సంగీత చక్రవర్తి-మంగళంపల్లి

- July 06, 2024 , by Maagulf
సంగీత చక్రవర్తి-మంగళంపల్లి

కర్ణాటక సంగీతానికి గౌరవం, గుర్తింపు తెచ్చిన ఘనత తెలుగువారికే దక్కు తుందనడంలో సందేహం లేదు. తెలుగునాట సంగీతంలో మహా విద్వాంసులు, వాగ్గేయకారులున్నారు. ‘ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా’ అని శ్రీరామచంద్రుడినే ప్రశ్నించిన భక్తరామదాసు, ‘ఎక్కువ కులజుడైన, హీన కులజుడైన నిక్కమెరిగిన మహా నిత్యుడే ఘనుడు’ అని అన్ని కులాలు సమానమేనని చెప్పిన తాళ్లపాక అన్నమాచార్య, ‘దుర్మార్థ చరాధములను దొరా నేన నజాలరా’ అన్న ధిక్కార స్వరాన్ని వినిపించిన త్యాగరాజు, “నిను నమ్మిన నాపై పరాముఖమేల’ అని పార్వతీదేవిని ప్రశ్నించిన శ్యామ శాస్త్రి లాంటి సరస్వతీ పుత్రులున్నారు. అలాంటి మహానుభావుల కోవకు చెందిన వారు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ. నేడు మంగళంపల్లి వారి జయంతి.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని శంకరగుప్తం గ్రామంలో 1930,జులై 6వ తేదీన జన్మించిన బాలమురళి సంగీత వనంలో పుట్టిన పుష్పం. ఆయన తల్లి సూర్యకాంతమ్మ వీణా విద్వాంసురాలు, తండ్రి వేణువు, వయోలిన్, వీణ వాయిద్యాల్లో విద్వాంసులు. ఎనిమిదవ ఏట ఆయన తిరవాయూరులోని త్యాగరాజు ఆరాధనోత్సవాల్లో కచేరి చేసి శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన తర్వాత సంగీతమే ఆయన వెంట నడిచింది. ఈ అపూర్వ ఘట్టాన్ని బాలమురళీ కృష్ణ ఎన్నోసార్లు తలచుకున్నారు. తిరువాయూరులో నలుమూలల నుంచి వచ్చిన సంగీత విద్వాంసులు తన ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఆ వేదికపై ప్రముఖ సంగీత విద్వాంసులు పారుపల్లి రామకృష్ణయ్య తన స్థానంలో తన శిష్యుడైన బాలమురళీకృష్ణతో పాడించారు.

ఆయన అసలు పేరు మురళీ కృష్ణ. ప్రముఖ హరికథా విద్వాంసుడు ముసునూరి హరికథా భాగవతార్ ఆయన సంగీత ప్రతిభ తెలుసుకుని బాలమురళి అని దీవించారు. ఆనాటి నుంచి ఆయన పేరు బాలమురళీకృష్ణగా స్థిరప డింది. సంప్రదాయ సంగీతంలో అనేక ప్రయోగాలు చేసిన నవ్యత, సృజనాత్మకత సాధించిన బాలమురళి గణపతి, సర్వశ్రీ, మహతి, లవంగి, సుముఖం, సిద్ధి, మురళి వంటి రాగాలను తానే సృజించారు.

