పయ్యెలి ఎక్స్‌ప్రెస్..!
- June 27, 2024
"పరుగుల రాణి " ప్రసిద్ధి పొందిన పి.టి.ఉష గురించి తెలియని వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అసలు అమ్మాయిలు బయట అడుగుపెట్టడమే గగనం అనుకునే రోజుల్లోనే అథ్లెటిక్స్ ట్రాక్ సూట్ ధరించి... ప్రపంచ వేదికలపై పరుగు పందెంలో పథకాలు సాధించి భారత దేశ కీర్తిని రెపరెపలాడించారు. ఇలా పరుగు పందెంలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్న ఈ పయ్యెలి ఎక్స్‌ప్రెస్ ఎందరో భారతీయ యువ మహిళా క్రీడాకారిణులకు స్ఫూర్తిగా నిలిచారు. నేడు పరుగుల రాణి పి.టి.ఉష జన్మదినం.
పిలవుల్లకండి తెక్కెపరాంబిల్ ఉష అలియాస్ పి.టి.ఉష 1964,జూన్ 27న కేరళ లోని కోజికోడ్ జిల్లా పయ్యోలి గ్రామంలోని సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఉష పరుగు పెట్టడం నాల్గవ తరగతిలో ఉండగా మొదలుపెట్టారు. స్కూల్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఆమె జిల్లా స్థాయి పరుగు పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచారు. 1979లో ఉష జాతీయ స్థాయి పాఠశాల క్రీడలలో పాల్గొంది. అప్పుడే ఆమె లోని నైపుణ్యాన్ని ఇండియన్ అథెలిటిక్స్ కోచ్ ఓ. నంబియార్ పసిగట్టారు.
ఆ సమయంలో భారత దేశంలో మహిళా అథ్లెట్ల సంఖ్య చాలా తక్కువ. అథ్లెటిక్ సూట్ ధరించి ట్రాక్ పై పరుగెత్తడం అరుదుగా జరిగేది. నంబియార్ శిక్షణలో స్ప్రింటర్ గా రాటుదేలిన ఉష, తన గురువు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో చక్కటి ప్రతిభ కనబరచి అనేక పతకాలను కైవసం చేసుకున్నారు. 16 ఏళ్ల వయసులో 1980లో మాస్కోలో జరిగిన వేసవి ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. సరిగ్గా నాలుగు సంవత్సరాల తర్వాత భారతదేశం నుంచి ఒలింపిక్స్ ఫైనల్‌కి చేరిన తొలి మహిళా అథ్లెట్‌గా ఆమె నిలిచారు. ఈ క్రమంలోనే ఆమె పయ్యెలి ఎక్స్‌ప్రెస్ గా గుర్తింపు పొందారు.
1982లో ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడలలో 100 మీ. 200 మీటర్ల పరుగులో రజత పతకం పొందింది. 1985లో కువైట్లో జరిగిన ఆసియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలలో ఉష బంగారు పతకం పొందడమే కాకుండా, కొత్త ఆసియా రికార్డును సృష్టించింది. 1983 నుంచి 1989 మధ్యకాలంలో ఉష ఆసియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్స్ పోటీలలో 13 స్వర్ణ పతకాలను సాధించింది. 1984లో అమెరికా లోని లాస్ ఏంజిల్స్లో జరిగిన ఒలింపిక్ క్రీడలలో ఉష సెమీఫైనల్స్ లో పథమస్థానంలో వచ్చిననూ పైనల్స్ లో వెంట్రుకవాసిలో పతకం పొందే అవకాశం కోల్పోయింది. సెకనులో వందోవంతు తేడాతో కాంస్యపతకం పొందే అవకాశం జారవిడుచుకున్ననూ, ఒలింపిక్ క్రీడల అథ్లెటిక్స్ లో పైనల్స్ చేరిన తొలి మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.
1986లో దక్షిణ కొరియా రాజధాని సియోల్లో జరిగిన 10 వ ఆసియా క్రీడలలో పి.టి.ఉష 4 బంగారు పతకాలను సాధించడమే కాకుండా అన్నిట్లోనూ ఆసియా రికార్డులు సాధించడం విశేషం. అదే ఆసియాడ్ లో మరో రజత పతకం కూడా సాధించింది. 1985లో జకార్తాలో జరిగిన 6 వ ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్ షిప్ పోటీలలో ఈమె 5 బంగారు పతకాలను సాధించి తనకు తిరుగులేదని నిరూపించుకుంది. ఆమె క్రీడాజీవితంలో మొత్తం మీద ఈమె 103 పతకాలను సాధించింది. అందులో ఆసియా క్రీడల్లోనే అత్యధికంగా 23 పతకాలను కైవసం చేసుకున్నారు. చివరిగా 2000 సంవత్సరంలో సిడ్నీ ఒలంపిక్స్ లో పాల్గొని రిటైర్మెంట్ ప్రకటించారు.
ఉష 1984లో అర్జున అవార్డు,1985లో పద్మశ్రీ అందుకున్నారు. ఉష వ్యక్తిగత జీవితానికి వస్తే 1991లో వి.శ్రీనివాసన్ అనే వ్యక్తిని వివాహమాడారు. శ్రీనివాసన్ క్రీడాకారుడు మరియు సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో పనిచేశారు. వీరికి ఒక కుమారుడు.
2000 సంవత్సరంలో తన పరుగును ఆపిన ఉష తన లక్ష్యాన్ని మాత్రం వీడలేదు. ఒలంపిక్స్ పతకాన్ని వెంట్రుక వాసిలో చేజార్చుకున్న ఆమె, భారత దేశం తరుపున మరొకరైనా సాధించాలనే లక్ష్యంతో 2002లో "ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్"ను ప్రారంభించారు. తన భర్తతో కలిసి అథ్లెట్లు కావాలనుకునేవారికి శిక్షణ ఇస్తున్నారు."ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే మా లక్ష్యం. మా దగ్గర శిక్షణ తీసుకుంటున్న క్రీడాకారులు ఆసియన్ గేమ్స్‌లో ఇప్పటికే ప్రతిభ కనబరిచి, ఒలింపిక్స్‌లో పదకొండవ స్థానం వరకు వెళ్లారు’’ అని ఆమె తెలిపారు.
భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన అథ్లెట్ పి.టి. ఉష స్పోర్ట్స్ కోటాలో 2022 సంవత్సరంలో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అంతేకాకుండా, వైస్ ఛైర్‌పర్సన్స్ కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు. దీంతో రాజ్యసభ ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ లేని సమయంలో 2023 పిబ్రవరి 9న ఆమె సభాపతిగా వ్యవహరించి రాజ్యసభను నడిపారు. భారత క్రీడా చరిత్రలో ఇటువంటి అరుదైన ఘనత ఒక్క ఉషకు మాత్రమే దక్కింది. ఒక వైపు ఎంపీగా, కోచ్ గా ఉంటూనే 2022 డిసెంబర్ 10వ తేదీన భారత ఒలంపిక్ సంఘం ( ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ - ఐ ఓ ఏ ) తొలి మహిళ అధ్యక్షురాలిగా ఉష ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!







