స్టార్ గేయ రచయిత...!
- August 24, 2024
వేటూరి, సిరివెన్నెల, చంద్రబోస్ లాంటి దిగ్గజాల తర్వాత టాలీవుడ్‌కు దొరికిన ఉత్తమ గేయ రచయితల్లో రామజోగయ్య శాస్త్రి ఒకరు. ఓవైపు యూత్‌కు నచ్చేలా ట్రెండీగా పాటలు రాయడమే కాక.. ఇంకోవైపు మంచి సాహిత్య విలువలతో గాఢత చూపించడం కూడా ఆయనకు తెలుసు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ.. వివాదాలకు దూరంగా… ఎప్పుడూ పాజిటివ్‌గా మాట్లాడే రామజోగయ్య పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రయాణం మీకోసం....
రామజోగయ్య శాస్త్రి 1970, ఆగస్టు 24న గుంటూరు జిల్లా నర్సరావుపేట దగ్గర ఉన్న ఆరేపల్లి ముప్పాళ్ళ గ్రామంలో జన్మించారు. ఐదారు తరగతుల్లోనే సినిమాల ప్రభావం మొదలైంది. చిన్నతనంలో గాయకుడి కావాలని కలలు కనేవారు.నచ్చిన పాటలన్నీ రికార్డ్ చేయించుకుని విని నేర్చుకునేవారు. ఇంటర్‌కి ఊరు దగ్గర్లో ఉన్న నర్సరావుపేటలో చదువుకున్నారు. ఆ తరువాత ఇంజనీరింగ్ వరంగల్ రీజినల్ ఇంజినీరింగ్ కళాశాలలో పూర్తి చేసి. ఎం.టెక్ ఐఐటీ ఖరగ్‌పూర్ లో పూర్తిచేశారు. అనంతరం కొంత కాలం బెంగళూరులో ఉద్యోగం చేశారు.
బెంగుళూరులో ఓ గాయకుడితో పరిచయం అయ్య అక్కడక్కడా ఆర్కెస్ట్రాలలో పాడడం రామజోగయ్య మొదలుపెట్టారు. అక్కడే కన్నడ రచయిత శ్రీచంద్ర, గాయని సుజాత పరిచయమయ్యారు. వాళ్ళని సినిమాల్లో పాడే అవకాశం ఇమ్మని కోరగా. తనకి శాస్త్రీయ సంగీత జ్ఞానం లేదు అని చెప్పడం ఇష్టం లేక పాటల రచయితగా ప్రయత్నించమన్నారు. అలా వాళ్ళ ప్రోత్సాహంతో ముందుగా దాదాపు నలభై క్యాసెట్లకు భక్తిపాటలు రాశారు.
బెంగుళూరులో పనిచేస్తున్న కంపెనీ ఇబ్బందుల్లో పడటంతో మరో ఉద్యోగం చూసుకోవాల్సి వచ్చింది.పాటల్లోపడి ఉద్యోగానికి న్యాయం చేయలేకపోతున్నానని భావించి ఉద్యోగానికి రాజీనామా చేశారు. తరువాత హైదరాబాద్ వచ్చి దర్శకుడు కృష్ణ వంశీ ద్వారా సిరివెన్నెల సీతారామ శాస్త్రిని కలుసుకుని ఆయన దగ్గర శిష్యరికం చేశారు. రోజూ పన్నెండు గంటల నుండి రాత్రి ఎనిమిది దాకా ఆఫీసులో పని, తరువాత రాత్రి రాత్రి ఎనిమిదయ్యేసరికి శాస్త్రిగారింటికి. తెల్లారేవరకూ అక్కడే. అప్పుడొచ్చి కాసేపు నిద్రపోయి మళ్లీ ఆఫీస్‌కి వెళ్లేవారు. అలా ఆయన దగ్గర గీత రచనలో మెలకువలు నేర్చుకున్నారు.
కొన్నాళ్ళ తర్వాత ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ సమర్పణలో వచ్చిన యువసేన చిత్రానికి మొదటి సారి పాటల రచయితగా రామజోగయ్యకు అవకాశం వచ్చింది. అందులో జోగయ్య రాసిన పాటలు రెండూ హిట్ సాంగ్సే. కానీ, తరువాత ఏడాదిపాటు ఏ అవకాశమూ రాలేదు. మరి కొద్ది కాలం తర్వాత కళ్యాణ్‌రామ్ హీరోగా వచ్చిన 'అసాధ్యుడు' చిత్రానికి రాసే అవకాశం వచ్చింది. ఇదే సమయంలో సంగీత దర్శకుడు చక్రి పరిచయం జోగయ్య కెరీర్ ను మలుపు తిప్పింది.
చక్రి ద్వారా పలు యువ దర్శకులు పరిచయమయ్యారు. వారిలో ఒకరైన దర్శకుడు శ్రీనువైట్ల తీసిన 'ఢీ'లో పాటలు రాయడానికి అవకాశమిచ్చాడు. ఢీ సినిమా సక్సెస్ ఆయనకు టాలీవుడ్లో స్థిరపడడానికి అవకాశం కల్పించింది. ఆ తర్వాత టాలీవుడ్ అగ్ర సినీ గేయ రచయితగా జోగయ్య ఎదిగారు. శ్రీమంతుడు చిత్రంలో "పోరా శ్రీమంతుడా", జనతా గ్యారేజ్ చిత్రంలోని ప్రణామం.... ప్రణామం పాటలకు గానూ నంది అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన మరిన్ని మధుర గీతాలతో ప్రేక్షకులను అలరించాలని ఆశిద్దాం!
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!
- మస్కట్ మునిసిపాలిటీ చేతికి ఒమన్ బొటానిక్ గార్డెన్..!!
- షేక్ తమీమ్ అవార్డుల విజేతలను సత్కరించిన అమీర్..!!
- 14 రోజుల్లో 21 ఆస్తులకు విద్యుత్ నిలిపివేత..!!
- యూఏఈలో తొలి లైసెన్స్ స్పోర్ట్స్ బెట్టింగ్ పోర్టల్..!!
- ప్రారంభమైన హెచ్ 1బీ, సోషల్ మీడియా స్క్రీనింగ్..
- ఆస్తుల పర్యాటక లీజు పై ప్రత్యేక కమిటీ..
- తెలంగాణ సత్తా ప్రపంచానికి చాటాం
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!







