గురూజీ గోళ్వల్కర్‌...!

- June 05, 2024 , by Maagulf
గురూజీ గోళ్వల్కర్‌...!

భారతదేశ రాజకీయాలను 3 దశాబ్దాలు ప్రభావితం చేసిన వ్యక్తి అతను. ఎటువంటి ఉన్నతమైన పదవులు చేపట్టకుండానే, భారత రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు. జాతీయ సమైక్యత కోసం అహర్నిశలు శ్రమించి , భారత జాతీయత, సంస్కృతి-పరంపరలు ఆధారంగా భారత జాతిలో నవచైతన్యాన్ని నింపడమే కాకుండా, జాతికి యోగ్యమైన దిశను చూపి నడిపించిన యోధుడు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘచాలక్‌గా గురూజీ గోళ్వల్కర్‌. నేడు గోళ్వల్కర్‌ వర్థంతి.

గురూజీగా ప్రసిద్ధిపొందిన మాధవరావు సదాశివరావు గోళ్వల్కర్‌ 1906, ఫిబ్రవరి 16వ తేదీన నాగ్‌పూర్‌ సమీపానగల రాంటెక్ పట్టణంలో సదాశివరావు, లక్ష్మీబాయి దంపతులకు జన్మించారు. చిన్నతనం నుంచి ఎంతో తెలివైన విద్యార్థి కావడంతో చదువుల్లో బాగా రాణించారు. జంతుశాస్త్రంలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాశీలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో పూర్తి చేసారు.

అనంతరం, బెనారస్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా కొంత కాలం పనిచేశారు. అధ్యాపకుడిగా విద్యార్థుల్లో ఆయనకు మంచి పేరు ఉండేది. విద్యార్థులు ఆయన్ని "గురూజీ" గౌరవంగా సంభోదించేవారు. విద్యాలయంలో పనిచేస్తున్న సమయంలోనే ఆయన అక్కడ అనేక విషయాలు అధ్యయనం చేశారు. దేశంలో జరుగుతున్న ఉద్యమాలు, సామాజిక మార్పుకై జరుగుతున్న ప్రయత్నాలు, పెరుగుతున్న ఇస్లాం దాడులు అన్ని విషయాలపై అధ్యయనం సాగేది. 1930 సంవత్సరంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్జీగా ప్రసిద్ధుడైన కేశవ్ బలీరాం హెడ్గేవార్ ను కలవడం జరిగింది. వారిద్దరి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి.

గురూజీ మీద డాక్టర్జీకి మంచి గురి కుదరటంతో  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లోని ఆహ్వానించడం, కొన్ని కారణాల రీత్యా ఆయన చేరలేదు. నాగ్‌పూర్‌ తిరిగొచ్చి న్యాయశాస్త్ర పట్టభద్రులయ్యారు. అయితే, నాగ్‌పూర్‌ పట్టణంలోని రామకృష్ణ మిషన్ ఆశ్రమంతో ఏర్పడ్డ సన్నిహిత సంబంధాలు ఆయన్ని సన్యాసం తీసుకోవడానికి ప్రేరేపించాయి. సంవత్సరం పాటు ముర్షిదాబాద్‌ జిల్లాలోని సారగాచి ఆశ్రమంలోని స్వామి అఖండానంద శిష్యరికంలో గడిపారు. అఖండానంద ఆదేశాల మేరకు తిరిగి నాగ్‌పూర్‌ చేరుకున్నారు.

1937లో డాక్టర్జీ కోరిక మేరకు సంఘంలో చేరారు. డాక్టర్జీ ఆధ్వర్యంలో గురూజీ సంఘం కోసం పనిచేస్తూ స్వయంసేవక్ శిక్షణ తరగతులు నిర్వహించారు. డాక్టర్జీ ఆకస్మిక మరణం కారణంగా ఆయన వారసుడిగా 1940లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘచాలక్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1940-73 వరకు 33 సంవత్సరాలు సంఘాన్ని నడిపిస్తూ సంఘ కార్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళారు.

దేశవ్యాప్తంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) విస్తరించేందుకు గురూజీ కీలకమైన పాత్ర పోషించారు. ఆర్ఎస్ఎస్ ద్వారా భారతదేశ రాజకీయాల్లో సైతం కీలకంగా వ్యవహరించారు.1948లో గాంధీజీ హత్యతో ప్రేమయం ఉందనే నెపంతో గురూజీని అరెస్ట్ చేయడంతో మొదలైన ఆయన రాజకీయ జీవితం, బిజెపి పూర్వ రూపమైన భారతీయ జనసంఘ్ పార్టీని ఏర్పాటు చేయడంతో పాటుగా తన వ్యూహాలతో విపక్ష పార్టీలతో కలిసి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడం జరిగింది. దేశంలో కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేసిన తోలి తరం రాజకీయ నాయకుల్లో వీరు ఒకరు.

దేశ సమైక్యత కోసం అందరు కలిసి కృషి చేయాలని గురూజీ ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచేవారు. అస్పృశ్యత, అంటరానితనం అనేవి.. సవర్ణులుగా పిలువబడే హిందువులలో మేము పెద్ద కులంలో జన్మించామనే అహంకార భావన.. వీటిని పెద్దరాయిని క్రేన్‌తో తొలగించినట్లుగా సులభంగా తొలగించలేము. కావలసింది మానసిక పరివర్తన. ఆచార్యులైతే నూతన స్మృతినిచ్చారు. కాని ఈ సందేశం లక్షలాది గ్రామాలకు, నగరాలకు, ప్రతి ఇంటికీ, ప్రతి గుడిసెకూ, ప్రతి గుండెకు అందజేయవలసిన బాధ్యత కార్యకర్తలది అని వివరించారు.

భారతీయ సాంస్కృతిక జీవనానికి వ్యతిరేకమైన విదేశీ సిద్ధాంతాలు, జాతీయ భావనలు వ్యతిరేకిస్తూ, స్వైర విహారం చేస్తున్న సమయములో ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మలచిన మహనీయుడైన గురూజీ 1973, జూన్ 4వ తేదీన తుది శ్వాస విడిచారు. 

  --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com