విలక్షణమైన దర్శకుడు - భారతీరాజా
- July 17, 2024
వైవిధ్యభరితమైన చిత్రాలకు మారుపేరుగా నిలిచారు భారతీరాజా. ఒకప్పుడు ఆయన చిత్రం వస్తుంది అంటే చాలు భాషాభేదం లేకుండా ప్రేక్షకులు థియేటర్ల ముందు క్యూ కట్టేవారు. వారి అభిరుచికి తగ్గట్టే ఆయన సినిమాలు రూపొందేవి. దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ దర్శకుడిగా వెలుగొందిన తోలి వ్యక్తి భారతీరాజా. కేవలం దర్శకత్వ శాఖకే పరిమితం కాకుండా నటుడిగా, నిర్మాతగా సైతం రాణించారు. నేడు ఈ దర్శకదిగ్గజం జన్మదినం.
భారతీరాజా అసలు పేరు చిన్నస్వామి. 1941,జులై 17న అప్పటి మద్రాస్ రాష్ట్రంలోని తేని జిల్లా అల్లీనగరంలో జన్మించారు. చిన్నతనం నుంచే రంగస్థలం మీద మక్కువతో విధినాటకాలు, సాంఘిక నాటకాలు వేస్తూ సినిమాల మీద ఆసక్తి పెరిగి మద్రాస్ చేరుకున్నారు. ఆనాడు మద్రాస్ నగరం దక్షిణాది పరిశ్రమకు రాజధానిగా ఉండటంతో సినిమాల మీద మక్కువ గల రాజా, లైట్ బాయ్ గా చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ తొలుత కన్నడ దిగ్గజ దర్శకుడు పుట్టన కనగల్ వద్ద సహాయ దర్శకుడిగా చేరారు. కనగల్ శిష్యరికంలో దర్శకత్వ మెళుకువలు నేర్చుకున్నారు. ఆ తర్వాత పలువురు తెలుగు, తమిళ, మలయాళ దిగ్గజ దర్శకుల వద్ద పనిచేశారు.
నాలుగు బాషల దర్శకుల వద్ద పనిచేయడం మూలాన రాజా అనంతర కాలంలో వైవిధ్య భరితమైన చిత్రాలకు రూపం పోసేందుకు ఊతమిచ్చింది. దర్శకుడిగా తోలి చిత్రం "పదునారు వయదినిలే" చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించి రాజాను పరిశ్రమలో నిలబెట్టింది. ఈ చిత్రంలో నటించిన కమల్ హాసన్, శ్రీదేవి మరియు రజినీకాంత్ అనంతర కాలంలో భారతదేశం గర్వించదగ్గ సుప్రసిద్ధ నటులుగా ఎదిగారు. ఈ సినిమా తెలుగులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో పదహారేళ్ళ వయస్సుగా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. 1980లలో రాజా దర్శకత్వం వహించిన ప్రతి చిత్రం భాషాబేధం లేకుంగా అన్ని భాషల్లో విజయవంతం కావడం విశేషం.
సినీపరిశ్రమకు కొత్తవారిని పరిచయం చేసి వారిని స్టార్లగా తీర్చిదిద్దిన ఘనత భారతీరాజాకు దక్కుతుంది. శ్రీదేవి, రాధికా, రాధా, రతి అగ్నిహోత్రి వంటి పలువురు హీరోయిన్స్ మరియు కార్తీక్, భాగ్యరాజ్, దగ్గుబాటి రాజా వంటి ఒకప్పటి హీరోలను సైతం ఆయనే పరిచయం చేశారు. సీనియర్ నటి సుహాసినిని తెలుగు తెరకు పరిచయం అయ్యింది కూడా భారతీరాజా చిత్రంతోనే.
భారతీరాజా తమిళం తర్వాత అత్యధిక సినిమాలు చేసింది తెలుగులోనే. తెలుగులో అగ్రహీరోలైన సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవిలతో కలిసి పనిచేశారు. రాజా దర్శకత్వంలో వచ్చిన సీతాకోకచిలుక, చిరంజీవి నటించిన ఆరాధన చిత్రాలు టాలీవుడ్ కల్ట్ క్లాసిక్స్ గా నిలిచాయి. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన "మంగమ్మగారి మనవడు" చిత్రం కథ రాజా గారిదే. ఆయన చిత్రాలు తెలుగులో అనువాదమై సంచలన విజయాలను నమోదు చేశాయి.
భారతీరాజా దర్శకుడిగానే కాకుండా నటుడిగా సైతం రాణిస్తున్నారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన యువ చిత్రంతో మద్దలైన ఆయన నట ప్రయాణం దిగ్విజయంగా కొనసాగుతుంది. భారతీరాజా 6 జాతీయ అవార్డులు, 4 ఫిలిం ఫేర్ అవార్డులు, 6 తమిళనాడు స్టేట్ అవార్డులు, ఒక నంది అవార్డును అందుకున్నారు. సినిమా రంగానికి ఆయన చేసిన కృషికి గాను 2004లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.
- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







