బాలీవుడ్ స్టార్ కమెడియన్-జానీ లీవర్
- August 14, 2024బాలీవుడ్ అత్యుత్తమ హాస్యనటుల జాబితాలో తెరిచి చూస్తే ఖచ్చితంగా జానీ లీవర్ పేరు ఉంటుంది. అచ్చ తెలుగు వాడైన జానీ లీవర్ బాలీవుడ్ లో స్టార్ కమెడియన్..హిందీ కమెడియన్స్ అనగానే మనకు గుర్తొచ్చే పేర్లు మెహమూద్, అస్రాని, జానీ వాకర్, జగదీప్, కెష్టో ముఖర్జీ. వీరంతా బాలీవుడ్‌లో టాప్ కమెడియన్స్‌గా కొనసాగుతున్న రోజుల్లో ఎంట్రీ ఇచ్చిన జానీ లివర్.. తనదైన శైలితో అందర్నీ ఆకట్టుకున్నాడు. అయితే సిల్వర్ స్క్రీన్ పై తన నటనతో మనల్ని అందరిని నవ్వించే జానీ లీవర్ పుట్టినరోజు నేడు.
జానీ లీవర్ అసలు పేరు జనుమల జాన్ ప్రకాశరావు.1957,ఆగస్టు 14న ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణం దగ్గరలోని హనుమంతునిపాడులో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి ముంబైలోని హిందుస్థాన్ యునీలివర్‌లో కార్మికుడిగా పనిచేసేవాడు. జానీ చిన్నతనంలోనే ముంబైలోని ధారావికి వచ్చి స్థిరపడ్డారు. అయితే తాగుడికి బానిస అయిన తండ్రి.. పిల్లలను, వారి భవిష్యత్తు పట్టించుకోకపోవడంతో కుటుంబం పేదరికంలో మగ్గిపోయింది. జానీ లీవర్ తన 13 ఏళ్ళ వయస్సులోనే తన రోజువారీ సంపాదనతో ఇల్లును నడిపించేవాడు. ఒకవేళ తను సంపాదించని రోజున ఇంట్లో తినడానికి తిండి ఉండేది కాదు.
తండ్రి ప్రవర్తనతో విసుగు చెందడమే కాదు.. కష్టాలను తట్టుకోలేక.. చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకోవాలని రైలు పట్టాలపై పడుకున్నాడు. అయితే అప్పుడు తన ముగ్గురు సోదరీమణులు గుర్తుకొచ్చారు. తాను మరణిస్తే.. వారి పరిస్థితి ఏమిటని ఆలోచించి వెంటనే ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. తన కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకురావాలని, ముగ్గురు చెల్లెళ్ళకు బంగారు భవిష్యత్తునివ్వాలని నిర్ణయించుకున్నాడు. అయినా అప్పుడప్పుడు కలిగే మానసిక ఆందోళన వల్ల ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వస్తూ వుండేదట.
కుటుంబ బాధ్యతను తీసుకున్న జానీ ఎన్నో రకాల పనులు చేశాడు. ముంబాయిలోని వీధుల్లో కొన్నాళ్ళు పెన్నులు, నోట్‌బుక్స్ అమ్మాడు. హైదరాబాద్‌లోని యాకత్‌పూరలోని తన బంధువుల ఇంటికి అప్పుడప్పుడు వచ్చేవాడు. అక్కడ అతనికి చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. ఆ సమయంలోనే మిమిక్రీ నేర్చుకున్నాడు. ముంబాయి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు మిమిక్రీ షోలు చేసేవాడు. ఆ తర్వాత హిందుస్థాన్ లివర్‌లో 6 సంవత్సరాలపాటు చిన్న ఉద్యోగం చేశాడు. లంచ్ టైమ్‌లో అక్కడి వారికి కాలక్షేపం కోసం తన మిమిక్రీతో వారిని నవ్వించేవాడు.
ఆ తర్వాత కంపెనీకి సంబంధించిన ఒక కార్యక్రమంలో తన పై అధికారులను సైతం అనుకరించి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. అప్పటినుంచి కంపెనీకి సంబంధించిన ఏ ఫంక్షన్‌లోనైనా జానీ షో తప్పనిసరిగా ఉండేది. క్రమంగా అతను మిమిక్రీ షోలతో బిజీ అయిపోయాడు. విదేశాల్లో కూడా పెర్‌ఫార్మ్ చేసేందుకు వెళ్లేవాడు. వివిధ షోల ద్వారా సంపాదన బాగానే ఉండడంతో హిందుస్థాన్ లివర్‌లో జాబ్‌ని వదిలేశాడు. అతనిలో ఉన్న టాలెంట్‌కి సినిమాల్లో అయితే బాగా రాణిస్తావని స్నేహితులు అనేవారు. అప్పుడే అతనికి సినిమాల్లో నటించాలనే కోరిక కలిగింది.
