పాటల పూదోట... సుద్దాల
- May 16, 2024
తన పాటలతో నైజాం పాలకులను ఉలికిపడేలా చేసిన ప్రజా కవి సుద్దాల హనుమంతు. తెలంగాణ సాయుధ పోరాటంలో సుద్దాల హనుమంతు పాట సామాన్య ప్రజల హృదయాలను తట్టిలేపింది. ‘నీ బాంచన్ కాల్మొక్తా’ అనే బానిస బతుకుల చెరవిడిపించడంలోనూ సుద్దాల పాట ఈటెగా మారింది. హనుమంతు బాటలోనే తండ్రికి తగ్గ తనయుడిగా పాటతో సాగుతున్నాడు ఆయన కుమారుడు సుద్దాల అశోక్ తేజ. నేడు పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ పుట్టినరోజు.
సుద్దాల అశోక్ తేజ 1960 మే 16న తెలంగాణలోని గుండాల మండలం, సుద్దాల గ్రామంలో జన్మించారు. తండ్రి హనుమంతు పాటతోనే అశోక్ తేజ బతుకు బాట కూడా సాగింది. చదువుతో పాటు లోకాన్నీ చదవగలిగే శక్తి తండ్రివల్లే లభించింది అంటారుసుద్దాల. బడిపంతులుగా పిల్లలకు పాఠాలు చెబుతూనే, తన మనోభావాలను పాటల రూపంలో పదిలపరచుకొనేవారు అశోక్ తేజ. ఆయన అక్క కుమారుడు ఉత్తేజ్ సహాయ నటునిగా చిత్రసీమలో కొనసాగుతూ ఉన్నారు.
ఉత్తేజ్ తన మేనమామను కొందరు సినీ దర్శకులకు పరిచయం చేశారు. తొలుత కె.రంగారావు ‘నమస్తే అన్న’ సినిమాలో “నైజామ్ పోరి…” అని సాగే పాట రాశారు సుద్దాల. తరువాత దర్శకుడు కృష్ణవంశీకి పరిచయం అయ్యారు. సుద్దాలలోని కవిత్వం కృష్ణవంశీకి భలేగా నచ్చేసింది. తన రెండో సినిమా ‘నిన్నే పెళ్ళాడతా’లో తొలిసారి అశోక్ తేజతో పాట రాయించుకున్నారు కృష్ణవంశీ. ఆ తరువాత నుంచీ సుద్దాలను కృష్ణవంశీ ప్రోత్సహిస్తూ వచ్చారు.
దాసరి నారాయణరావు కూడా తన సినిమాలలో సుద్దాల పాటకు చోటు కల్పిస్తూ సాగారు. వీరి ప్రోత్సాహంతో తనదైన బాణీ పలికించారు. అశోక్ తేజ సాహిత్యంలోని గుబాళింపు పలువురిని ఆకట్టుకుంది. అలా అందరి ప్రోత్సాహంతో సుద్దాల పాట చిత్రసీమలో చిందులు వేసింది. శ్రీశ్రీ, వేటూరి తరువాత జాతీయ స్థాయిలో ఉత్తమ గేయరచయితగా నిలచిన తెలుగువారు సుద్దాల అశోక్ తేజ. ‘ఠాగూర్’లో ఆయన రాసిన “నేను సైతం…” పాట ఆయనను జాతీయ స్థాయిలో ఉత్తమ గీతరచయితగా నిలిపింది.
అశోక్ తేజ పాటల్లో సహజత్వం తొణికిసలాడుతూ ఉంటుంది. అదే పనిగా కవిత్వం పలికించినట్టు అనిపించదు. అలతి అలతి పదాలతోనే మనసులను తాకే రచన సాగించడం సుద్దాల అశోక్ తేజ బాణీ అని చెప్పవచ్చు. ఆయన రాసిన అనేక గీతాలు తెలుగు వారిని విశేషంగా అలరించాయి. ఈ మధ్య కాలంలో ‘ఫిదా’లో ఆయన రాసిన “వచ్చిండే… పిల్లా మెల్లగా వచ్చిండే…” పాట విశేషాదరణ చూరగొంది. రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్.’లోనూ ఆయన రెండు పాటలు పలికించారు. కథలో ఎంతో కీలకమైన ఆ రెండు పాటల్లోనూ సుద్దాల తనదైన ముద్ర వేశారు. ఆరంభంలో వినిపించే “కొమ్మా ఉయ్యాల…”, సినిమాలోని అన్ని పాటల్లోకీ తలమానికంగా నిలచిన “కొమురం భీముడో…” పాటనూ సుద్దాల కలమే అందించింది.
శ్రీశ్రీ, వేటూరి తర్వాత జాతీయ అవార్డు అందుకున్న తెలుగు గీత రచయిత సుద్దాల అశోక్ తేజ.చిత్రసీమలో తనదైన పంథాలో పయనిస్తూ పదనిసలకు తగ్గ పదాలను, సరిగమలకు సరితూగే సమాసాలను పొందుపరుస్తూ సాగుతున్నారు. మూడు దశాబ్దాల సినీ జీవితంలో ఆయన ఎన్నో అద్భుతమైన, అందమైన పాటలకు ప్రాణం పోశారు సుద్దాల. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడమే తెలిసిన సుద్దాల అశోక్ తేజ, ఇప్పటికీ తన చెంతకు చేరిన అవకాశానికి తగ్గ పదాలను అందించాలనే తపిస్తూ ఉంటారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!