్ డేని మొదట మార్చి 21, 1970న నిర్వహించాలని ప్రతిపాదించారు. తరువాత యునైటెడ్ స్టేట్స్ సెనేటర్ గేలార్డ్ నెల్సన్ ఏప్రిల్ 22, 1970న దేశవ్యాప్త పర్యావరణపై ఆందోళనను
ప్రేరేపించారు. ఆ రోజును ఎర్త్ డే అని పేరు పెట్టారు.

వాతావరణ మార్పుల కారణంగా భూమిపై ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. దీనితో అనేక ఇబ్బందులు వస్తున్నాయి. పర్యావరణ మార్పులతో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఎప్పుడూ వర్షాలు పడే ప్రాంతాల్లో కరువు వస్తుంది. అసలు వానలే లేని ప్రాంతంలో వరదలు వస్తుంటాయి. మనం చేస్తున్న తప్పులతో చాలా దేశాలలో నీటి సమస్యలు తలెత్తాయి. ఈ భూమిని మనిషి ఎంత స్వార్థంతో వినియోగిస్తాడో ప్రకృతి కూడా అంతే నష్టాన్ని తిరిగి కలిగిస్తుంది. ప్రకృతిని కాపాడుకుంటేనే సంతోషకరమైన జీవితం గడపడం సాధ్యమవుతుంది.

పర్యావరణానికి దగ్గరగా ఉండడం అంటే పర్యావరణాన్ని ప్రేమించడం. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. సేంద్రియ పదార్థాలు వాడాలి. ప్లాస్టిక్ బాటిల్, ప్లాస్టిక్ బ్యాగ్ ఉపయోగించవద్దు. కార్లు, బైక్‌లకు బదులు సైకిళ్లను ఎక్కువగా వాడితే వాయు కాలుష్యం తగ్గుతుంది. ప్రతి మనిషి తన జీవితకాలంలో చెట్లను నాటాలి. ఇది మన తర్వాతి తరానికి మనం ఇచ్చే గొప్ప బహుమతి. 

                                           --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com