టాలీవుడ్ గాడ్ ఫాదర్...

- May 04, 2024 , by Maagulf
టాలీవుడ్ గాడ్ ఫాదర్...

దాసరి నారాయణరావు...భారత చలన చిత్ర పరిశ్రమలో ఈ పేరు తెలియని వారుండరు. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, రచయితగా, పత్రికా సంపాదకుడిగా, కేంద్ర మంత్రిగా అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసిన వ్యక్తి దాసరి. తెలుగు తెరపై హీరోలు రాజ్యమేలుతున్న దశలో దర్శకుడికి స్టార్ స్టేటస్ తెచ్చిన అరుదైన ఘనత ఆయన సొంతం. ఒకటి రెండు సినిమాలు తీయడానికి అపసోపాలు పడుతున్న నేటి రోజుల్లో.. ఏకంగా 150కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించి ‘‘లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌’’లో స్థానం సంపాదించారు. నేడు దర్శకరత్న దాసరి నారాయణరావు గారి పుట్టినరోజు.

దాసరి నారాయణరావు 1942 మే 4న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. హై స్కూల్ రోజుల్లో నాట‌కాలు రాసేవారు. చ‌దువంటే దాస‌రికి ప్రాణం. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చిన్న చిన్న ప‌నులు చేస్తూ వ‌చ్చిన డ‌బ్బుల‌తో చ‌దువుకునేవారు. డిగ్రీ పూర్త‌య్యాక చ‌దువును కొన‌సాగిస్తూ ... నాట‌క రంగం మీదున్న ఆసక్తితో నాటకాలు వేసేవారు. ఆ తర్వాాత  హైదరాబాద్ హెచ్.ఏ.ఎల్. సంస్థ పెట్టిన పరీక్షలో పాసై ఉద్యోగం సంపాదించారు.

హైద‌రాబాద్‌లో ఉద్యోగం చేస్తూ  రవీంద్రభారతిలో నాటకాల వేసేవారు దాసరి. అయితే సినిమాల  మీద ఇష్టంతోనే, ఉద్యోగానికి రాజీనామా చేసి మద్రాసు వెళ్ళారు. పాలగుమ్మి పద్మరాజు పరిచయంతో మద్రాస్ చేరి పరిశ్రమలో రచయితగా అడుగుపెట్టారు. మద్రాస్‌‌లో ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు దగ్గర శిష్యరికం చేసిన దాసరి తన తరం దర్శకుల కంటే భిన్నంగా సినిమాలు తీశారు. సామాజిక అంశాలనే తన కథకు ఇతివృత్తాలుగా చేసుకున్నారు.

దాస‌రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మొద‌టి సినిమా తాతా మ‌న‌వడు. మొద‌టి  సినిమాతోనే ఆయనకు మంచి హిట్ ల‌భించింది. ఇక న‌ట‌న‌లో కూడా ముందు అడుగులే త‌ప్ప వెనుక‌డుగు వేయ‌లేదు. దాస‌రి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బలిపీఠం, గోరింటాకు, కటకటాల రుద్రయ్య, ప్రేమాభిషేకం, మనుషులంతా ఒక్కటే, సర్కస్ రాముడు, సర్దార్ పాపారాయుడు, విశ్వరూపం, బొబ్బిలిపులి వంటి సినిమాలు సిల్వర్ జూబ్లీలు పూర్తి చేసుకున్నాయి.

శివరంజని, ఒసేయ్ రాములమ్మ,  చిల్లరకొట్టు చిట్టెమ్మ వంటి సినిమాల ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు మంచి మార్కెట్ సృష్టించారు దాసరి. ఏ సబ్జెక్టు మీదనైనా విశేష పరిశోధన చేసి, సినిమాలు తీయడం దాసరి ప్రత్యేకత. విప్లవ పంథాలో ఆలోచించి ఒరేయ్ రిక్షా , సమ్మక్క సారక్క, అడవిచుక్క సినిమాలు తీసిన దాసరి.. మేఘ సందేశం లాంటి సంగీత ప్రధాన చిత్రాలు... ‘తాండ్రపాపా రాయుడు’ లాంటి పీరియాడిక్ డ్రామా, ‘ఎంఎల్ఎ ఏడుకొండలు’ లాంటి సెటైరికల్ మూవీ ఒకటా రెండా ప్రతి జానర్ లోనూ తనదైన ముద్రవేశారు.

దర్శకుడిగానే కాకుండా నటుడిగా సైతం దాసరి రాణించారు. మామగారు, సూరిగాడు, కంటే కూతుర్నే కను.. లాంటి సినిమాలు దాసరిలోని నటనా కోణాన్ని, సరికొత్తగా ప్రేక్షకులకు పరిచయం చేశాయి.  స్వర్గ్ నరక్, జక్మే షేర్, ప్రేమ్ తపస్య, సర్ఫారోష్, ఆజ్ కా ఎమ్మెల్యే, రామ్ అవతార్, ప్యాసా సావన్, యాద్ గార్, వఫాదార్ లాంటి హిందీ సినిమాలు దాసరికి జాతీయ స్థాయిలో కూడా పేరు, ప్రఖ్యాతులు తీసుకొచ్చాయి.

