క్రికెట్ హిట్ మ్యాన్

- April 30, 2024 , by Maagulf
క్రికెట్ హిట్ మ్యాన్

అతను క్రీజులోకి వస్తే ఎన్నో అంచనాలు. అతని బ్యాట్‌లో మార్క్ వా లాంటి ఫ్లో ఉందని కొందరు అంటున్నారు. అతను ఎవరో కాదు...రోహిత్ శర్మ. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. నేడు రోహిత్ శర్మ పుట్టినరోజు

హిట్ మ్యాన్‌గా పిలవబడే రోహిత్ గురునాథ్ శర్మ 30 ఏప్రిల్ 1987లో నాగ్‌పూర్‌లో జన్మించాడు. రోహిత్ అమ్మ పూర్ణిమ సొంత ఊరు విశాఖపట్నం. నాన్న గురునాథ్ శర్మ ఒక ట్రాన్‌పోర్ట్ కంపెనీలో పని చేసేవారు. రోహిత్ శర్మ పెరిగింది ముంబైలోని బోరివలిలోని వాళ్ల నానమ్మ, తాతయ్య దగ్గరే. రోహిత్ అమ్మ, నాన్న ఒక సింగిల్ రూమ్‌లో ఉండేవాళ్లు. కొడుకును కూడా అక్కడ ఉంచలేక తాతయ్య దగ్గరకు పంపారు.

రోహిత్ కు క్రికెట్ మీదున్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు అతన్ని ప్రోత్సహించారు. కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే అయినా రోహిత్ కు శిక్షణ ఇప్పించారు. రోహిత్ అంచలంచెలుగా ఎదుగుతూ 2007లో ఇండియన్ క్రికెట్ టీంలో అడుగుపెట్టాడు. అయితే వరుస వైఫల్యాలు , గాయాలతో జట్టులో సుస్థిరమైన స్థానం మాత్రం సంపాదించలేకపోయాడు.

మహేంద్ర సింగ్ ధోనీ 2013లో రోహిత్‌ను ఓపెనర్‌గా చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నిజానికి రోహిత్ కెరీర్‌కు కొత్త ఆరంభం అయింది. 2013 నుంచి రోహిత్ కెరీర్ ట్రాక్‌పై పరుగెత్తడం ప్రారంభించినప్పటి నుంచి వేగం పెరుగుతూనే ఉంది. అదే సంవత్సరంలో, అతను ఛాంపియన్స్ ట్రోఫీలో రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. అదే సంవత్సరం చివరిలో ఆస్ట్రేలియాపై 209 పరుగులు చేశాడు. అదే ఏడాది  నవంబర్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. సచిన్ టెండుల్కర్ ఆడిన చివరి టెస్టు అదే. ఆ మ్యాచ్‌లో రోహిత్ 177 పరుగులు చేశాడు. అరంగేట్రం టెస్టులో రెండో అత్యధిక స్కోరుగా రికార్డు సృష్టించాడు.

వన్డేల్లో రోహిత్ డబుల్ సెంచరీ మూడుసార్లు సాధించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో మూడుసార్లు డబుల్ సెంచరీ చేసిన ఏకైక ఆటగాడు. అత్యధిక స్కోరు 264. 2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20లో సెంచరీ సాధించాడు. ఈ ఫార్మాట్‌లో అతనిది మొదటిది. రోహిత్‌కి ఇప్పుడు అంతర్జాతీయ టీ20ల్లో నాలుగు సెంచరీలు ఉన్నాయి.

2020 టీ20 వరల్డ్ కప్ తరువాత విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్ గా తప్పుకోవడంతో రోహిత్ ఇండియన్ టీం టీ20 కెప్టెన్ అయ్యాడు . వన్డే లకీ కూడా విరాట్ స్థానంలో రోహిత్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఫిబ్రవరీ 19, 2021న  రోహిత్ శర్మను ఇండియా టీం టెస్ట్ కెప్టెన్ గా బీసీసీఐ  నియమించింది.

మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మాన్‌గా రోహిత్ రికార్డులకు ఎక్కాడు. అంతకు ముందు సురేష్ రైనా ఈ ఫీట్ సాధించాడు. రోహిత్ మూడు ఫార్మాట్లలోనూ సిక్స్ కొట్టి సెంచరీ సాధించాడు. ఇది ఒక అరుదైన రికార్డు. రోహిత్ శర్మ వన్డేల్లో 150+ పరుగులు ఎనిమిది సార్లు సాధించాడు. గతంలో సచిన్, డేవిడ్ వార్నర్ పేరు మీద ఉన్న ఈ రికార్డులు ఇప్పుడు హిట్ మ్యాన్ పేరుతో ఉన్నాయి. 

                            --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com