హైబ్రిడ్ పిల్ల
- May 09, 2024సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన పేరు సాయి పల్లవి. చేసింది తక్కువ సినిమాలే అయినా తనదైన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సెలెక్టెడ్‌గా సినిమాలు ఎంచుకుంటూ హిట్ చిత్రాలతో దూసుకెళుతోంది. పురివిప్పిన నెమలి నాట్యం చేస్తున్నట్లుగా తన నృత్యంతోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది హీరోయిన్ సాయి పల్లవి. నేడు సాయి పల్లవి పుట్టినరోజు.
సాయి పల్లవి అలియాస్ సాయి పల్లవి శాంతామరై 1992 మే 9న తమిళనాడులోని నీలగిరి జిల్లా కోటగిరిలో సెంతమరై కన్నన్, రాధ దంపతులకు జన్మించింది.జార్జియాలోని టిబిలిసి మెడికల్ యూనివర్సిటీలో డాక్టర్ కోర్సు పూర్తిచేసింది. పల్లవికి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం. ఎక్కడా శిక్షణ తీసుకోకుండానే తనకు నచ్చిన మ్యూజిక్ వింటూ అందుకు అనుగుణంగా కాళ్లు కదిపేది.. ఆ బాణీలకు తనదైన స్టైల్లో స్టెప్పులేసేది.
డ్యాన్స్ మీదున్న మక్కువతో 2008లో విజయ్ టీవీలో వచ్చిన 'ఉంగలిల్ యార్ ఆడుతా ప్రభుదేవా' డ్యాన్స్ రియాలీటీ షోతో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఏడాది తెలుగు డ్యాన్స్ రియాలిటీ షో 'ఢీ 4'లో పార్టిసిపేట్ చేశారు. ఆ షో ద్వారానే ఆమె మొదటిసారి తెలుగు ప్రజలకు పరిచయమయ్యింది.
సాయి పల్లవి యాక్టర్ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. అయితే తమిళ డ్యాన్స్ రియాలిటీ షోలో పల్లవికి వచ్చిన క్రేజ్ వల్ల 2008లో జయం రవి హీరోగా తెరకెక్కిన ధామ్ ధామ్ సినిమాలో అవకాశం వచ్చింది. అయితే, ఆమె డ్యాన్స్ షోలను చూసిన మలయాళ యువ దర్శకుడు అల్ఫోన్స్ పుత్రేన్ తన రాబోయే సినిమాలో హీరోయిన్ రోల్ ఆఫర్ చేయడమే కాకుండా మెడిసిన్ చదువుతూనే సెలవుల్లో వచ్చి నటించి వెళ్లు చాలు అని ఆఫర్ ఇవ్వడంతో ఆ సినిమాను అంగీకరించింది.
అలా పల్లవి సెలవుల్లో నటించిన చిత్రమే 'ప్రేమమ్'. మలయాళంలోనే కాదు... సౌత్ సినిమాల్లో 'ప్రేమమ్' ఎంత సెన్సేషన్ గా నిలిచిందో అందరికీ తెలుసు. మలర్ టీచర్ పాత్రలో సాయి పల్లవి అభినయం ఇప్పటికి చాలా మందికి ఫేవరేట్.ఆ తర్వాత టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీలో భానుమతి పాత్రలో ఒదిగిపోయింది పల్లవి.. ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మొదటి సినిమాతోనే వేలాది మంది అభిమానులను సొంతం చేసుకుంది.
ఫిదా సినిమా తర్వాత.. సాయి పల్లవి నాని సరసన మిడిల్ క్లాస్ అబ్బాయి, కణం, పడి పడి లేచె మనసు, మారి 2 వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటీవల శేఖర్ కమ్ముల , నాగ చైతన్య కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ లవ్ స్టోరీ చిత్రంలో నటించింది. అలాగే న్యాచురల్ స్టార్ హీరో నాని నటించి శ్యామ్ సింగరాయ్ సినిమాలో దేవదాసి పాత్రలో కనిపించి మెప్పించింది. ఆ తరవాత నటించిన పలు చిత్రాల్లో సైతం జయాపజయాలకు అతీతంగా తన పాత్రలకు న్యాయం చేసింది. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య సరసన తండేల్ చిత్రంలో నటిస్తుంది.
