ఇండియన్ పొలిటికల్ కింగ్‌మేకర్‌...!

- July 15, 2024 , by Maagulf
ఇండియన్ పొలిటికల్ కింగ్‌మేకర్‌...!

పదవుల వెంట ఆయన పడలేదు. పదవులే ఆయన్ని వరించాయి అన్నదే ఆయన సంపాదించుకున్న ఆస్తి. పదవుల రాకపోకలను తేలికగా తీసుకునేవారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఇచ్చిన నాడే గ్రంథాలయానికి వెళ్లి పుస్తకాల మధ్యలోనే గడిపిన స్థితప్రజ్ఞత్వం. అధిష్ఠానం అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధి, అంకితభావంతో నెరవేర్చడమే ఆయన నేర్చుకున్నది. ప్రధాని అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్న సమయంలోనే పదవికి ఆశపడని వ్యక్తిత్వం ఆయన సొంతం. కింగ్‌మేకర్‌గా భారతదేశ రాజకీయాలను శాసించిన మేరునగధీరుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు కామరాజ్ నాడార్. నేడు ఆ రాజకీయ దిగ్గజం జయంతి.

కామరాజ్ గా ప్రసిద్ధి చెందిన కుమారస్వామి కామరాజ్ నాడార్ తమిళనాడులోని విరూద్‌నగర్‌లో1903, జులై 15న జన్మించారు. ఆరేళ్ళ వయసులోనే తండ్రి చనిపోవడంతో ఆరో తరగతిలోనే ఆయన పాఠశాల నుండి బయటకొచ్చారు. ఇంటి బాధ్యతల్ని చేపట్టారు. తన మేనమామ సరఫరా దుకాణంలో పని చేయడం మొదలెట్టారు. ఆ సమయంలోనే దేశంలో స్వాతంత్య్ర పోరాటం జోరు పెరిగింది. రోజూ వార్తాపత్రికల ద్వారా అప్పటి రాజకీయ పరిస్థితులపై ఆయన ఆసక్తి పెంచుకున్నారు జలియన్‌ వాలాబాగ్‌ ఊచకోత అతని జీవితంలో నిర్ణయాత్మక మలుపైంది. జాతి స్వేచ్ఛ కోసం పోరాడాలని, దేశంలో విదేశీ పాలనను అంతంచేయాలని నిర్ణయించుకున్నారు.  

 1920లో 18ఏళ్ళ వయసులోనే పూర్తిస్థాయి రాజకీయాల్లోకొచ్చారు. కాంగ్రెస్‌లో క్రీయాశీలకంగా మారారు. 1921లో విరూద్‌నగర్‌లో కాంగ్రెస్‌ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. 1921 సెప్టెంబర్‌ 21న మహాత్మాగాంధీ మధురైకి వచ్చినప్పుడు కామరాజ్‌ ఆయన్ను స్వయంగా కలిశారు. అప్పటి నుంచి ఆయనపై గాంధీ ప్రభావం అధికమైంది. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు ఆయన రెండేళ్ళ జైలు శిక్షకు గురయ్యారు. అయితే ఒక్క ఏడాదిలోనే గాంధీ- ఎర్విన్‌ ఒడంబడిక ఫలితంగా జైలు నుంచి విడుదలయ్యారు.

34 ఏళ్ళకే సత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించి 1937లోనే అప్పటి మద్రాస్ అసెంబ్లీలోకి ప్రవేశించారు. 1942లో ముంబైలో జరిగిన ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీకి హాజరయ్యారు. క్విట్‌ ఇండియా ఉద్యమానికి ప్రచార సామాగ్రిని రూపొందించారు. అదే ఏడాది ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని మూడేళ్ళు నిర్బంధించారు. ఆయన మొత్తం 3వేల రోజులకు పైగా జైల్లోనే గడిపారు.

స్వాతంత్య్రానంతరం 1954 ఏప్రిల్‌ 13న మద్రాస్‌ ప్రావిన్స్‌కు కామరాజ్‌ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ హోదాలో కుటుంబ వృత్తి ఆధారిత వారసత్వ విద్యావిధానాన్ని తొలగించారు. విద్య, వాణిజ్యాల్లో మద్రాస్‌ ప్రావిన్స్‌ను అగ్రగామిగా మార్చారు. తాను చదువుకోకపోయినా రాష్ట్రంలో ప్రజలంతా విద్యావంతులు కావాలని అభిలషించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ కుటుంబానికైనా మూడు కిలోమీటర్ల లోపు దూరంలో పాఠశాలుండాలని నిర్ణయించారు. ఇందుకోసం ఏకంగా 18వేల పాఠశాలలను నిర్మించారు. ఆయన ముఖ్య మంత్రయ్యే నాటికి మద్రాస్‌ రాష్ట్రంలో అక్షరాస్యత కేవలం 7శాతం మాత్రమే. ఆయన విద్యారంగంలో తీసుకున్న పాలనా పరమైన సంస్కరణలు కారణంగా సీఎం పదవి నుండి దిగిపోయే నాటికి 37శాతానికి పెరిగింది. ఇప్పటికీ తమిళనాట ఆయన్ను విద్యా పితామహుడిగా ఆరాధిస్తారు.

