కేబినెట్ కీలక నిర్ణయాలు-ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు, 22 నుంచి అసెంబ్లీ..!

- July 16, 2024 , by Maagulf
కేబినెట్ కీలక నిర్ణయాలు-ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు, 22 నుంచి అసెంబ్లీ..!

ఇవాళ అమరావతిలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు, పలు సంక్షేమ పథకాల అమలు, ఇసుక విధానం అమలు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సహా పలు ఆంశాలపై చర్చించింది.

ఇందులో పలు అంశాలకు ఆమోద ముద్ర వేసింది. ఈ నిర్ణయాలను సమాచార మంత్రి పార్ధసారధి అనంతరం మీడియాకు వెల్లడించారు.

ఇవాళ కేబినెట్ భేటీలో వివాదాస్పద ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు చేసినట్లు మంత్రి పార్ధసారధి వెల్లడించారు. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అత్యంత ప్రమాదకరమైనదన్నారు. ప్రజల ఆస్తులకు ఈ చట్టం వల్ల రక్షణ లేదని, అందుకే రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే గత ప్రభుత్వ ఇసుక పాలసీ వల్ల ఎలాంటి మేలు జరగలేదని, అందుకే దాన్ని కూడా రద్దు చేశామన్నారు.ఇందులో భాగంగా చేసుకున్న అన్ని ఒప్పందాలు రద్దు చేశామన్నారు. ఎలాంటి ఆదాయం ఆశించకుండా ఉచిత ఇసుక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇందుకోసం ఓ కమిటీ వేయనున్నారు.

రాష్ట్రంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు చేసేందుకు వాణిజ్య బ్యాంకుల నుంచి రూ.2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే రైతుల నుంచి కొత్తగా ధాన్యం కొనుగోలు కోసం ఎన్సీడీసీ నుంచి రూ.3200 కోట్ల రుణం తీసుకునేందుకు వ్యవసాయ, సహకార కార్పోరేషన్ కు ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చేందుకు అనుమతి ఇచ్చారు.రైతుల ఇన్ పుట్ సబ్సిడీపై నెల రోజుల్లో అధ్యయనం కోసం ఆర్ధిక, వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది.

రాష్ట్రంలో కొత్త ఇసుక విధానంపై త్వరలో మార్గదర్శకాలు రూపొందించాలని నిర్ణయించారు. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు కేబినెట్ నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలో నెల రోజుల ప్రభుత్వ పాలనపై చర్చించడంతో పాటు ప్రజల నుంచి ఏయే అంశాలపై వినతులు వస్తున్నాయనే దానిపైనా మంత్రులు చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com