తెలుగు, హిందీ భాషల్లో 151 సినిమాలకు దర్శకత్వం వహించడం ద్వారా దాసరి ‘లిమ్కా బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు’లోకి ఎక్కారు. 53 సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. మాటల రచయితగా, పాటల రచయితగానూ మెప్పించారు. మేఘ సందేశం, కంటే కూతుర్నే కనాలి లాంటి చిత్రాల ద్వారా అంతర్జాతీయ గుర్తింపు అందుకున్నారు. మేఘ సందేశం చిత్రాన్ని కాన్స్, షికాగో, మాస్కో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు.

దర్శకరత్న అందుకున్న అవార్డులకు లెక్కే లేదు.తన కెరీర్‌లో రెండు జాతీయ అవార్డులు, నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, 16 నంది అవార్డులను దక్కించుకోవడం దర్శకుడు దాసరికే చెల్లింది. ఇవే కాకుండా .. మరెన్నో అవార్డులు అందుకున్నారు దాసరి.

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన దాసరి పత్రికారంగంలో కూడా అడుగుపెట్టారు. ‘ఉదయం’ పత్రికను స్థాపించి జర్నలిజానికి కొత్త భాష్యం చెప్పారు. పరిశోధనాత్మక జర్నలిజానికి ఓ దశను, ఓ దిశను చూపించింది ఆ పత్రిక. ఉదయంలో ఓ వార్త వస్తే ఓ సంచలనం అయ్యేది. బడుగు, బలహీన మరియు అణగారిన వర్గాలకు గొంతుకగా మారింది. ఆ తర్వాత రాజకీయ రంగంలోకి ప్రవేశించి కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రిగా పని చేశారు.

దాసరి సామాజిక సేవలోను ముందున్నారు. పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ప్రవేశపెట్టి ఇందుకోసం ఆంధ్రా, ఉస్మానియా, వెంకటేశ్వర, చెన్నై, కేరళ వర్శిటీలకు భూరి విరాళాలు ఇచ్చారు. 1980లో మహిళల కోసం పాలకొల్లులో దాసరి నారాయణరావు మహిళా కళాశాలను స్థాపించారు. 1985లో తుపాను బాధితుల సహాయార్ధం రూ.30 లక్షలు సేకరించి అందించారు. 1986లోనూ రూ.35 లక్షలు విరాళంగా సేకరించి కరవు నివారణ నిధికి అందించారు. 1990లో స్టార్ నైట్ నిర్వహించి తద్వారా సేకరించిన కోటి రూపాయలను ప్రభుత్వానికి అందించారు. 1998లో సైక్లోన్ రిలీఫ్ ఫండ్ కోసం దక్షిణ-ఉత్తర భారత సినీ నటులతో క్రికెట్ మ్యాచ్ నిర్వహించి మూడు కోట్ల రూపాయలు సేకరించారు. 1999లో స్ట్రీట్ ర్యాలీలు, వినోద కార్యక్రమాలు నిర్వహించి కార్గిల్ యుద్ధవీరుల నిధికి పెద్దమొత్తాన్ని అందించారు.

చిత్ర పరిశ్రమలో ఎవరికి ఏ ఆపద వచ్చినా అందరి చూపు దాసరి వైపే. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల తర్వాత పెద్ద దిక్కుగా మారారు. క‌ష్టాలొస్తే సినీ కార్మికులకు ఆయన అండ‌గా నిలిచేవారు. సినిమా స‌మ‌స్య‌లైనా, జీవిత స‌మ‌స్య‌లైనా తానే పెద్ద దిక్కుగా ఉండి ఆదుకునేవారు. న‌ట‌నే జీవితం అనుకున్నవారి క‌ష్టాలను తీర్చిన మ‌హోన్న‌త వ్య‌క్తి దాస‌రి నారాయ‌ణ రావు.

తన సినిమాల ద్వారా తెలుగు చిత్ర రంగంలో ఓ కొత్త అధ్యాయాన్ని లిఖించిన దాసరి అనేక ఉత్థాన పతనాలను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ తనదైన శైలిని, సామాజిక సమస్యలపై పోరాటాన్ని ఆపలేదు. ప్రతిభావంతులైన ఎంతో మంది నటీనటులను, సాంకేతిక నిపుణులను దాసరి నారాయణరావు టాలీవుడ్‌కు అందించారు. మాన‌వ‌త్వం ఉన్న వ్య‌క్తిగా దాస‌రి చ‌నిపోయినా కూడా.. క‌ళామత‌ల్లి బిడ్డ‌ల హృద‌యాల‌లో స‌జీవంగానే ఉన్నారు. దాస‌రి త‌మ గురువు గారంటూ, ఇప్పటికీ న‌టీనటులందరూ తలుచుకుంటూనే ఉంటారు.  

                  --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com