ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్..

- July 23, 2024 , by Maagulf
ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్..

విదేశాల్లోని ఎన్ఆర్ఐలు, అంతర్జాతీయ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్.. ప్రవాస భారతీయులు (NRI) కోసం, దేశాన్ని సందర్శించే అంతర్జాతీయ ప్రయాణికుల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐ వన్ వరల్డ్ వ్యాలెట్ సర్వీసును ప్రారంభించింది.

గత ఏడాది భారత్‌లో జరిగిన జీ20 సమ్మిట్‌లో ఈ సర్వీసును తొలిసారిగా ప్రకటించారు. భారతీయ బ్యాంక్ అకౌంట్ లేని ప్రయాణికులు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సిస్టమ్‌ను యాక్సెస్ చేయడానికి, దానిని ఉపయోగించి చెల్లింపులు చేయడానికి అనుమతిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకత్వంలో (IDFC) ఫస్ట్ బ్యాంక్, ట్రాన్స్‌కార్ప్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌ల సహకారంతో ఎన్‌పీసీఐ ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది.

యూపీఐ వన్ వరల్డ్ వ్యాలెట్ సర్వీస్ ప్రారంభం:
ఎన్‌పీసీఐ పోస్ట్‌లో సర్వీసును ప్రకటిస్తూ.. భారత్ సందర్శించే ప్రయాణికులు సురక్షితమైన డిజిటల్ పేమెంట్లు చేయగలరని, యూపీఐ వన్ వరల్డ్ వ్యాలెట్‌తో దేశవ్యాప్తంగా ఉన్న మర్చంట్స్, రీసేలర్లతో లావాదేవీలు చేయగలుగుతారని పేర్కొంది. ఈ సర్వీసుతో ప్రయాణికులు పెద్ద మొత్తంలో నగదును తీసుకెళ్లే అవసరం ఉండదు. ఒకటి కన్నా ఎక్కువ మొత్తంలో విదేశీ మారకపు లావాదేవీల అవాంతరాన్ని నివారించవచ్చు.

యూపీఐ వన్ వరల్డ్ వ్యాలెట్ సర్వీసుతో విదేశీ ప్రయాణికులు, ఎన్ఆర్ఐలు ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ (PPI)-UPI యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోగలరు. చెల్లింపులు చేయడానికి వారి స్మార్ట్‌ఫోన్ కెమెరాతో ఏదైనా మర్చంట్ క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. తమ యూపీఐ ఐడీతో ఆన్‌లైన్‌లో కూడా లావాదేవీలు చేయవచ్చు. యూపీఐ వన్ వరల్డ్ వ్యాలెట్ మర్చంట్ షాపులు, హోటళ్లు, రెస్టారెంట్‌లలో అలాగే ఆన్‌లైన్ షాపింగ్, వినోదం, రవాణా, ప్రయాణ బుకింగ్ మరిన్నింటి కోసం ఉపయోగించవచ్చని ఎన్‌పీసీఐ (NPCI) తెలిపింది.

ఈ సర్వీసును పొందేందుకు, వినియోగదారులు దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత జారీదారుల నుంచి (PPI-UPI) యాప్‌ని పొందవలసి ఉంటుంది.యాప్ జారీ చేసిన తర్వాత, ప్రయాణికులు (INR)లో తమకు కావలసిన మొత్తంతో యాప్‌ను లోడ్ చేయవచ్చు.విదేశీ మారకపు నిబంధనల ప్రకారం.. ఉపయోగించని ఏదైనా మొత్తం నగదు తిరిగి ట్రాన్స్‌ఫర్ అవుతుంది.అంతర్జాతీయ సందర్శకులకు భారత్‌లో ప్రయాణం, బస చేసేందుకు వీలుగా సర్వీసులను పొందవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com