ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు

- May 13, 2024 , by Maagulf
ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు

ముంబై: దేశీయ ఆర్థిక రాజధాని ముంబైలోని పలు ప్రాంతాల్లో సోమవారం (మే 13న) అత్యంత బలమైన ఈదురుగాలులతో భారీ వర్షం అల్లకల్లోలం సృష్టించింది. నగరంలోని ఘట్కోపర్ ప్రాంతంలో పెట్రోల్ పంపుపై భారీ బిల్ బోర్డు పడిపోయింది. ఈ ఘటనలో కనీసం 8 మంది మృతి చెందగా, 60 మంది గాయపడ్డారు. పంత్‌నగర్‌లోని ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే వెంబడి పోలీస్ గ్రౌండ్ పెట్రోల్ పంపు వద్ద ఈ ఘటన జరిగింది. అనేక కార్లు బిల్‌బోర్డ్ కింద చిక్కుకున్నట్లు వీడియోల్లో కనిపించింది.

రంగంలోకి దిగిన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందం రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తోందని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భూషణ్ గగ్రానీ (BMC) మీడియాకు తెలిపారు. గాయపడిన బాధితులను సివిక్-రన్ రాజావాడి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు అధికారి పేర్కొన్నారు.

ఈ ఘటనపై స్పందించిన బీఎంసీ ఆ స్థలంలో హోర్డింగ్‌ను ఏర్పాటు చేసిన ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది. బీఎంసీ గరిష్టంగా 40×40 చదరపు అడుగుల హోల్డింగ్ పరిమాణాన్ని అనుమతిస్తుంది. అయితే, కుప్పకూలిన అక్రమ హోర్డింగ్ (120×120) చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.

ప్రతికూల వాతావరణం, ధూళి తుఫాను కారణంగా, ముంబై విమానాశ్రయం దాదాపు ఒక గంట పాటు విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీని ఫలితంగా కనీసం 15 విమానాలను మరో మార్గానికి మళ్లించారు. భారత వాతావరణ శాఖ ప్రకారం.. రాబోయే నాలుగు గంటల్లో కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

వడాలాలోని థానే-బేలాపూర్ రోడ్డులో తుఫాను కారణంగా ఒక పరంజా రోడ్డుపై పడింది. జోగేశ్వరిలో ఈదురుగాలులకు చెట్టు విరిగి ఆటోరిక్షాపై పడింది. డ్రైవర్ హయత్ ఖాన్‌కు గాయాలు కాగా స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.

గోరేగావ్‌తో సహా ముంబైలోని కొన్ని ప్రాంతాల్లోని ధూళి తుఫానుకు సంబంధించి వీడియోలు బయటకు వచ్చాయి. బలమైన గాలుల కారణంగా బ్యానర్ వైర్‌పై ల్యాండ్ కావడంతో ఆరే, అంధేరీ ఈస్ట్ మెట్రో స్టేషన్‌ల మధ్య మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి.

బలమైన గాలుల కారణంగా థానే, ములుంద్ స్టేషన్‌ల మధ్య ఉన్న ఓవర్‌హెడ్ స్తంభం వంగిపోవడంతో సెంట్రల్ రైల్వేలోని సబర్బన్ సర్వీసులు నిలిచిపోయాయి. మెయిన్ లైన్‌లోని సబర్బన్ సర్వీసులను నిలిపివేసినట్లు సెంట్రల్ రైల్వే ప్రధాన ప్రతినిధి తెలిపారు. థానే జిల్లాలోని కాల్వాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com