స్టార్ విజయ్ జన్మదినం
- June 22, 2024
దళపతి విజయ్ ఈ పేరు వినగానే తెలుగువాళ్లకు గుర్తొచ్చే సినిమాలు స్నేహితుడు, కత్తి, తుపాకీ, మెర్సల్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. కానీ విజయ్ అప్పటికే తమిళంలో స్టార్ హీరో.ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు.. మరెన్నో వైవిధ్యమైన పాత్రలతో అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. నేడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు.
విజయ్ పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. 1974, జూన్ 22వ తేదీన ప్రముఖ సినీ దర్శకుడు ఎస్.ఎ. చంద్రశేఖర్, గాయని శోభ దంపతులకు చెన్నైలో జన్మించారు. సామాజిక అంశాలతో సంచలన దర్శకుడిగా ఎస్.ఎ. చంద్రశేఖర్ వెలుగొందుతున్న తరుణంలో వెట్రి, నాన్ రెడ్డ్ మన్మన్, ఖట్టమ్ ఈఓర్ ఉరులన్ వంటి చిత్రాలతో విజయ్ ని బాలనటుడిగా పరిచయం చేశారు. సినిమా కుటుంబం కావడంతో విజయ్‌కి చిన్నతనంలోనే సినిమాలపైనా, సినీ పరిశ్రమపైనా ఆసక్తి పెరిగింది.
నటన పట్ల ఉన్న ఆసక్తి, అభిరుచి కారణంగా లయోలా కళాశాలలో విజువల్ కమ్యూనికేషన్ కోర్సు సగంలోనే వదిలేసి సినీరంగంలోకి అడుగుపెట్టాడు విజయ్. అమ్మ శోభ స్క్రీన్ ప్లేతో హీరోగా పరిచయం అయ్యాడు. తండ్రి దర్శకత్వం వహించిన రేపటి తీర్పు సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో.. సెంటూరపాండి సినిమాలో నటించాడు.
తండ్రి దర్శకత్వంలో అనేక చిత్రాల్లో నటించిన విజయ్.. నటుడిగానే కాకుండా కమర్షియల్ హీరోకి కావాల్సిన డ్యాన్స్, యాక్షన్ నేర్చుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. 1996లో పూవే ఉనకక్క సినిమాతో హీరోగా విజయ్ కెరీర్ మారింది. దీంతో విజయ్ ఫాలోయింగ్ పెరిగింది. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించారు. విజయ్ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. ఏజే సూర్య తెరకెక్కించిన ఖుషి సినిమాతో విజయ్ ఇమేజ్ మరింత పెరిగింది. అలాగే మహేష్ బాబు నటించిన పోకిరి చిత్రాన్ని రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. కత్తి, తేరి, మెర్సల్, బిగిల్, మాస్టర్, బీస్ట్, లియో వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు విజయ్ ఖాతాలో ఉన్నాయి.
హీరోగా స్టార్ డమ్ ఇవ్వడమే కాదు.. పూవే ఉనకక్క వ్యక్తిగత జీవితాన్ని మలుపు తిప్పింది. శ్రీలంకలోని జాఫ్నాకు చెందిన సంగీత లండన్ లో చదువుకుంటున్న సమయంలో పూవే ఉనకక్క సినిమా చూసి విజయ్ వీరాభిమానిగా మారింది. మొదట అభిమానిగా పరిచయమై స్నేహితురాలిగా, ప్రియురాలిగా, భార్యగా మారి లండన్ నుంచి చెన్నైలో సెటిల్ అయ్యింది. 1999 ఆగస్ట్ 25న వీరిద్దరి వివాహం జరిగింది. వీరికి కుమారుడు జాసన్ సంజయ్, కుమార్తె దివ్య ఉన్నారు.
ఇటీవల తమిళక వెట్రి కజగం అనే పొలిటికల్ పార్టీని స్థాపించిన విజయ్.. ఇప్పటివరకు తాను కమిట్ అయిన సినిమాలు తప్ప మరే సినిమాల్లో నటించనని ప్రకటించాడు. 2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా పెట్టుకుని తన అభిమానులు, ఫోరమ్ నిర్వాహకులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.గతేడాది పదవ తరగతి, ఇంటర్ పరీక్షలలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు జిల్లా స్థాయి విద్యార్థులకు వేర్వేరుగా వేడుకలు నిర్వహించి బహుమతులు అందించారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్‌లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