సాయి పల్లవిని మెప్పించడం అంత సులభం కాదు! క్యారెక్టర్స్, ఫిల్మ్స్ ఎంపికలో ఆమె చాలా సెలక్టివ్. ఆచి తూచి పాత్రలను ఎంపిక చేసుకుంటుంది. స్కిన్ షో ఆమెకు అసలు నచ్చని వ్యవహారం. అందుకే చాలా పెద్ద సినిమాలను కూడా రిజెక్ట్ చేసింది. రీమేక్స్ కూడా ఆమెకు ఇష్టం లేదు. అందుకే, 'ప్రేమమ్'ను తెలుగులో రీమేక్ చేసినప్పుడు అడిగితే... 'నో' చెప్పింది. రోల్స్ అండ్ స్క్రిప్ట్ విషయంలో అంత పక్కాగా ఉంటుంది కాబట్టే సాయి పల్లవి కంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.
పాత్రల పరంగానే కాదు... డ్యాన్స్ పరంగానూ సాయి పల్లవి తనదైన ముద్ర వేసింది. అవలీలగా స్టెప్పులు వేయటం ఆమెకు అడ్వాంటేజ్. 'రౌడీ బేబీ' సాంగ్ దగ్గర నుంచి 'వచ్చిండే', 'సారంగ దరియా', 'ప్రణవాలయ'... ఏ పాట తీసుకున్నా యూట్యూబ్ లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. ఆమె డ్యాన్స్ లో ఉన్న గ్రేస్ ఆ పాటలను చార్ట్ బస్టర్స్ గా నిలిపాయి.
సినిమాల విషయంలో సాయి పల్లవిఎంత క్రమశిక్షణగా ఉంటారో... నిజ జీవితంలో అలాగే ఉంటారు. చాలా సున్నిత మనస్కురాలు. ఎక్కువ ఎమోషనల్ అవుతుంది. ఆమెలో ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. సాయిబాబాకు పెద్ద భక్తురాలు. సినిమా చిత్రీకరణలో లేకపోతే... ఇంటికే పరిమితం. అంతేకాదు.. ఫెయిర్‌నెస్ క్రీమ్ ప్రచారాన్ని చేయడానికి ఆమెకు రూ.2 కోట్ల ఆఫర్ వచ్చింది. అయితే తనకు అసత్య ప్రచారాలను చేయడం ఇష్టం లేదని కోట్ల ఆఫర్‌ను రిజెక్ట్ చేసింది.
సినిమాల్లో గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ.. సహజమైన నటనతో.. అచ్చమైన తెలుగింటి ఆడపిల్లగా తెలుగు ప్రేక్షకుల మనసులలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ న్యాచురల్ బ్యూటీ. తెరపై అందంగా కనిపించాలంటే మేకప్ మాత్రమే ముఖ్యం కాదని.. సహజంగా కనిపిస్తూనే తన నటనతో వేలాది మంది అభిమానులను సొంతం చేసుకొని అగ్రకథానాయికగా దూసుకుపోతుంది.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- UPI చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఆమోదం..!!
- ఇండియాలో ‘ఎమ్మార్’ విక్రయం..అదానీ సహా పలు గ్రూపులతో చర్చలు..!!
- 41వేల నకిలీ పెర్ఫ్యూమ్ బాటిల్స్ స్వాధీనం..!!
- కువైట్ మాజీ అధికారులకు $88 మిలియన్ల జరిమానా..!!
- దుబాయ్, అబుదాబిలో నైట్ వర్క్ పర్మిట్ ఎలా పొందాలి?
- మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. పెట్టుబడి అవకాశాలు..!!
- పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ దంపతులకు బిగ్‌షాక్..
- ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
- రూ.200 నోట్ల బ్యాన్ ? ఆర్బీఐ కీలక ప్రకటన
- ఖేల్‌రత్న పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము