చిరంజీవి బ్లడ్ బ్యాంక్

- June 14, 2024 , by Maagulf
చిరంజీవి బ్లడ్ బ్యాంక్

రక్తదానం అనేది ప్రాణదానం లాంటిది. దీన్ని అమ్మకం అనకుండా దానం అని అనటంలోనే దాని ప్రాధాన్యం తెలుస్తోంది.రక్తందానం చేసే ప్రాణదాతలకు గుర్తింపుగా ఏటా జూన్‌ 14వ తేదీన ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని నిర్వహిస్తారు. రక్తదానం చేసేందుకు ప్రజల్ని చైతన్యపరచడంతోపాటు రక్తదానం చేసే విషయంలో ప్రజలకు సరైన అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.

సమయానికి రక్తం అందక ఏంతో మంది చనిపోతున్నారనే ఒక కథనాన్ని వార్తా పత్రికలో చూసిన చిరంజీవి చలించిపోయారు. దానికి పరిష్కారం కనుక్కోవడం దిశగా అడుగులేశారు. రక్త దానం అన్నింటి కంటే గొప్ప‌ద‌ని రెండు దశాబ్దాల క్రిత‌మే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి న‌మ్మారు. ఆ క్ర‌మంలోనే ఆయ‌న 1998 అక్టోబర్ 2వ తేదీన అంటే గాంధీ జయంతి రోజున చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. నాటి నుంచి నేటి వ‌ర‌కు బ్ల‌డ్ బ్యాంక్ సేవలను రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి నిరాటంకంగా కొనసాగిస్తూనే ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇత‌ర‌త్రా ఎన్ని కార్య‌క్ర‌మాలు చేప‌ట్టినా... ర‌క్త దానాన్ని మాత్రం చిరంజీవి వ‌దిలేయ‌లేదు. ఏటా తాను ర‌క్త‌దానం చేస్తూ త‌న అభిమానుల‌తో పాటు పెద్ద సంఖ్య‌లో యువ‌త‌ను ఆ దిశ‌గా న‌డిపిస్తూ చిరు సాగుతున్నారు.

సినిమా రంగంలో అగ్రశ్రేణి నటుడిగా ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి నటనలోనే కాదు.. ప్రజా సేవలోనూ ముందుంటారు. అందులో భాగంగానే  చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ట్రస్ట్  కింద బ్ల‌డ్ బ్యాంక్, ఐ బ్యాంక్ సెంటర్స్ నిర్వహిస్తున్నారు. చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇప్పటికే ఎంతో మంది కంటి చూపును పొందగా.. లక్షలాది మంది ఆపద సమయాల్లో ఉచితంగా రక్తాన్ని పొందారు. అంతేకాదు, ప్రజల్లో రక్తదానంపై ఉన్న అపోహల్ని కూడా పోగొట్టే ప్రయత్నం చేసింది చిరంజీవి బ్లడ్ బ్యాంక్.

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మరియు చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణలో చిరంజీవి వీరాభిమాని, అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు కీలకంగా వ్యవహరిస్తున్నారు. చిరంజీవి ఫ్యాన్స్ ను ఒక్కతాటిపై దశాబ్దాలుగా నడిపిస్తున్న తీరు అమోఘం. ఇదంతా ఆయనకు చిరంజీవిపై ఉన్న అపారమైన ప్రేమ, అభిమానం కారణం.చిరంజీవికి స్వామినాయుడు అభిమాని అనేకంటే భక్తుడు అనడం సబబు.

స్వామి నాయుడు చిరంజీవి హీరోయిజానికే కాదు, ఆయన సేవా స్ఫూర్తికి అభిమాని. రాష్ట్రంలో చిరంజీవికి ఉన్న లక్షలాది అభిమానులు వేలల్లో ఏర్పడిన అభిమాన సంఘాలను పర్యవేక్షించే బాధ్యతను చిరంజీవి స్వామినాయుడుకు అప్పగించారంటే ఆయనలో ఎంతటి నిబద్ధత ఉందో అర్ధం చేసుకోవచ్చు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు తర్వాత విస్తృతమైన రక్తదానం, నేత్రదానం కార్యక్రమాలను నిబద్ధతతో నిర్వర్తించి అభిమానుల్ని ఒక్కతాటిపై నిలిపి.. చిరంజీవి సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు.

చిరంజీవి ఆదేశాల మేరకు బ్లడ్ బ్యాంక్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి(COO)గా బాధ్యతలు చేపట్టి, తన అభిమాన నటుడి ఆదర్శాలకు అనుగుణంగా సంస్థను నడిపిస్తూ చిరంజీవి ప్రశంసలు అందుకున్నారు. సంస్థ తరుపున రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతమైన కార్యక్రమాలు నిర్వహించారు స్వామి నాయుడు.

బ్లడ్ బ్యాంక్ గురించి చిరంజీవి మాట్లాడుతూ అభిమానులకు ప్రత్యుపకారంగా ఏదో ఒకటి చేయాలని బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. బ్లడ్ బ్యాంక్ విజయవంతంగా ముందుకు వెళుతోందంటే గొప్ప మనసు ఉన్న నా అభిమానులు, ఎందరో దాతలు సహకరించి నాతో పాటు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావడం వల్లేనని చెప్పుకొచ్చారు.

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com