కెనడాలో అద్భుతంగా జరిగిన మొదటి సువర్ణ గండపెండేర సత్కారం

- July 23, 2024 , by Maagulf
కెనడాలో అద్భుతంగా జరిగిన మొదటి సువర్ణ గండపెండేర సత్కారం

టొరంటో: అనేక కావ్యాలు వ్రాసిన కవి, మొట్టమొదటి తెలుగు ఫాంట్ వేమనను మనకి అందించిన టొరంటో వాస్తవ్యులు తిరుమల కృష్ణ దేశికాచారికి తెలుగువాహిని సంస్థ  గురుపూజోత్సవ గండ పెండేర ఘన సత్కారం జరిపించింది.రసజ్ఞులైన 200 మంది ఆహూతుల మధ్య ఐదుగంటల పాటు జరిగిన సభ  తెలుగువాహిని సంస్థ అధ్యక్షులు  అశ్విన్ పిళ్ళారిశెట్టి స్వాగత వచనాలతో మొదలై, పూర్వ అధ్యక్షులు త్రివిక్రమ్ సింగరాజు నిర్వహణలో ఆద్యంతం ఆహ్లాదంగా సాగింది. 

స్మిత వేంపాటి గణపతి ఆనంద నర్తనతో మొదలైన సభ,సుధా వేమూరి బృందంచే సరస్వతీ వందనం,కుమారి శ్రావ్య రావెళ్ళ భరతనాట్యంతో సాగి, దేశికాచారి రచనలపై సమీక్షలతో అలరారింది.విన్నకోట రవిశంకర్, దేశికాచారి సాహిత్య పరిచయం చేయగా,తట్టా చక్రవర్తి దేశికాచారి వైదిక వాఙ్ఞ్మయం గురించి ప్రసంగించారు.తదుపరి దేశికాచారి డిజిటల్ కాంట్రిబ్యూషన్ గురించి కన్నెగంటి రామారావు గారు చక్కని ప్రసంగం చేసారు.టొరంటో వాస్తవ్యులు, తెలుగు వాహినిలో అనేక మంది సభ్యులకి ఛందస్సు నేర్పిన డా.దగ్గుబాటి శ్రీరామం దేశికాచారి గురించిన ఆప్తవాక్యాలతో అందరినీ అలరింపజేసారు.   

దేశికాచారి  విరచిత పినవీరభద్రీయము గేయకావ్యం నించి  స్వాగతం కవీంద్రా అనే గేయానికి,సుధా వేమూరి బృందం కూచిపూడి నాట్యం చేసి,దేశికాచారి ని వేదికపైకి తీసుకురావడం కనుల పండుగగా జరిగింది. తదుపరి ప్రముఖ ద్విశతావధాని శ్రీ పాలడుగు చరణ్ తిరుమల కృష్ణ దేశికాచారి గారికి గండపెండేరం తొడిగినంతనే, సభికులు హర్షధ్వానాలతో  పులకితులయ్యారు.దేశికారి రచించిన పుష్పబాణ విలాసం కావ్యం గురించి, ముఖ్యఅతిథి పాలడుగు చరణ్ ప్రసంగం అత్యద్భుతంగా సాగింది. 

అనేకమంది సాహిత్యాభిలాష కలిగిన సభ్యుల మధ్య,దేశికాచారి ఆపెరా మాలిక పుస్తకావిష్కరణ జరిగింది.జెజ్జాల కృష్ణ మోహన్ రావు గారు మరియు  జీ.వీ ప్రభాకర్ తమ అభినందనలను ఆడియోలో తెలియజేసారు. 

ఈ సభకి వీసా కారణాల వలన రాలేకపోయిన బేతవోలు రామబ్రహ్మంని అందరూ మరీ మరీ తలచుకున్నారు.ఇండియా నించి వచ్చిన డా.కే.నాగభూషణం చదివి వినిపించిన పద్యాలు అందరినీ ఆనందసాగరంలో ముంచి వేసాయి. 

దేశికాచారి వ్రాసిన గేయాలని స్వరపరచిన రత్నా శాస్త్రి చెర్ల ఆధ్వర్యంలో మహతి గూడా పాడిన శారదాంబా స్తుతి, కుమారి ఆశ్రిత పొన్నపల్లి గానం చేసిన స్వాగతం కవీంద్రా గేయం,ఈ మువ్వురూ కలిసి ఆలపించిన మంగళం సభికులని ప్రత్యేకంగా అలరించాయి. 

తెలుగువాహిని సెక్రెటరీ సౌజన్య చింతలపూడి వందన సమర్పణతో సభ ముగింది. ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా నిలిచిన తెలుగుతల్లి కెనడా కమిటీకి అశ్విన్ పిళ్ళారిశెట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com