కార్పొరేటర్ టూ కేంద్ర మంత్రి..!

- June 12, 2024 , by Maagulf
కార్పొరేటర్ టూ కేంద్ర మంత్రి..!

తెలంగాణ రాజకీయాల్లో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఫైర్ బ్రాండ్ నేతగా ఎదిగిన బండి సంజయ్.. ఇప్పుడు ఏకంగా నరేంద్ర మోడీ  3.0 కేబినెట్‌లో కేంద్ర మంత్రి పదవిని అలంకరించారు. కార్పొరేటర్ నుంచి కేంద్రమంత్రి స్థాయి వరకు ఎదిగిన ఆయన రాజకీయ ప్రస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సంజయ్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే. తెలంగాణలో బీజేపీని గ్రామీణ స్థాయిలో పటిష్ఠపరిచిన ఘనత కూడా సంజయ్‌దే అని చెప్పాలి.

బండి సంజయ్ కుమార్ 1971 జూలై 11న కరీంనగర్ పట్టణంలో శకుంతల, నర్సయ్య దంపతులకు జన్మించారు. తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పని చేసేవారు. సంజయ్‌ను తన తండ్రి ఒకటో తరగతిలోనే సరస్వతి శిశుమందిర్‌ లో చేర్పించారు.12 ఏళ్ల వయస్సులోనే ఆర్ఎస్ఎస్‌లో చేరారు. అప్పట్నుంచే సంజయ్ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో ఘటన్‌ నాయక్‌గా, ముఖ్య శిక్షక్‌గా పనిచేశారు.

విద్యార్థి దశ నుంచే బండి సంజయ్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. కాలేజీ చదువుకునే రోజుల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ విద్యార్ధి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో చేరారు. ఏబీవీపీ కరీంనగర్ పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగానూ పనిచేశారు. 1992లో అయోధ్య కరసేవకుడిగా పనిచేసిన ఆయన అప్పటి బీజేపీ సీనియర్ నాయకులు,  మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి పార్టీ పనుల్లో సహాయర్థిగా ఢిల్లీ బీజేపీ సెంట్రల్‌ ఆఫీస్‌లో పనిచేశారు.

సంజయ్ కరీంనగర్ భారతీయ జనతా యువమోర్చాలో పనిచేస్తున్న సమయంలోనే 1996 ఎన్నికలకు ముందు బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ నిర్వహించిన సూరజ్ రథ యాత్ర సమయంలో వాహన బాధ్యుడిగా పనిచేశారు. 35 రోజుల పాటు జరిగిన యాత్రలో బండి కీలకంగా వ్యవహరించడంతో పాటు పార్టీ అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. అనంతరం యువమోర్చా కరీంనగర్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా, పట్టణ అధ్యక్షునిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబెర్‌గా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్‌గా, జాతీయ కార్యదర్శిగా వివిధ హోదాల్లో పార్టీలో పని చేశారు. భారతీయ జనతా పార్టీ కేరళ, తమిళనాడు రాష్ట్రాల ఎన్నికల ఇంచార్జి‌గా బాధ్యతలు నిర్వహించారు. బీజేపీ తరుపున కేరళ, తమిళనాడు రాష్ట్రాల ఎన్నికల పరిశీలకుడిగా పనిచేశారు.  

సంజయ్ 1994-2003 వరకు కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2005లో కరీంనగర్ నగర పాలక సంస్థ‌కు బీజేపీ కార్పోరేటర్‌గా ఎన్నికై.. 2019 వరకు కార్పోరేటర్‌గానే పనిచేస్తూ వచ్చారు.2014, 2018 ఎన్నికల్లో  కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి బండి సంజయ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.  2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా  బరిలోకి దిగి విజయం సాధించారు.

సంజయ్ 2020 మార్చి 11 నుంచి 2023 జులై 4 వరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి కృషి చేశారు. అప్పటి అధికార పార్టీ ఒత్తిళ్లను లెక్కచేయకుండా పార్టీని బూత్ లెవల్ నుండి రాష్ట్రస్థాయి వరకు పటిష్ఠపరిచారు. 2023 జులై 29న బీజేపీ పార్టీ అధిష్ఠానం భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 2023 ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి మూడో సారి ఓటమి పాలయ్యారు. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుండి రెండో సారి ఎంపీగా ఎన్నికైన తర్వాత  నరేంద్ర మోడీ  3.0 కేబినెట్‌లో కేంద్ర హోం శాఖ సహాయక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్రమంత్రి వరకు ఎదిగిన బండి సంజయ్ ప్రస్థానం స్పూర్థిధాయకమేనని చెప్పాలి. ఇదిలా ఉండగా సంజయ్ కేంద్ర మంత్రి కావడంతో ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com