సినీ రంగంలో కూడా ఆయన ప్రవేశించి ఒక్క మెరుపు మెరిసినప్పటికీ నటన కన్నా, సినీ గీతాల కన్నా సంగీతానికే ప్రాధాన్యతనిచ్చారు. ‘భక్త ప్రహ్లాద’ చిత్రంలో నారదుడి పాత్రకు వన్నెతెచ్చి తన గీతాలు తానే పాడారు. హంసగీతె కన్నడ చిత్రంలో ‘హిమాద్రి సుతే పాహిమాం అన్న కీర్తన ఆలపించినందుకు బాలమురళీకృష్ణకు ఉత్తమ నేపథ్య గాయకునిగా జాతీయ పురస్కారం లభిం చింది. ‘మాధవాచార్య’ అనే సినిమాకు ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ పురస్కారం గ్రహించారు. ‘గుప్పెడు మనసు’ చిత్రంలో ‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా’ పాట ఇప్పటికీ మన మన సుల్లో ధ్వనిస్తూనే ఉంటుంది. జాతీయస్థాయిలో పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ వంటి అత్యు న్నత పురస్కారాలు పొందిన బాలమురళి ఫ్రెంచి ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక షెవాలియర్ గార వాన్ని కూడా పొందారు. దేశ విదేశాల్లో కలిపి ఆయన 26వేలకు పైగా కచేరీలు చేశారు.

తన గురు భక్తి చాటుకోవడానికి గురువు పారుపల్లి రామకృష్ణయ్య మీదే అనేక కీర్తనలు రచించారు. ఉదాహరణకు గ్రహ వీక్షణము కన్నా, గురు అనుగ్రహ వీక్షణము మిన్న. అయ్యా గురువర్యా, నీ యానతితో పాడుచుంటుమయ్యా అన్న కీర్తనలతో శిష్యుడుగా తన అభిమానాన్ని చాటుకున్నారు. కచేరీల్లో గణపతి కీర్తనను ముందే పాడాలన్న నియమానికి స్వస్తి చెప్పి ఆయన కచేరీ మధ్యలో కూడా వినాయకుడిపై కీర్తనలు ఆలపించేవారు.

భావగీతాలు, భక్తి గీతాలు, దేశభక్తి గీతాలు, స్ఫూర్తి గీతాలు, మంగణాలు, తత్వాలు మొదలైన అనేక ప్రక్రియల్లో బాలమురళి రచనలు చేసి ఆమో ఘంగా ఆలపించారు. కార్గిల్ యుద్ధ సమయంలో ఢిల్లీ మిలటరీ అకాడమీలో అప్పటికప్పుడు అను వుగా ‘సాయుధ సవ్వడి వాయు మూల విననాయె -భయము లేదని మురళి-మ్రోయగా మనదే జయ మనివిజయ దుందుభి నినదించే’ అని ఆలపిం చారు. ఒక తెలుగు వ్యక్తి దాన్ని హిందీలో తర్జుమా చేస్తే ఆయన హిందీలో కూడా ఆ పాట పాడి సైనికులకు విజయోత్సాహం కలిగించారు.

తెలుగువారి కంటే తమిళులు ఆయనను ఎక్కు వగా ఆదరించినప్పటికీ బాలమురళీ కృష్ణకు తాను జన్మించిన ఆంధ్రప్రదేశ్ అంటే ఎంతో అభిమానం. “ఆరంభమునకు ఆంధ్రము-ఆచరణకు అరవము’ అని రాసినప్పటికీ ‘తెలుగు వెలుగు కిరణాలు మనకూ మనదేశానికి నవరత్నాభరణాలు’ అని ఆలపించారు.

విజయవాడలో చాలాకాలం నివసించానన్న ప్రేమతో ‘వినుమురా విజయవాణి కనుమురా కృష్ణవేణి-విజయుని జయాలయం-విజయ మాత విమల నిలయం వికచగాన కళా కవితా విచక్షణుల శుభాలయం’ అని అద్భుతంగా రాసి పాడారు. అసమాన ప్రతిభ, అద్వితీయ సంగీత ప్రావీణ్యం, బహుముఖ ప్రజ్ఞాశాలి, కర్ణాటక సంగీత దుర్గాన్ని బలంగా నిర్మించి తెలుగువారికి విశ్వఖ్యాతి తెచ్చిన మంగళంపల్లి బాలమురళీ కృష్ణ తెలుగు వాడు కావడం మన పూర్వజన్మ సుకృతం. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com