విధేయతకు పెద్ద పీట...!

- June 12, 2024 , by Maagulf
విధేయతకు పెద్ద పీట...!

తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్‌లో చోటు ఎవరు దక్కించుకుంటారన్న ఉత్కంఠకు తెరపడింది. ప్రస్తుత కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్ రెడ్డి మోడీ 3.0 కేబినెట్‌లో స్థానం దక్కించుకున్నారు. సాధారణ కార్యకర్తగా బీజేపీ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర మంత్రిగా ఎన్నికయ్యారు.

గంగాపురం కిషన్ రెడ్డి 1960,  జూన్‌ 15న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో స్వామిరెడ్డి, ఆండాలమ్మ దంపతులకు జన్మించారు.టూల్ డిజైనింగ్‌లో డిప్లోమా చేసిన కిషన్ రెడ్డి చిన్నతనంలోనే రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1977లో జయప్రకాశ్‌నారాయణ్‌ స్ఫూర్తితో జనతాపార్టీలో చేరారు. 

1980లో బీజేపీలో సాధారణ కార్యకర్తగా చేరి 1980-81లో రంగారెడ్డి జిల్లా బీజేవైఎం కన్వీనర్‌గా పనిచేశారు. 2002-2004 లో బీజేవైఎం జాతీయ అధ్యక్షుడయ్యారు. బీజేవైఎం అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే వరల్డ్ యూత్ కౌన్సిల్ ఎగైనెస్ట్ టెర్రరిజం (డబ్ల్యూవైసీఏటీ)ను కిషన్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదంపై పోరాటం చేస్తుంది. డబ్ల్యూవైసీఏటీ తరఫున వరల్డ్ యూత్ కన్వెన్షన్‌ను న్యూ ఢిల్లీలో నిర్వహించారు.

కిషన్‌రెడ్డి 2010-14 వరకు ఉమ్మడి ఏపీలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా, 2014-16 వరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2023లో మరోసారి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికై తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని నడిపించారు.

2004లో హిమాయత్‌నగర్‌ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009, 2014లో అంబర్‌పేట నుంచి గెలిచారు.  2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నుంచే పోటీ చేసి ఓడిపోయారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. 2021 జూలై వరకు కేంద్రహోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డిని 2021 జూలైలో కేంద్ర పర్యాటక మంత్రిగా నియమించారు. 2024లో సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండో సారి ఎంపీగా ఎన్నికైన తర్వాత మోడీ 3.0 కేబినెట్‌లో కేంద్ర  బొగ్గు, గనుల శాఖ మంత్రిగా నియమితులయ్యారు.

పార్టీ పట్ల విధేయత, వివాదరహితుడు, క్రమశిక్షణ కలిగిన నేత అన్న ముద్రతో పాటుగా ప్రధాని మోడీ ఆశీస్సులు ఉంటడం మూలాన కిషన్‌ రెడ్డికి కేబినెట్‌ హోదా కలిగిన మంత్రి పదవి దక్కింది. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com