ప్రజాకవి..శ్రీశ్రీ
- April 30, 2024
ఆ కలం సామాజిక అసమానతలను చీల్చి చండాడే హలం.. ఆయన రాసే ప్రతి పదం సామాన్యులను ఉర్రుతలూగించే జనపదం. ఆయన పాటల్లో సగటు మనిషి ఆవేదన ఉంటుంది. వారి బాధలను పోగోట్టే ఆనందం ఉంటుంది. తెలుగు పాటకు తొలిసారి జాతీయ స్థాయిలో అవార్డు తెచ్చిన మహనీయుడు. తన కలంతో సామాన్య మానవుడి బాధల్ని పాటల్లో వినిపించిన యుగకర్త శ్రీశ్రీ. నేడు శ్రీశ్రీ జయంతి
శ్రీశ్రీ అని పిలవబడే శ్రీరంగం శ్రీనివాసరావు 1910, ఏప్రిల్ 30వ తేదీన విశాఖపట్నంలో జన్మించారు. మద్రాసు యూనివర్సిటీ నుంచి బీఏ పూర్తి చేసిన శ్రీ శ్రీ.. 1935లో విశాఖలోని ఏవీఎస్ కాలేజ్‌లో డిమాన్ట్రేటర్‌గా చేరారు. అనంతరం పాత్రికేయ వృత్తిలో అడుగుపెట్టిన ఆయన ఆంధ్రప్రభ, ఆంధ్రవాణి, ఆకాశవాణిలోనూ పనిచేశారు. ఆ తర్వాత సాహితీ లోకంలో తన ప్రస్థానం మొదలుపెట్టిన శ్రీ శ్రీ ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు.
1933 నుంచి 1940 వరకు తాను రాసిన ‘గర్జించు రష్యా’, ‘జగన్నాథ రథ చక్రాలు’ వంటి గొప్ప కవితలను సంకలనం చేసి ‘మహా ప్రస్థానం’ అనే పుస్తకంగా ప్రచురించాడు శ్రీశ్రీ. తెలుగు సాహిత్యపు దశను, దిశను మార్చిన పుస్తకం గా శ్రీశ్రీ మహాప్రస్థానం మిగిలిపోయింది. మహా ప్రస్థానం అనేది మహా భారతంలోని 17వ పర్వం పేరు పెట్టారు. ఆయనపై మహా భారత, రామాయణల ప్రభావం ఉన్న.. జీవితాంతం కమ్యూనిస్టుగానే బతికారు.
1952 లో ప్రారంభమైన ఆయన సినీ గేయ ప్రస్థానం 1982 వరకు నిరాటంకంగా కొనసాగింది. దాదాపు 50 చిత్రాల వరకు సినీ సాహిత్యాన్ని అందించారు. తన రచనలతో ఎంతో మందిని చైతన్య పరిచిని… ఈ మహా ప్రస్థానా కర్త 1983 జూన్ 15న స్వర్గస్తులైనారు. అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించడంలో శ్రీశ్రీ మేటి. “వ్యక్తికి బహువచనం శక్తి” అనేది ఆయన సృజించిన మహత్తర వాక్యమే. శబ్ద ప్రయోగంలో నవ్యతను చూపించడంలో విజయం సాధించారు శ్రీశ్రీ. శ్రీశ్రీకి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది మాత్రం అల్లూరి సీతారామారాజు చిత్రంలోని 'తెలుగు వీర లేవరా' పాటే. జాతీయ స్థాయి పురస్కారం అందుకున్న తొలు తెలుగు పాట ఇదే.
శ్రీ శ్రీ కవితలు అంత పాపులర్ అవడానిక ప్రధాన కారణం ఆ కవిత్వంలో కనిపించే వాస్తవికతనే. అందుకే శ్రీ శ్రీ అంటుంటాడు.. అందమైన అబద్ధాల్లో కన్నా నిష్టూరమైన నిజాల్లోనే మంచి కవిత్వం దర్శనీయమవుతుందని. అందుకే ఎప్పుడో 85 ఏళ్ల కిందట ఆయన రాసిన 'మనమంతా బానిసలం.. పీనుగులం.. గానుగలం' అనే శ్రమ దోపిడీ నేటి సమాజంలోను స్పష్టంగా కనిపస్తుంది. శైశవ గీతితో పసి హృదయాలను పలకరించాలన్న.. అవతలి గట్టున అలసిన ఓ బాటసారికి బాసటగా నిలవాలన్న ఒక్క శ్రీరంగం శ్రీనివాసరావుకే అది సాధ్యం.
సమరానికి నేడే ఆరంభం…ఎవరో వస్తారని ఏదో చేస్తారని అంటూ సందేశాత్మక గీతాలు నేటికి తెలుగు నేలపై ఏదో సందర్భంలో గుర్తించుకోని తెలుగు వారుండరు. మనసున మనసై బ్రతుకున బ్రతుకై అంటూ మదిలోని భావాలను మనుసుతో ముడిపడిన బ్రతుకును ఆవిష్కరించిన అద్భుత కవి శ్రీశ్రీ.‘ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా! అంటూ సోమరి పోతులను జాగృతం చేసిన చైతన్య శీలి శ్రీశ్రీ.
వివిధ దేశాల్లో శ్రీశ్రీ పర్యటించాడు. ఎన్నో పురస్కారాలు పొందాడు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మొదటి "రాజా లక్ష్మీ ఫౌండేషను" అవార్డు వీటిలో కొన్ని. అభ్యుదయ రచయితల సంఘానికి (అరసం) అధ్యక్షుడిగా పనిచేసాడు. 1970లో అతని షష్టిపూర్తి ఉత్సవం విశాఖపట్నంలో జరిగింది. ఆ సందర్భంగానే అతను అధ్యక్షుడుగా విప్లవ రచయితల సంఘం (విరసం) ఏర్పడింది. అయితే, క్యాన్సరు వ్యాధి కారణంగా 1983 జూన్ 15న శ్రీశ్రీ మరణించాడు.
విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచనల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా, హేతువాదిగా, నాస్తికుడిగా తెలుగు ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి శ్రీశ్రీ. ఆయన మన మధ్య లేక పోయిన ఆయన అందించిన సాహితి సౌరభాలు…విప్లవ రచనలు ఇప్పటికీ.. ఎప్పటికీ ..సజీవంగానే ఉంటాయి.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