1981లో ‘యే రిష్తా న టూటే’ చిత్రంలో ఒక చిన్న క్యారెక్టర్ చేయడం ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు జానీ. ఆ సినిమా తర్వాత అడపా దడపా అవకాశాలు వచ్చేవి.1987లో నసీరుద్దీన్ షా, అర్చనా పురాన్ సింగ్ జంటగా వచ్చిన ‘జల్వా’ చిత్రం అతని లైఫ్‌ని మార్చేసింది. ఆ సినిమాలో అతను చేసిన ముత్తు క్యారెక్టర్‌కి విపరీతమైన రెస్పాన్స్ రావడంతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చాడు జానీ. ఇక అక్కడి నుంచి ప్రతి సంవత్సరం 10 సినిమాలకు తగ్గకుండా చేస్తూ వచ్చాడు. ఒక్క సంవత్సరంలో 20 సినిమాలు చేసిన సందర్భాలు కూడా వున్నాయి. ఒక దశలో బాలీవుడ్‌లో తిరుగులేని కమెడియన్‌గా ఒక వెలుగు వెలిగాడు.
దాదాపు 350కిపైగా సినిమాల్లో నటించిన జానీ హిందీలో బడాబడా స్టార్స్‌తో కలిసి పనిచేశాడు. నాటి ధర్మేంద్ర నుంచి నేటి షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ వరకు అనేకమంది సినీ హీరోల సినిమాల్లో నటించాడు. ‘బాజీగర్’, ‘తేజాబ్’, ‘ఖిలాడీ’, ‘బాజీగర్’, ‘కరణ్ అర్జున్’, ‘రాజా హిందుస్తానీ’, ‘బాస్’, ‘ఎంటర్‌టైన్‌మెంట్’, ‘హౌస్‌ఫుల్’ వంటి ఎన్నో చిత్రాల్లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించారు. జానీ కుమార్తె జామీ లీవర్ సైతం నటిగా రాణిస్తుంది. అల్లరి నరేష్ నటించిన 'ఆ ఒక్కటి అడక్కు' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
ఇంగ్లీషు, హిందీ ఎంత ధారాళంగా మట్లాడగలడో తన మాతృబాష తెలుగులోనూ అంతే బాగా మట్లాడగలడు. జానీ తెలుగు సినిమాల్లో నటించకపోయినా తెలుగు సినిమాలను తరచూ చూస్తుంటాడు. అతనికి బ్రహ్మానందం అంటే ఎంతో అభిమానం. అతనెప్పుడు హైదరాబాద్ వచ్చినా బ్రహ్మానందంని కలవకుండా వెళ్ళడు. ఎంతో దయనీయమైన పరిస్థితి నుంచి బాలీవుడ్ స్టార్ కమెడియన్ గా ఎదిగిన జానీ లీవర్ తెలుగు వాడు కావడం తెలుగువారందరూ గర్వించదగిన విషయం.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్
- కాంగో పడవ ప్రమాదంలో 78 మంది జల సమాధి
- రేపటి నుంచి భారత్–బంగ్లా టీ20 టిక్కెట్ల విక్రయం
- తిరుమల తిరుపతి శ్రీవారికి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు
- ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వైరం ఏమిటి? ఎందుకు?
- ఇండియాకు పన్నెండు ఐఫోన్ 16 తీసుకొస్తూ.. పట్టుబడ్డ ప్రయాణికులు..!!
- అబుదాబిలో వేటాడుతూ.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వేటగాళ్లు..!!
- సౌదీ అరేబియాలో ఇన్‌బౌండ్ విజిటర్స్ వ్యయంలో 8.2% వృద్ధి..!!
- GCC-IMF సమావేశం.. ‘ఎకనామిక్స్ ఛాలెంజెస్’పై కీలక సమీక్ష..
- ఎక్స్పో సిటీ దుబాయ్.. మాస్టర్ ప్లాన్‌కు షేక్ మహమ్మద్ ఆమోదం..!!