వెండితెర సీత...!

- August 24, 2024 , by Maagulf
వెండితెర సీత...!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తన నటనతో చెరగని ముద్ర వేశారు అంజలీదేవి. ముఖ్యంగా సీత పాత్రలో అంజలి నటనకు అప్పట్లో బ్రహ్మరధం పట్టారు. అచ్చతెలుగు ఆడబడుచు అంజలీదేవి రంగస్థలంతో తన నట జీవితాన్ని ప్రారంభించి అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఒక చిన్న క్యారెక్టర్ తో వెండి తెరపై అడుగు పెట్టి  జానపద, పౌరాణిక, సాంఘిక, సినిమాల ద్వారా అగ్రకథానాయకిగా వెలుగొందారు. అభినవ సీతమ్మగా పేరొందిన అంజలీదేవి గారి జన్మదినం.

అంజలీదేవి 1927, ఆగష్టు 24న తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురంలో జన్మించింది. ఆమె చిన్నప్పటి పేరు అంజనమ్మ. సినిమా ప్రస్థానంలో దర్శకుడు సి. పుల్లయ్య గారు ఆమె పేరు అంజలీ దేవిగా మార్చారు. అంజలి దేవి భర్త పి.ఆదినారాయణరావు టాలీవుడ్ తోలి దిగ్గజ సంగీత దర్శకుల్లో ఒకరు. మంచి నటి, నర్తకి అయిన అంజనీ దేవి రంగస్థలంలో అనేక పాత్రలను పోషించారు. 1936లో రాజా హరిశ్చంద్రలో సినిమాలో లోహితాస్యుడు పాత్రని పోషించారు. ఈ సినిమాతో అంజలీ దేవి వెండి తెరపై అడుగు పెట్టారు.

కష్టజీవిలో సినిమాతో హీరోయిన్ గా జర్నీ మొదలు పెట్టి సువర్ణ సుందరి, అనార్కలి, లవకుశ, ఇలా దాదాపు 500 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించారు. 1963లో లవకు చిత్రంలో ఎన్.టి. రామారావు సరసన సీత పాత్రలో నటించిన అంజలీదేవికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ పాత్ర అప్పటి గ్రామీణ మహిళలను బాగా ప్రభావితం చేసింది. అప్పట్లో అంజలి ఎక్కడికైనా వెళ్ళితే.. నిజమైన సీతాదేవిగా భావించి మోకరిల్లిన సందర్భాలున్నాయి.

దక్షిణాదిన ఆనాటి అగ్ర హీరోలుగా వెలుగొందిన ఎన్టీఆర్, ఏన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ మరియు రాజ్ కుమార్ సరసన కథానాయకిగా నటించారు. వీరిలో ఏన్నార్ - అంజలీ దేవి విజయవంతమైన జోడిగా నిలిచారు. వీరి కాంబినేషన్లో వచ్చిన పలు జానపద, సాంఘిక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాలను అందుకున్నాయి.70,80,90 దశకాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సైతంగా రాణించారు. బృందావనం (1992), అన్న వదిన (1993), పోలీస్ అల్లుడు (1994) ఆమె నటజీవితంలో చివరి చిత్రాలు

ఆరు దశాబ్దాల సినీ జీవితంలో దాదాపు 500 పైచిలుకు చిత్రాల్లో నటించిన అంజలీ దేవి నిర్మాతగా సైతం రాణించారు. తన తన భర్త ఆదినారాయణరావుతో కలసి సొంత నిర్మాణ సంస్థ 'అంజలీ పిక్చర్స్'ను స్థాపించి తెలుగు, తమిళం, హిందీ భాషలలో దాదాపు 28 సినిమాలను నిర్మించారు. అనార్కలి, చండీప్రియ, సువర్ణసుందరి, స్వర్ణమంజరి, మహాకవి క్షేత్రయ్య, భక్త తుకారాం  వంటి చిత్రాలను నిర్మించారు. ఈ సంస్థ సినిమాలంటే సంగీత ప్రధానమైనవిగా తెలుగునాట గుర్తింపు పొందాయి. వీరి నిర్మాణ సంస్థలో ఏన్నార్ అత్యధిక చిత్రాల్లో నటించారు.

అనార్కలి,సువర్ణసుందరి, చెంచు లక్ష్మి, జయభేరి చిత్రాలకు గానూ ఉత్తమ నటిగా అంజలీ దేవి నాలుగుసార్లు ఫిలింఫేర్ అవార్డ్స్ ను అందుకున్నారు. తెలుగు సినీరంగానికి చేసిన విశిష్ట సేవలకు గానూ 2005లో రఘుపతి వెంకయ్య పురస్కారం, 2006లో రామినేని ఫౌండేషన్ వారి విశిష్ట పురస్కారం, 2007లో మాధవపెద్ది ప్రభావతి అవార్డు, 2008లో ANR జాతీయ పురస్కారం అందుకున్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. జనవరి 13, 2014న 86వ యేట చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు.

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com