టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ

- May 02, 2024 , by Maagulf
టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనర్, , ఉన్నతాధికారులతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని బస్ భవన్ లో గురువారం ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీఎస్ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం, టెక్నికల్ సపోర్ట్, అప్ గ్రేడింగ్ స్కిల్స్, ట్రైనింగ్ పై ప్రధానంగా చర్చించారు.

మొదటగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ బస్సులు, భవిష్యత్ లో వాడకంలోకి వచ్చే ఎలక్ట్రిక్ బస్సుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆర్టీసీ ఉన్నతాధికారులు వివరించారు. పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సులను వినియోగిస్తున్నందుకు టీఎస్ఆర్టీసీకి గారెత్ విన్ ఓవెన్ అభినందనలు తెలియజేశారు.

జీరో ఎమిషన్ వెహికిల్(జెడ్ఈవీ) పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆర్టీసీ అధికారులతో సమావేశమయ్యామని చెప్పారు. గత ఏడాది గోవాలో జరిగిన జీ-20 సమావేశాల్లో యూకే, యుఎస్, భారత దేశంతో కుదిరిన ఒప్పదం మేరకు జెడ్ఈవీల ఫైనాన్సింగ్ మెకానిజం బలోపేతం చేస్తున్నామని వివరించారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణపై ఆర్టీసీ సిబ్బందికి వర్క్ షాప్ లు నిర్వహించి సాధికారికత కల్పిస్తామని వివరించారు.

కాలుష్యరహిత ప్రయాణ అనుభూతిని అందించేందుకు టీఎస్ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అన్నారు. సంస్థలో ఎలక్ట్రిక్ బస్సుల వ్యవస్థను మరింతగా విస్తృత పరిచేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు.        

ఈ సమావేశంలో బ్రిటిష్ హైకమిషనర్ సీనియర్ అడ్వైజర్ జావైద్ మల్లా, తెలంగాణ ప్రభుత్వ ఆటోమోటివ్ అండ్ ఈవీ సెక్టార్ డైరెక్టర్ గోపాల కృష్ణ, టీఎస్ఆర్టీసీ సీవోవో డాక్టర్ రవిందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వ రావు, ఐపీఎస్, డబ్ల్యూఆర్ఐ ఇండియా ప్రతినిధి చైతన్య కనూరి, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా డేవిస్ నుంచి అనన్య బెనర్జీ, తదితరులు పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com