లక్షలాదిమంది పేద బడి పిల్లలకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆయన కాలంలో భారీ నీటిపారుదల పథకాల్ని రూపొందించారు. కోటి 50లక్షల ఎకరాల భూముల్ని అదనంగా సాగులోకి తెచ్చారు. అప్పటి తమిళనాట కాగితం, చక్కెర, రసాయనాలు, సిమెంట్‌ పరిశ్రమల్ని ఏర్పాటు చేశారు. వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

1964లో నెహ్రూ మరణానంతరం కల్లోల పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను ముందుకు నడిపించారు. నెహ్రూ అనంతరం ప్రధానమంత్రయ్యే అవకాశం ఆయనకొచ్చింది. కానీ అందుకాయన నిరాకరించారు. లాల్‌బహదూర్‌ను ప్రధాని గా ప్రతిపాదించారు. శాస్త్రి మరణానంతరం ఇందిరాగాంధీకి పగ్గాలు అప్పగించడంలో కీలకపాత్ర పోషించారు. అప్పటి నుంచి ఆయన ఇండియాలో కింగ్‌మేకర్‌గా పేరొందారు.

ముఖ్యమంత్రిగా ప్రభుత్వం అందించిన భద్రతను నాడార్‌ నిరాకరించారు. ఒకే పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనంతో ప్రయా ణించారు. విరూద్‌నగర్‌లోని తన నివాసానికి పురపాలక సంఘం ఏర్పాటు చేసిన నీటి కనెక్షన్‌ను కూడా ఆయన వద్ద న్నారు. పదేళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన నాడార్‌ జీవితంలో ఎలాంటి అవినీతి మచ్చాలేదు. జాతి సేవలో తరించిన ఆయన వివాహం కూడా చేసుకోలేదు. సొంతంగా ఆస్తి సంపాదించుకోలేదు. మరణించే నాటికి ఆయన వద్దనున్నది కేవలం 130రూపాల నగదు మాత్రమే. అంతకుమించి ఆయనకు సొంతిల్లులేదు.. సొంత కారు లేదు. ఏ ఆస్తిపాస్తుల్లేవు. సెంటు భూమిని కూడా ఆయన సంపాదించలేదు.  

ప్రజలకు మేలు చేయడానికి, ప్రజాసమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించడానికి ఉన్నత విద్యార్హతలు అవసరం లేదు. విదేశాల్లో ఉద్యోగాలు చేసి రావాల్సిన పని లేదు. పెద్దపెద్ద వ్యాపార, పారిశ్రామిక సంస్థల నిర్వహణా నుభవం అసలే అక్కర్లేదు అని కామరాజ్ నిరూపించారు. సాధారణ జీవితం నుంచి జనజీవనంలోకొచ్చిన ఆయన పాలనలో తమిళనాడు రాష్ట్రాన్ని ప్రగతి పథంవైపు నడిపించారు. పాలకుల పట్ల ప్రజలెట్టుకున్న ఆశల్ని సఫలీకృతం చేశారు. సమాజ సేవకు లేదా పాలనకు చదువుతో సంబంధంలేదు. ఆస్తిపాస్తులతో పనిలేదు. కుటుంబ వారసత్వం అక్కర్లేదు. కావల్సిందల్లా నిజాయితీ, నిబద్దత, సామర్థ్యం మాత్రమేనని ఆయన తన పాలన ద్వారా యావత్ ప్రపంచానికి చాటారు.

ప్రపంచ అభివృద్ధి పటంలో భారతదేశం అగ్రగామిగా నిలవాలని నిరంతరం స్వప్నించిన మహానాయకుడు కామరాజ్. దేశం పట్ల అంతులేని ప్రేమే ఆయన్ని సుదీర్ఘ కాలం రాజకీయాల్లో నడిపించింది. ప్రజాస్వామ్యం పట్ల అంచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్న ఆయన నియంతృత్వ ధోరణులకు బద్ద వ్యతిరేకి. 1976, అక్టోబరు 2న కామరాజ్ 72 సంవత్సరాల వయస్సులో పరమపదించారు. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)


  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com